Share News

మేడారానికి రక్షాతోరణం

ABN , Publish Date - Feb 15 , 2024 | 04:20 AM

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో మరో ప్రధాన ఘట్టానికి అంకురార్పణ జరిగింది. మండమెలిగే పండుగ బుధవారం ఘనంగా జరిగింది. మండమెలిగే పండుగలో భాగంగా వనదేవతల వడ్డెలు (పూజారులు) మేడారం గ్రామానికి రక్షా తోరణాలు కట్టారు. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ

మేడారానికి రక్షాతోరణం

ఘనంగా మండమెలిగే పండుగ.. నేటి నుంచి మరింత పెరగనున్న భక్తుల రద్దీ

21 నుంచి నాలుగు రోజుల పాటు మహాజాతర

ములుగు/మేడారం, ఫిబ్రవరి 14: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో మరో ప్రధాన ఘట్టానికి అంకురార్పణ జరిగింది. మండమెలిగే పండుగ బుధవారం ఘనంగా జరిగింది. మండమెలిగే పండుగలో భాగంగా వనదేవతల వడ్డెలు (పూజారులు) మేడారం గ్రామానికి రక్షా తోరణాలు కట్టారు. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ, ఏటూరునాగారం మండలంలోని గోవిందరాజులు, కొత్తగూడ మండలం పూనుగొండ్లలోని పగిడిద్దరాజు పూజామందిరాల్లో ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకలను నిర్వహించారు. సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయాలను పూజారులు, కుటుంబ సభ్యులు శుద్ధిచేసి అలుకుపూతలు, మామిడి తోరణాలతో అలంకరించారు. డోలు వాయిద్యాలతో గ్రామ, పొలిమేర దేవతల వద్దకు చేరుకుని జలాభిషేకాలు చేసి నూతన వస్త్రాలు సమర్పించారు. ఊరికి ఇరువైపులా రక్షా తోరణాలు కట్టారు. మామిడాకులు, నల్లకోడి, ఆనపకాయలు కట్టి ద్వారస్తంభాలు ఏర్పాటు చేశారు. దుష్టశక్తులు పొలిమేర దాటి లోపలికి ప్రవేశించకుండా కల్లు, మద్యం ఆరబోశారు. వనదేవతల గద్దెల వద్ద ప్రధాన పూజారులు జాగరణ చేశారు. 10 గంటల తర్వాత దర్శనాలను నిలిపేసి.. దేవతలకు యాటపోతులను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక, సరిగ్గా వారం రోజులకు ఈనెల 21న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెకు చేరుకోవడంతో మహాజాతర ప్రారంభమవుతుంది. 22న సమ్మక్క గద్దెకు రావడంతో మహాఘట్టం ఆవిష్కృతమవుతుంది. 23న మొక్కుల సమర్పణ, 24న దేవతలను వనప్రవేశం చేయించడంతో జాతర ముగుస్తుంది. నేటి నుంచి భక్తుల రద్దీ పెరగనుంది. బుధవారం 3 లక్షల మంది దేవతలను దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేశారు.

నేడు ఉత్సవ కమిటీ ప్రమాణం

మేడారం జాతర నిర్వహణ కోసం దేవాదాయ శాఖ 14 మంది సభ్యులతో తాత్కాలిక ఉత్సవ కమిటీని ఇటీవల ప్రకటించింది. గురువారం వారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Updated Date - Feb 15 , 2024 | 04:20 AM