సాగర్‌లో ‘పవర్ ఫుల్’
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:59 AM
నాగార్జునసాగర్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని మూడు నెలల్లోనే చేరుకున్నారు. రెండేళ్ల తర్వాత ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద వచ్చి చేరటంతో ఈ ఏడాది సాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో జూలై 24వ తేదీన విద్యుదుత్పత్తిని ప్రారంభించారు.

నాగార్జునసాగర్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని మూడు నెలల్లోనే చేరుకున్నారు. రెండేళ్ల తర్వాత ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద వచ్చి చేరటంతో ఈ ఏడాది సాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో జూలై 24వ తేదీన విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ఈ ఏడాది విద్యుదుత్పత్తి లక్ష్యం 1,400 మిలియన్ యూనిట్లు కాగా మూడు నెలల్లో మంగళవారం మధ్యాహ్నం (అక్టోబరు 22వ తేదీ) నాటికి లక్ష్యాన్ని చేరుకున్నట్లు జెన్‌కో సీఈ మంగే్‌షకుమార్ తెలిపారు. బుధవారం ఒక్క రోజుకు 75 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి కాగా మొత్తం విద్యుదుత్పత్తి 1,475 మిలియన్ యూనిట్లు సీఈ తెలిపారు. గత ఏడాది సాగర్‌కు ఎగువ నుంచి వరద రాకపోవడంతో విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని (1530 మిలియన్ యూనిట్లు) చేరుకోలేదు. ఈ ఏడాది ఈ ఆర్థిక సంవత్సరంలో (ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు) జూన్ మొదటి వారంలో సాగర్‌కు నీటి రాక లేక విద్యుదుత్పత్తి ప్రారంభించలేదు. జూలై 24వ తేదీ నుంచి ఎగువనుంచి సాగర్‌కు వరద రాక ప్రారంభం కావడంతో ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని జెన్‌కో అధికారులు ప్రారంభించారు. ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో మొత్తం ఎనిమిది టర్బైన్లు ఉండగా ఒక్కో టర్బైన్ నుంచి 110 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అందులో రెండో నంబరు టర్బైన్ ఏడాదిగా మరమ్మతులకు గురైంది. దీంతో ప్రస్తుతం ఏడు టర్బైన్ల ద్వారా విద్యుదుత్పత్తి చేసినప్పటికి మూడు నెలల కాలంలో లక్ష్యాన్ని చేరుకున్నామని సీఈ తెలిపారు. రెండో నంబరు టర్బైన్ మరమ్మతు పనులు మంగళవారం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. మరమ్మతు చేసేందుకు జపాన్ దేశం నుంచి సాంకేతిక నిపుణులు రావాల్సి ఉండగా సరైన సమయంలో వారు రాలేదు. వారం రోజుల క్రితం వారు సాగర్‌కు వచ్చారు. నిపుణుల సలహాలు, సూచనల మేరకు మరమ్మతుల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెండు నెలల సమయం పడుతుందని జపాన్ ఇంజనీర్లు తెలుపగా, 45 రోజుల్లో పూర్తి చేయాలని కోరినట్లు సీఈ తెలిపారు.
నాలుగేళ్లలో సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ఇలా..
సంవత్సరం లక్ష్యం(మిలియన్ ఉత్పత్తి
యూనిట్లు) (మి.యూ)
2019-20 1289 1512.85
2020-21 1290 1248.78
2021-22 1535 2262.62
2022-23 1500 2355.63
2023-24 1530 540.83
2024-25 1400 1400
(జూలై 24 నుంచి అక్టోబరు22 వరకు)