Share News

సర్పంచులకు పెండింగ్‌ బిల్లుల సమస్య

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:23 AM

‘సర్పంచులకు పెండింగ్‌ బిల్లుల సమస్య ఉంది. గతంలో మన ప్రభుత్వం చేద్దామనుకున్నా కరోనా వల్ల కొంత కింద, మీద అయ్యింది.

సర్పంచులకు పెండింగ్‌ బిల్లుల సమస్య

మా హయాంలో కరోనాతో

కొంత కింద మీద అయింది

సర్పంచుల తరఫున గొంతు విప్పుతాం

ఆ బాధ్యతను మేం తీసుకుంటాం: కేటీఆర్‌

సిరిసిల్ల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘సర్పంచులకు పెండింగ్‌ బిల్లుల సమస్య ఉంది. గతంలో మన ప్రభుత్వం చేద్దామనుకున్నా కరోనా వల్ల కొంత కింద, మీద అయ్యింది. ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని ఆశిస్తున్నా. లేకుంటే సర్పంచుల తరఫున గొంతు విప్పి మాట్లాడుతాం. బిల్లులు ఇప్పించే బాధ్యత మాది’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న నేపఽథ్యంలో మంగళవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో సర్పంచులకు ఆత్మీయ సత్కారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పల్లెల దశ, దిశ మార్చిన సర్పంచులకు సలాం అని, దశాబ్దాలపాటు దగా పడ్డ తెలంగాణ పల్లె దేశం ముందు సగర్వంగా కాలర్‌ ఎగిరేసేలా చేసిన మహాయజ్ఞంలో మనసు పెట్టి పనిచేసిన సర్పంచులకు హ్యాట్సాప్‌ అని కొనియాడారు. పదవులు వస్తాయి పోతాయని, పదవీ కాలంలో ప్రజలు యాది చేసుకునే విధంగా పనిచేశామా.. లేదా? అనేదే ముఖ్యమని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినా ఇప్పటికి పల్లెల్లో చాలామంది కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా లేరా? అని మాట్లాడుకోవడం అంటే పేదలకు, రైతులకు మంచి చేయడం, ఊర్లు, పట్టణాలు బాగు చేయడం వల్లే మంచి పేరు వచ్చిందని పేర్కొన్నారు. దేశానికి పల్లెలు పట్టుకొమ్మలని మహాత్మాగాంధీ కన్న కలలను సాకారం చేసిన నేల తెలంగాణ అన్నారు. ఆనాడు ఒక కవి రాసిన పల్లె కన్నీరు పెడుతుంది.. అనే పాట గుండెలను ద్రవింపజేసిందని, ఎట్లా ఉన్న పల్లెలు, చెరువులు ఎట్లా నాశనమయ్యాయని చిరాకు వచ్చి ప్రభుత్వాన్నే కూల్చిందని చెప్పారు. ప్రస్తుత సర్పంచులు, వారి పిల్లలు, వారి ఊరు తెలంగాణ బిడ్డలు గర్వపడే విధంగా పనిచేశారని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధిపై గతంలో దేశంలోని ఇతర పార్టీల నాయకులను తాను సవాల్‌ చేశానని గుర్తు చేశారు. ఏ రాష్ట్రానికైనా వస్తానని.. తెలంగాణలో ఉన్నట్లు నర్సరీలు, డంపింగ్‌ యార్డులు, అంతిమ కార్యక్రమాలు సంస్కారవంతంగా జరిగే విధంగా వైకుంఠధామాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించినట్లు చెప్పారు.

Updated Date - Jan 17 , 2024 | 03:23 AM