Share News

తల్లిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:20 AM

కన్న తల్లిని అడ్డుపెట్టుకొని మంత్రి పొన్నం ప్రభాకర్‌ రాజకీయం చేయాలనుకుంటున్నాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు.

తల్లిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు

పొన్నం తల్లిని నేను అవమానించలేదు

యాత్రను ఆపేయాలనుకుంటే కాంగ్రె్‌సకే నష్టం

హామీల అమలును ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..?

నేను ఓడితే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా

కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడితే పొన్నం తప్పుకుంటారా?

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్‌

హుస్నాబాద్‌, ఫిబ్రవరి 27: కన్న తల్లిని అడ్డుపెట్టుకొని మంత్రి పొన్నం ప్రభాకర్‌ రాజకీయం చేయాలనుకుంటున్నాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. ‘రాముడు అయోధ్యలోనే పుట్టాడా..?’ అని అడిగిన వారిని ప్రశ్నించాను తప్ప.. పొన్నం తల్లిని ఉద్దేశించి అనలేదని వివరణ ఇచ్చారు. అందరు తల్లులు తన తల్లితో సమానమని.. ప్రభాకర్‌ తల్లిని తాను అవమానించలేదని స్పష్టం చేశారు. తాను అంత సంస్కార హీనుడిని కారని అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో జరిగిన ప్రజాహిత యాత్ర బహిరంగ సభలో సంజయ్‌ మాట్లాడారు. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ వచ్చేలోగా కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే.. అడుగడుగునా నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. హామీల అమలుకు ఇంకా 20 రోజులే గడువు ఉందన్నారు. రేషన్‌ కార్డులు ఉన్న వారికే పథకాలు ఇస్తామని చెబుతున్నారని.. రేషన్‌ కార్డులు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. తాను హామీల అమలును ప్రశ్నిస్తే.. కాంగ్రెస్‌ దాడులు చేయించడం ఏంటని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్‌ ఏమీ చేయలేదు కాబట్టే గత ఎంపీ ఎన్నికల్లో మూడో స్థానం వచ్చిందని తెలిపారు. అయోధ్య అక్షింతలను రేషన్‌ బియ్యం అని ఆయన అన్నది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. ప్రజాహిత యాత్రను ఆపాలనుకుంటే కాంగ్రె్‌సకే నష్టమని హెచ్చరించారు.

కేసీఆర్‌ పదేళ్లలో రూ.5 లక్షల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్‌ 2 నెలల్లో రూ.10వేల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నందుకు స్వర్గంలో ఉన్న పొన్నం తల్లి ఆత్మ ఎంత క్షోభిస్తుందోనని సంజయ్‌ అన్నారు. అయితే, పక్కనే ఉన్న నాయకులు పొన్నం తల్లి బతికే ఉందని.. తండ్రి చనిపోయాడని తెలిపారు. దీంతో పొరపాటును గుర్తించిన సంజయ్‌.. పొన్నం తండ్రి ఆత్మ ఎంత క్షోభిస్తుందోనని అన్నారు. ఆయన తల్లి నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ‘రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి సవాల్‌ విసురుతున్నా.. నేను నా విశ్వాసాలతో రాముడి పేరిట ఎంపీ ఎన్నికల్లో నిలుచుంటా. నువ్వు నీ వాదనతో అభ్యర్థిని నిలబెట్టు. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. మళ్లీ రాముడని, హిందూ మతమని మాట్లాడను. మీ అభ్యర్థి ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటావా..?’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. కేటీఆర్‌తో బీఆర్‌ఎస్‌ నాశనమైందని, పొన్నం లాంటి వారితో కాంగ్రెస్‌ నాశనమవుతుందని పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ బియ్యం ఇస్తుంటే మీ ఫొటోలు పెట్టుకుంటారా.. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా బియ్యం ఇస్తోందని, ఇక్కడికి బియ్యం పంపవద్దని ప్రధాని మోదీకి లేఖ రాస్తా’ అని అన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 09:00 AM