Share News

ఫార్మా విలేజ్‌లు!

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:49 PM

వికారాబాద్‌ జిల్లాను గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్‌గా అభివృద్ధి పరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్‌ పరిధిలో ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడేలా చర్యలు తీసుకోనున్నారు.

ఫార్మా విలేజ్‌లు!

వికారాబాద్‌ జిల్లాలో గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్టస్టర్‌

లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండేలా ప్రణాళిక

కొడంగల్‌లో మూడువేల ఎకరాల గుర్తింపు

వికారాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వికారాబాద్‌ జిల్లాను గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్‌గా అభివృద్ధి పరచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్‌ పరిధిలో ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడేలా చర్యలు తీసుకోనున్నారు. విద్య, వైద్య సేవలతో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించే విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాను పారిశ్రామిక పరంగానూ అభివృద్ధి పరిచే విధంగా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వికారాబాద్‌, మెదక్‌, నల్లగొండ జిల్లాలను ఎంపిక చేసింది. ఒక్కో గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్‌ పరిధిలో మూడు నుంచి నాలుగు ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఫార్మా విలేజ్‌ల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా రాయితీలు ఇవ్వనున్నారు. పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు కల్పించి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో ఏర్పాటు చేసే గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్‌ పరిధిలో అభివృద్ది పరిచే ఫార్మా విలేజ్‌ల ద్వారా లక్ష నుంచి లక్షన్నర మందికి కొత్త ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది.

అత్యంత సమీపంలో వికారాబాద్‌ జిల్లా

రాష్ట్ర రాజధానికి, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండడం వికారాబాద్‌ జిల్లాకు కలిసి వచ్చింది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి వికారాబాద్‌ 70 కిలోమీటర్ల దూరం ఉంది. విమానాశ్రయం నుంచి వికారాబాద్‌ జిల్లా చేరుకునేందుకు గంటన్నర సమయం పట్టనుంది. విమానాశ్రయానికి అత్యంత సమీపంలో గ్రీన్‌ ఫీల్డ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయడం వల్ల ఇతర దేశాల్లోని పారిశ్రామిక వేత్తలు ఆకర్షితులై ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారులకు అతి సమీపంలోనే ఈ ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌, తాండూరు నియోజకవర్గాల్లో గ్రీన్‌ ఫీల్డ్‌ క్లస్టర్‌ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారనేది స్పష్టత రావాల్సి ఉంది. పారిశ్రామిక పరంగా అభివృద్ధి పరిచేందుకు ఇప్పటికే కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలో మూడు వేల ఎకరాల వరకు గుర్తించినట్లు తెలిసింది. పరిగి, వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాల్లోనూ పరిశ్రమల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రీన్‌ ఫీల్డ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు వికారాబాద్‌ జిల్లాను ఎంపిక చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి.

Updated Date - Feb 27 , 2024 | 11:49 PM