KCR : పార్టీ వీడిన వారిని మళ్లీ తీసుకోం
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:19 AM
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్‌ఎ్‌సను వీడి.. ఇతర పార్టీల్లో చేరుతున్న వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోబోమని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యమ పార్టీగా మొదలై, రాష్ట్రాన్ని సాధించి.. అధికారం చేపట్టిన బీఆర్‌ఎ్‌సలో పలువురికి రాజకీయ ..

అవకాశవాదులు వస్తుంటారు.. పోతుంటారు..
పార్టీ ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండాలి
అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తీర్పును ఊహించలేకపోయాం: కేసీఆర్
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్‌ఎ్‌సను వీడి.. ఇతర పార్టీల్లో చేరుతున్న వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోబోమని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యమ పార్టీగా మొదలై, రాష్ట్రాన్ని సాధించి.. అధికారం చేపట్టిన బీఆర్‌ఎ్‌సలో పలువురికి రాజకీయ భవిష్యత్తు దక్కిందని, కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు పార్టీని వీడటం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మంగళవారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ భేటీలోనే మహబూబ్‌నగర్ అభ్యర్థిగా సిటింగ్ ఎంపీ మన్నె శ్రీనివా్‌సరెడ్డి పేరును ప్రకటించారు. నాగర్‌కర్నూల్ అభ్యర్థి ఎవరనేది త్వరలో పార్టీ ముఖ్యులతో చర్చించి వెల్లడిస్తామన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఇలా ఉంటుందని ఊహించలేకపోయామన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో చేశామని, అయినా అక్కడ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వలసలు అధికంగా ఉండే ఆ జిల్లాలో తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చిందని, వివిధ రంగాల్లో పురోభివృద్ధి సాధించామని, అక్కడ బీఆర్‌ఎస్ ఓడాల్సింది కాదని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను తాము అధికశాతం పూర్తిచేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాల్వల నిర్మాణం పూర్తిచేయడం, నీళ్లు ఇవ్వడమే మిగిలి ఉందని చెప్పారు. సందర్భంగా.. కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్తున్న వారిని మళ్లీ చేర్చుకోవద్దని కొందరు నేతలు కోరగా.. వారిని మళ్లీ తీసుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘నాగర్‌కర్నూల్ ఎంపీ రాములుకు ఏం తక్కువ చేశాం? రాములుతోపాటు ఆయన కుమారుడికీ పార్టీ అవకాశాలు కల్పించింది. ఇలాంటి అవకాశవాదులు వస్తుంటారు.. పోతుంటారు. దానిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గెలిచినా, ఓడినా.. మనం, మన పార్టీ ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండేలా చూడాలి’’ అని పార్టీ నేతలతో కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చి..
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు అలవికాని హామీలిచ్చి.. వెనకా ముందు చూడకుండా ప్రజల్లో ఆశలు రేకెత్తించారని కేసీఆర్ విమర్శించారు. నిన్నటిదాకా ప్రజలను మభ్యపెట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు హామీల అమలుపై నాలుక మడతపెట్టి తిట్లకు దిగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా హామీలిచ్చి.. ఇప్పుడు ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం ప్రభుత్వ అనాలోచిత చర్య అన్నారు. బీఆర్‌ఎ్‌సపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని నమ్మి ఓట్లేసిన వారికి ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుస్తున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని పక్కనపెట్టి.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమిష్టి కృషితో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఈ పొత్తు ద్వారా దళిత, బహుజనులను మరింత చేరువ చేసుకోగలమని అభిప్రాయపడ్డారు. ఒకటి, రెండు ఎంపీ స్థానాలను బీఎస్పీకి ఇచ్చినా.. రెండు పార్టీల సమన్వయంతో అభ్యర్థులను గెలిపించుకోవచ్చన్నారు.
నాగర్‌కర్నూల్ అభ్యర్థిగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్?
బీఆర్‌ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పోటీచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు ఇటీవల బీఆర్‌ఎ్‌సను వీడి.. తన కుమారుడు భరత్ ప్రసాద్‌తో కలిసి బీజేపీలో చేరడం, వెంటనే ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా భరత్‌ను ప్రకటించడం తెలిసిందే. దీంతో అక్కడ బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయడానికి సరైన అభ్యర్థి లేకుండా పోయారు. తాజాగా బీఆర్‌ఎ్‌స-బీఎస్పీ పొత్తుతో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పేరు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంత జిల్లా కావడంతో ఆయన కూడా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.