Share News

రేవంత్‌ ఇంటిపై ప్రణీత్‌ నిఘా

ABN , Publish Date - Mar 26 , 2024 | 04:01 AM

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎ్‌సఐబీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ల కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా, విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనను టార్గెట్‌గా చేసుకుని, ఇజ్రాయెల్‌ నుంచి తెప్పించిన ప్రత్యేక

రేవంత్‌ ఇంటిపై  ప్రణీత్‌ నిఘా

రేవంత్‌ నివాసం సమీపంలోనే అడ్డా

ప్రతి సంభాషణనూ విన్న అప్పటి అధికారులు

సహకరించిన ఎస్‌ఐబీ కన్సల్టెంట్‌ రవిపాల్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం

సినీ, రియల్టీ, నగల వ్యాపారుల ఫోన్లూ ట్యాప్‌!

ఇదే పద్ధతిలో వ్యాపారులను బెదిరించి.. ఎలక్టోరల్‌ బాండ్‌లను కొనిపించి.. సేకరణ!!

మూసీ వంతెన కింద లభ్యమైన హార్డ్‌డిస్క్‌లు

భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి కోరే చాన్స్‌

కలిపి విచారించేందుకు ప్రణీత్‌రావును కూడా

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతల ఫోన్ల ట్యాప్‌

ఇజ్రాయెల్‌ నుంచి ట్యాపింగ్‌ పరికరం కొనుగోలు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎ్‌సఐబీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ల కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా, విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనను టార్గెట్‌గా చేసుకుని, ఇజ్రాయెల్‌ నుంచి తెప్పించిన ప్రత్యేక డివైజ్‌తో ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారో కూడా తెలుసుకున్నట్లు దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చింది. ఇందుకోసం రవిపాల్‌ అనే సాంకేతిక నిపుణుడి సేవలను కన్సెల్టెంట్‌ పేరుతో ఎస్‌ఐబీ అధికారులు వినియోగించుకున్నట్లు సమాచారం. మావోయిస్టులపై నిఘా పేరుతో ఇజ్రాయెల్‌ ఓ పరికరాన్ని దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది. నిజానికి ఇలాంటి పరికరాల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. రవిపాల్‌ సాయంతో.. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా.. ఇజ్రాయెల్‌ నుంచి ప్రత్యేక పరికరాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది. ఆ పరికరం 300 మీటర్ల మేర ఉండే ఎలకా్ట్రనిక్‌ డివైజ్‌లలోకి చొరబడి.. వాటి మైక్రోఫోన్‌ను ఆన్‌ అయ్యేలా చేస్తుంది. ఆ పరిధిలో వైఫై, ఇంటర్నెట్‌ డేటాతో కనెక్ట్‌ అయిన ఎన్ని ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, అలెక్సా వంటి టూల్స్‌ కూడా ఆ డివైజ్‌ పరిధిలోకి వస్తాయని సమాచారం. జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో ఓ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్న ప్రణీత్‌రావు, రవిపాల్‌.. ఆయన కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుకుంటున్నారు? ఎన్నికల ఏం చర్చలు జరిగాయి? అనే సంభాషణలను నేరుగా విన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించేవారని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఐబీకి టెక్నికల్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరించిన రవిపాల్‌ను దర్యాప్తు అధికారులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరికరాన్ని ఇజ్రాయెల్‌ నుంచి తెప్పించి, రేవంత్‌ ఇంట్లో జరుగుతున్న విషయాలను చేరవేసినందుకు రవిపాల్‌కు రూ.కోట్లు చెల్లించినట్లు సమాచారం.

ఎలా సాధ్యం?

ఏదైనా సెల్‌ఫోన్‌ను ట్యాప్‌ చేయాలంటే.. హ్యాకర్లు అందులో మాల్‌వేర్‌ను చొప్పించాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లలో భద్రతాఫీచర్లు పెరుగుతున్నా.. అదే స్థాయిలో లొసుగులు ఉంటున్నాయని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు టార్గెట్‌ ఫోన్‌ హ్యాకర్‌ చేతికి వస్తేగానీ, మాల్‌వేర్‌ చొప్పించే అవకాశం ఉండేది కాదు. అయితే.. హ్యాకర్లు పంపే లింకులను క్లిక్‌ చేసినా.. మాల్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ అయ్యే ప్రమాదముంటుంది. వాట్సా్‌పలో ఒక ఫొటోను పంపి, దాన్ని క్లిక్‌ చేయగానే మాల్‌వేర్‌ ఇన్‌స్టాల్‌(స్టాగినోగ్రఫీ) అయ్యేలా చేయవచ్చని వివరిస్తున్నారు. పెగాసస్‌ వంటి స్పైవేర్‌లు వచ్చాక.. స్మార్ట్‌ఫోన్‌ చేతికి రాకున్నా.. ఫొటో, లింకులు పంపకున్నా.. టార్గెట్‌గా చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌లో వాడే ఏదైనా నిత్యావసర యాప్‌లో లొసుగులను ఆధారంగా చేసుకుని, మాల్‌వేర్‌ను చొప్పించవచ్చని నిరూపితమైందని గుర్తుచేస్తున్నారు. పైన పేర్కొన్న డివైజ్‌ కూడా అలాంటిదే అయ్యి ఉంటుందని అనుమానిస్తున్నారు. 300 మీటర్ల పరిధిలో ఉండే.. నెట్‌ కనెక్టివిటీ ఉన్న ఎలకా్ట్రనిక్‌ పరికరాల్లోకి చొచ్చుకుపోవడానికి ఆ డివైజ్‌ దోహదపడి ఉంటుందని పేర్కొంటున్నారు. ‘‘పబ్లిక్‌ వైఫైలో ఉంటే.. హ్యాకర్లు కొన్ని పేలోడ్స్‌ ద్వారా మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టా్‌పలలోకి చొరబడుతారు. ఇక్కడ కూడా ఆ డివైజ్‌ ఇలాంటి పనే చేసి ఉంటుంది. ఇజ్రాయెల్‌కు చెందిన సంస్థలు తయారు చేసే టూల్స్‌/డివైజ్‌లలో అన్నిరకాల ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలో ఉండే లొసుగులు, వాటిలోకి చొరబడేందుకు దోహదపడే పేలోడ్స్‌(ఉదాహరణకు విండోస్‌ 7లో మీటర్‌ప్రిటర్‌, విండోస్‌ 10, 11లో ఎటర్నల్‌బ్లూ) ఉంటాయి. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌గ్రేడ్‌ అయినా.. కొత్త వెర్షన్‌ వచ్చినా.. వెంటనే వాటి అప్‌డేట్స్‌ను ఇజ్రాయెల్‌ సంస్థలు అందజేస్తాయి. ఇక ఆ డివైజ్‌లను ఉపయోగించడానికి ఎలాంటి సాంకేతిక/కోడింగ్‌ పరిజ్ఞానం అవసరం లేదు. ఇప్పుడు వస్తున్న టూల్స్‌/డివైజ్‌లు అన్నీ.. గ్రాఫిక్‌ యూజర్‌ ఇంటర్‌ఫే్‌స(జీయూఐ)గా.. యూజర్‌ఫ్రెండ్లీగా ఉంటున్నాయి’’ అని నగరానికి చెందిన సైబర్‌సెక్యూరిటీ నిపుణుడు ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.

కర్ణాటక ఎన్నికల్లోనూ ట్యాపింగ్‌

గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఎస్‌ఐబీ కేంద్రంగా ప్రభాకర్‌రావు అండ్‌ కో అక్కడి కాంగ్రెస్‌ నేతల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు అధికారులు గుర్తించారు. బీఆర్‌ఎస్‌ మద్దతిచ్చిన జనతాదళ్‌(సెక్యులర్‌)కు అనుకూలంగా.. కాంగ్రెస్‌ వ్యూహాలను, ఆర్థిక వనరులను తెలుసుకుని, ఆ సమాచారాన్ని జేడీఎస్‌ ముఖ్యులకు చేరవేసినట్లు సమాచారం. కాంగ్రెస్‌ నేతలకు నిధులు ఎలా వస్తున్నాయి? వాటిని ఎలా పంపిణీ చేస్తున్నారు? అనే సమాచారం ద్వారా అక్కడి ఎన్నికల అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో పట్టుబడ్డ నగదు మొత్తంలో సింహభాగం కాంగ్రెస్‌ పార్టీకి చేందినదేనని తెలుస్తోంది. ఇక తెలంగాణ ఎన్నికల సమయంలోనూ.. కాంగ్రెస్‌ తరఫున ప్రచారానికి కర్ణాటక నేతలు కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో కూడా వారి ఫోన్లు ట్యాప్‌ అయినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

బెదిరించి.. ఎలక్టోరల్‌ బాండ్స్‌!

విపక్ష నేతల ఫోన్లతోపాటు.. వ్యాపారుల స్మార్ట్‌ఫోన్లను కూడా ప్రణీత్‌రావు ట్యాపింగ్‌ చేసినట్లు దర్యాప్తు అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. అయితే.. విపక్ష నేతలకు సహకరించే రియల్‌ఎస్టేట్‌, ఫార్మా, సాఫ్ట్‌వేర్‌ సంస్థల అధినేతల ఫోన్‌ ట్యాపింగ్‌లతో సుమారు 36 మంది దిగ్గజ వ్యాపారులతో ప్రణీత్‌రావు టచ్‌లోకి వెళ్లినట్లు గుర్తించారు. ఈ క్రమంలో వారిని బెదిరించి, ట్యాప్‌ చేసిన వారి ఆడియో/వీడియో క్లిప్‌లతో లొంగదీసుకుని, బీఆర్‌ఎ్‌సకు పెద్దమొత్తంలో ఎలక్టోరల్‌ బాండ్స్‌ వచ్చేలా చేసినట్లు అనుమానిస్తున్నారు.

మూసీ వంతెన కింద హార్డ్‌డిస్క్‌లు

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతి రోజు ఎస్‌ఐబీలో హార్డ్‌డి్‌స్కలను కటర్‌తో ధ్వంసం చేసిన ప్రణీత్‌రావు.. వాటి ముక్కలను అనంతగిరి అడవుల్లో పారేసినట్లు వాంగ్మూలమిచ్చిన విషయం తెలిసిందే..! పంజాగుట్ట ఠాణాకు చెందిన ఓ బృందం అనంతగిరి అడవుల్లో వెతికినా.. వాటి జాడ దొరకలేదు. అయితే.. భుజంగరావు, తిరుపతన్నల విచారణలో.. హార్డ్‌డి్‌స్కల ముక్కలను నాగోల్‌లోని మూసీ వంతెన కింద పారేసినట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం ఆ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి, రిట్రీవ్‌ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. హార్డ్‌డి్‌స్కల సెక్టార్లు దెబ్బతిన్నా.. అవి ఎండలో ఎక్స్‌పోజ్‌ అయినా.. డేటా రికవరీ అసాధ్యమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. గత వారం ప్రణీత్‌రావును కస్టడీకి తీసుకుని విచారించిన పోలీసులు.. ఇప్పుడు ఆయనను ఇంకా విచారించాల్సి ఉందని పేర్కొంటూ మరోమారు కోర్టులో పిటిషన్‌ వేసే సూచనలు కనిపిస్తున్నాయి. భుజంగరావు, తిరుపతన్నను కూడా వారంపాటు కస్టడీకి తీసుకుని, ఈ ముగ్గురినీ కలిపి విచారించే అవకాశాలున్నాయి.

దమ్కీ ఇచ్చిన నిందితులు?

ఈ కేసులో అరెస్టయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను విచారించిన అధికారులకు ధమ్కీ ఇచ్చినట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. తాము ఉన్నతాధికారుల ఆదేశాలను మాత్రమే పాటించామని, సొంతంగా చేసిందేమీ లేదంటూ పదేపదే చెప్పినట్లు సమాచారం. వజ్రాల వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాపింగ్‌ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారా? అన్న ప్రశ్నకు వీరిద్దరూ మౌనం దాల్చినట్లు తెలిసింది. కొన్ని ప్రశ్నలకు వీరిద్దరూ దమ్కీ(బెదిరింపు)కి దిగినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ‘‘మమ్మల్ని మీరు ఇప్పుడు విచారిస్తున్నారు. ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు మీరెలా చేస్తున్నారో.. మేం కూడా అప్పట్లో అలానే చేశాం’’ అంటూ ఓ అధికారిని నోటికి వచ్చినట్లుగా మాట్లాడినట్లు సమాచారం.

చంచల్‌గూడ జైల్లోనూ అదే సీన్‌?

ప్రణీత్‌ రావు, భుజంగరావు, తిరపతన్నను చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. వీరికి వేర్వేరు సెల్స్‌ను కేటాయించారు. వీరు ఎవరినీ కలుసుకోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. వీరున్న మూడు సెల్స్‌లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని, హైప్రొఫైల్‌ కేసు కావడంతో 24 గంటలూ నిఘా కొనసాగుతోందని తెలుస్తోంది. భుజంగరావు, తిరుపతన్న జైలు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. ‘‘మేం అదనపు ఎస్పీ స్థాయి అధికారులం. మాకు ప్రత్యేక సౌకర్యాలు కావాలి’’ అని డిమాండ్‌ చేయడంతో వారు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దాంతో ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. ‘‘మేము నేరస్థులం కాదు. మాపై ఫిర్యాదు వస్తే.. అదుపులోకి తీసుకున్నారు’’ అంటూ వారితోనూ దురుసుగా అన్నట్లు తెలిసింది. దీనికి అధికారులు సీరియ్‌సగా బదులిచ్చినట్లు చర్చ జరుగుతోంది. ‘‘జైలు మాన్యువల్స్‌ ప్రకారమేనడుచుకుంటాం. మీకు ప్రత్యేక వసతులు కల్పించలేం. మీ వ్యవహార శైలి సరిగ్గా లేదు’’ అని సీరియస్‌ అవ్వడంతో.. భుజంగరావు, తిరుపతన్న మిన్నకుండిపోయారని సమాచారం.

టచ్‌లోకి ప్రభాకర్‌రావు

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ముదరడంతో అమెరికాలో ఉన్న ప్రభాకర్‌ రావు పోలీసులకు టచ్‌లోకి వచ్చినట్లు తెలిసింది. ఆయన అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారికి ఫోన్‌కాల్‌ చేసినట్టు సమాచారం. ‘‘నేను క్యాన్సర్‌ చికిత్స కోసం అమెరికాకు వచ్చాను. జూన్‌ లేదా జూలైలో హైదరాబాద్‌కు తిరిగి వస్తాను. మీరు ప్రస్తుత ప్రభుత్వం చెప్పినట్లు పనిచేస్తున్నారు. నేను కూడా గత ప్రభుత్వం చెప్పినట్లుగానే పనిచేశాను. మనం అంతా పోలీసులం. మనంమనం ఒక్కటి’’ అని తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. తమ ఇళ్లలో జరుపుతున్న సోదాలను వెంటనే ఆపాలని కోరినట్లు సమాచారం. అయితే.. ప్రభాకర్‌రావు మాట్లాడిని అధికారి మాత్రం.. ‘‘మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే.. అధికారిక ఈ-మెయిల్‌కు పూర్తి సమాధానం పంపండి’’ అని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే ప్రభాకర్‌రావు ఫోన్‌ కట్‌చేసినట్లు సమాచారం. కాగా.. ప్రభాకర్‌రావు ఎస్పీ ర్యాంకులో తూర్పుమండలం డీసీపీగా ఉన్నప్పుడే గొంత క్యాన్సర్‌ బయటపడిందని, అప్పట్లోనే చికిత్స చేసుకున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత డీఐజీ ర్యాంకులో హైదరాబాద్‌ సీసీఎస్‌ జాయింట్‌ సీపీగా పనిచేశారు.

బాధితులుంటే ఫిర్యాదు చేయొచ్చు

ప్రణీత్‌రావు పలువురు వ్యాపారులను బెదిరించినట్లు ఈ కేసు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసులో ఉన్న అధికారులు గతంలో బ్లాక్‌మెయిల్‌ చేసినా.. బెదిరింపులకు పాల్పడి ఉన్నా.. ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పశ్చిమ మండలం పోలీసులు సూచిస్తున్నారు. ఓ మాజీ మంత్రి, ఆయన బంధువులను కూడా ఈ గ్యాంగ్‌ బెదిరించినట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలను సేకరించారు.

అమెరికా నుంచి ప్రభాకర్‌రావు ఫోన్‌

ట్యాపింగ్‌ వ్యవహారం ముదరడంతో అమెరికాలో ఉన్న ప్రభాకర్‌ రావు రాష్ట్ర పోలీసులకు టచ్‌లోకి వచ్చినట్లు తెలిసింది. ఓ ఉన్నతాధికారికి ఫోన్‌కాల్‌ చేసి.. ‘‘నేను క్యాన్సర్‌ చికిత్స కోసం అమెరికాకు వచ్చాను. జూన్‌ లేదా జూలైలో తిరిగొస్తా. మీరు ప్రస్తుత ప్రభుత్వం చెప్పినట్లు చేస్తున్నారు. నేను గత ప్రభుత్వం చెప్పినట్లు చేశా. మనం అంతా పోలీసులం’’ అని తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. తమ ఇళ్లలో సోదాలను వెంటనే ఆపాలని కోరినట్లు సమాచారం.

Updated Date - Mar 26 , 2024 | 01:08 PM