Share News

‘అవినీతి’పై చర్యలకు సిద్ధం..!

ABN , Publish Date - Jan 11 , 2024 | 04:23 AM

ప్రభుత్వ పథకాల్లో భారీగా అవినీతి జరిగిందంటూ ముందు నుంచి ఆరోపించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాగానే చర్యలకు సిద్ధమైంది.

‘అవినీతి’పై చర్యలకు సిద్ధం..!

ఏసీబీ, విజిలెన్స్‌ విభాగాల బలోపేతం

సివిల్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి బాధ్యతలు

గొర్రెల పంపిణీ గోల్‌మాల్‌పై మొదలైన దర్యాప్తు

మేడిగడ్డ అక్రమాలపైనా రంగంలోకి బృందాలు

హైదరాబాద్‌, జనవరి10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాల్లో భారీగా అవినీతి జరిగిందంటూ ముందు నుంచి ఆరోపించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాగానే చర్యలకు సిద్ధమైంది. ఈ క్రతువులో అత్యంత కీలకమైన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ), విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలను బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండు విభాగాలు సిబ్బందిలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. విజిలెన్స్‌ విభాగం ఇంతకాలం ఇన్‌చార్జుల పాలనలోనే కొనసాగింది. ఏసీబీ చీఫ్‌గా ఉన్న అధికారే విజిలెన్స్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించేవారు. రేవంత్‌ సర్కారు మాత్రం విజిలెన్స్‌ విభాగానికి పూర్తిస్థాయి అధికారిని నియమించింది. ఇప్పుడు ఏసీబీ, విజిలెన్స్‌ విభాగాల్లో సిబ్బంది కొరతపై దృష్టి సారించింది. ముఖ్యంగా డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు సరిపడాలేరు. ఇంటెలిజెన్స్‌తో పనిచేసే కానిస్టేబుల్‌, హెడ్‌కానిస్టేబుల్‌ స్థాయి అధికారులు, కోర్టుల్లో కేసులు వీగిపోని విధంగా బలమైన చార్జిషీట్లు, నిందితులకు బెయిల్‌ రాకుండా శక్తిమంతమైన కౌంటర్లు వేసే దర్యాప్తు అధికారుల కొరత కొనసాగుతోంది. దీనికితోడు శాంతిభద్రతలతో ఏమా త్రం సంబంధంలేని టీఎ్‌సఎ్‌సపీ, సీపీఎల్‌, సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లను డిప్యుటేషన్‌పై పనిచేయిస్తున్నారు. అవినీతి అధికారులపై పక్కా సమాచారం అందినా పకడ్బందీగా రెక్కీకి కూడా హోంగార్డులపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో ఏసీబీలో పూర్తిస్థాయి సిబ్బందిని భర్తీ చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ శాఖకు సరిపడా వాహనాలను సమకూర్చేందుకు సిద్ధమయ్యారు. శాంతిభద్రతల విభాగంలో దర్యాప్తు నైపు ణ్యం ఉన్న కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు.. సిటీ టాస్క్‌ఫోర్స్‌లో సమర్థంగా పనిచేసినవారిని ఏసీబీలో నియమించాలని నిర్ణయించారు. గతంలో ఏసీబీలో పనిచేసిన ఇన్‌స్పెక్టర్‌, డీఎస్పీ స్థాయి అధికారుల చిట్టాను సిద్ధం చేసి, వారిని తిరిగి ఈ విభాగంలో నియమించే దిశలో చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. విజిలెన్స్‌ విషయంలోనూ ఇలాంటి కసరత్తే జరుగుతోంది. ఖాళీల లెక్క తీసి, పూర్తిస్థాయి సిబ్బంది నియామకాన్ని జరుపుతున్నారు. దీంతో పెండింగ్‌ కేసుల్లో దర్యాప్తు ఇప్పుడు వేగం పుంజుకుంది.

ఇక గత ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై ఏసీబీ దర్యాప్తు మొదలైంది. పశుసంవర్ధక శాఖలో ఇద్దరు అసిస్టెంట్‌ డైరెక్టర్లు, మరికొందరు రూ. 2.10 కోట్లకుపైగా గోల్‌మాల్‌ చేశారంటూ బాధితులు సైబరాబాద్‌ పోలీ్‌సలకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కేసు తీవ్రత నేపథ్యంలో ఇటీవలే ఏసీబీ రంగంలోకి దిగింది. త్వరలోనే గోల్‌మాల్‌ వ్యవహారంలో వాస్తవాలు నిగ్గుతేల్చే పనిలోపడింది. రాష్ట్రంలో జరిగిన అక్రమాలను వెలికితీసేదిశలో అడుగులు వేస్తోంది. ఈ కేసుతోపాటు పశుసంవర్ధక శాఖలో ఫైళ్ల మా యంపైనా ఏసీబీ దృష్టిసారించనుంది. కాగా ప్రస్తుతం విజిలెన్స్‌ విచారణ జరుపుతున్న మేడిగడ్డ బ్యారేజ్‌ వ్యవహారంలోనూ త్వరలోనే ఏసీబీ దర్యాప్తు చేపట్టనుంది. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న ఫైళ్లను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. విజిలెన్స్‌ నివేదిక, ప్రభుత్వ పరిశీలన తర్వాత తదుపరి ఆదేశాలతో ఏసీబీ రంగంలోకి దిగనుంది.

Updated Date - Jan 11 , 2024 | 06:21 AM