Share News

వ్యక్తిగత వ్యవహారాల్లో ‘నిఘా’ ఆందోళనకరం

ABN , Publish Date - Mar 27 , 2024 | 04:23 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో వెలుగుచూస్తున్న విషయాలు తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేస్తున్నాయని సీసీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నాయకులు, ప్రముఖల వ్యక్తిగత వ్యవహారాల్లో నిఘా వ్యవస్థ తలదూర్చడం అత్యంత

వ్యక్తిగత వ్యవహారాల్లో ‘నిఘా’ ఆందోళనకరం

దీని వెనుకున్న వారిని శిక్షించాలి: కూనంనేని

హైదరాబాద్‌, యాదాద్రి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో వెలుగుచూస్తున్న విషయాలు తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేస్తున్నాయని సీసీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నాయకులు, ప్రముఖల వ్యక్తిగత వ్యవహారాల్లో నిఘా వ్యవస్థ తలదూర్చడం అత్యంత ఆందోళనకరమైన అంశమని ఆయన పేర్కొన్నారు. నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఇంటి సమీపంలో ఇళ్లను అద్దెకు తీసుకుని అక్కడ ఉండి ఆధునిక పరికరాలతో ఆయన ఇంట్లో ఏమి మాట్లాడుకుంటున్నారో రికార్డు చేసి విన్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారం పోలీసుల సొంత నిర్ణయం కాదని, దీని వెనుకాల ఉన్న వ్యక్తులు, కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతికి చట్టబద్ధత కల్పించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెగాసస్‌ ద్వారా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టిందని, అదేమాదిరిగా రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిందని, వీటిపై సమగ్ర విచారణ జరిపించాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 27 , 2024 | 04:23 AM