Share News

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:17 PM

గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు తక్షణమే చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ (టీపీజీపీడబ్ల్యూయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జె.ఎన్‌ దేవదానం, సాంబశివుడు డిమాండ్‌ చేశారు.

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి
కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న పంచాయతీ కార్మికులు

- కలెక్టరేట్‌ ముందు పంచాయతీ కార్మికుల ఆందోళన

పాలమూరు, జూలై 5 : గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు తక్షణమే చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ (టీపీజీపీడబ్ల్యూయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జె.ఎన్‌ దేవదానం, సాంబశివుడు డిమాండ్‌ చేశారు. జీ.వో నెం.60 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, అందులో పనిచేస్తున్న మల్టీపర్పస్‌ వర్కర్స్‌ అతి తక్కువ వేతనాలకు పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.9,500లకే కార్మికులు నెలంతా కష్టపడి పని చేస్తున్నారని తెలిపారు. ఇచ్చే అతి తక్కువ వేతనం నెలల తరబడి పెండింగ్‌లో పెడితే కార్మికుల కుటుంబాలు ఎలా బతకాలని ప్రశ్నించారు. పంచాయతీ కార్మికులకు వేతనాల కోసం ప్రత్యేక గ్రాంటు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన కాకుండా అవసర ప్రాతిపదికన పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, గ్రాట్యుటీ కల్పిస్తూ జీవో నెం.60 ప్రకారం వేతనాలు అందజే యాలన్నారు. ఆదివారం, పండుగ సెలవులు, జాతీయ, అంతర్జాతీయ సెలవులు అమలు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు కె.గణేష్‌, బాలు, కొండన్న, కె.చంద్రన్న, జనార్దన్‌, కుర్మన్న, వెంకట్రాములు, రిజ్వానా, జరినా, అంజమ్మ, కుర్మమ్మ, బాలకృష్ణ, చెన్నయ్య, శ్యాంసన్‌, విను, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 11:17 PM