Share News

ఫోన్‌ ట్యాపింగ్‌లో ఆ నలుగురినీ నిందితులుగా చేర్చాలి

ABN , Publish Date - Apr 03 , 2024 | 06:32 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని నిందితులుగా చేర్చాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు డిమాండ్‌

ఫోన్‌ ట్యాపింగ్‌లో ఆ నలుగురినీ నిందితులుగా చేర్చాలి

దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ట్యాపింగ్‌

2014 నుంచీ విచారణ చేపట్టాలి: రఘునందన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని నిందితులుగా చేర్చాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీ అనుమతి అవసరమని, అలాంటప్పుడు వారి పేర్లు ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. తమ ఫోన్లు ట్యాప్‌ అయ్యాయని ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ను నిలదీశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ను అరెస్టు చేసినప్పుడు ఉన్న డీజీపీ, ఇంటలిజెన్స్‌ చీఫ్‌, ఎస్‌ఐబీ చీఫ్‌ను కూడా విచారించాలని డీజీపీని కోరారు. వారిని విచారించినప్పుడే దర్యాప్తు పారదర్శకంగా సాగుతున్నట్లు ప్రజలు భావిస్తారన్నారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం సందర్భంగా వాహనంలో రూ.30కోట్లు ఉన్నట్లు పోలీసు అధికారి స్టీపెన్‌ రవీంద్ర ఆనాడు ప్రకటించారని, ఆ డబ్బులు ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు. దీనిపై ఈడీకీ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా, మోకాళ్లపై యాదగిరిగుట్ట ఎక్కి హిందువులకు వారసులం అని చెప్పినా బీఆర్‌ఎ్‌సను ప్రజలు నమ్మబోరని హరీశ్‌కు స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా వంద కోట్లు ఖర్చు చేస్తానంటూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి చెబుతున్నారని విమర్శించారు. వెంకట్రామిరెడ్డిని ఆయన బంధువు, మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాపాడుతున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు.

Updated Date - Apr 03 , 2024 | 06:33 AM