Share News

‘శ్రీరామరక్షా స్తోత్రమ్’ను ఆవిష్కరిస్తూ పురాణపండ శ్రీనివాస్‌కు ప్రశంసలు

ABN , Publish Date - Apr 13 , 2024 | 10:49 PM

ఒక వైపు లోకోత్తర లావణ్యం, మరొక వైపు రణకర్కశ రౌద్రం నిండిన ధర్మావతారమైన శ్రీరామచంద్రుని కీర్తించి మహా మహా విజయాలను పొందే అద్భుత శ్రీరామరక్షాస్తోత్రాన్ని ఈసారి భద్రాద్రి శ్రీరామనవమి ఉత్సవాలలో వేలాది భక్తులకు ఉచితంగా పంచే భాగ్యాన్ని ప్రసాదించిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం ధార్మిక సేవను శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి ఎల్. నాగమణి అభినందించారు.

‘శ్రీరామరక్షా స్తోత్రమ్’ను ఆవిష్కరిస్తూ పురాణపండ శ్రీనివాస్‌కు ప్రశంసలు

భద్రాచలం, ఏప్రిల్ 13: ఒక వైపు లోకోత్తర లావణ్యం, మరొక వైపు రణకర్కశ రౌద్రం నిండిన ధర్మావతారమైన శ్రీరామచంద్రుని కీర్తించి మహా మహా విజయాలను పొందే అద్భుత శ్రీరామరక్షాస్తోత్రాన్ని ఈసారి భద్రాద్రి శ్రీరామనవమి ఉత్సవాలలో వేలాది భక్తులకు ఉచితంగా పంచే భాగ్యాన్ని ప్రసాదించిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం ధార్మిక సేవను శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి ఎల్. నాగమణి అభినందించారు. శ్రీరామనవమి వసంతోత్సవాల సందర్భంగా శనివారం ప్రత్యేకంగా ఏర్పాటైన వేడుకలో రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ పూర్వ ప్రత్యేక సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ పరమశోభాయ మానంగా, పవిత్ర వ్యాఖ్యానాలతో అందించిన ‘శ్రీరామరక్షా స్తోత్రమ్’ గ్రంధాన్ని ఆమె ఆవిష్కరించి తొలిప్రతిని దేవస్థానం స్థానాచార్యులు స్థలసాయికి అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రధానాచార్యులు పి. సీతారామానుజాచార్యులు మాట్లాడుతూ.. శ్రీరామ రక్షాస్తోత్రాన్ని తెలుగు భక్తప్రపంచానికి అందించిన మొదటి ఘనత విఖ్యాత ఆధ్యాత్మిక వేత్త పురాణపండ రాధాకృష్ణమూర్తిదేనని చరిత్రపుటల్లో చెబుతున్నాయని, ఇప్పుడు ఆయన కుమారుడైన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అత్యంత వేగవంతంగా చేస్తున్న ఆధ్యాత్మిక గ్రంథ రచనాకృషి ఆశ్చర్యపరుస్తోందని పేర్కొంటూ శ్రీనివాస్ అందమైన శైలి, అద్భుతమైన గ్రంథ ముద్రణా సొగసులు పాఠకుల మనస్సులను కొల్లగొడుతున్నాయని ప్రసంశించారు.

Puranapanda.jpg

స్థానాచార్యులు స్థలసాయి మాట్లాడుతూ శ్రీరామరక్షాస్తోత్రం జీవితానికి గొప్ప ఆత్మశక్తిగా అభివర్ణిస్తూ పురాణపండ శ్రీనివాస్ తన తండ్రిగారి కీర్తిని జయపతాకంలా ఎగురవేస్తూ గ్రంధాలతో ఉద్యమించడం మన కన్నులముందే కనిపిస్తోందని... ఇదంతా సీతారామచంద్రుల కటాక్షమేనని ప్రశంసించారు. దేవస్థాన సీనియర్ అసిస్టెంట్ అన్నెం శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో వందలాది భక్తులకు ఈ అమోఘ గ్రంధాన్ని వితరణ చేయడం శ్రీరామానుగ్రహమేనని అర్చకపండిత వర్గాలు పేర్కొన్నాయి. శ్రీరామనవమి కల్యాణంలో పాల్గొనే దాతలకు, భక్త దంపతులకు ఈ రక్షా ప్రసాదం అద్భుతమని ఇప్పటికే భక్త సముద్రం పురాణపండను అభినందిస్తోంది.

Updated Date - Apr 14 , 2024 | 06:10 AM