‘పాలేరు’ నిండేదాకా పహారా
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:58 AM
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుంచి విడుదలైన నీరు ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో నిండేదాకా పెట్రోలింగ్ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. మధ్యలో ఎక్కడా రైతులు తూములు తీయకుండా..

సాగర్ ఎడమ కాల్వపై నేటి నుంచి పెట్రోలింగ్
మధ్యలో రైతులు నీటిని వాడుకోకుండా చర్యలు
నడిగూడెం, ఏప్రిల్ 2: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుంచి విడుదలైన నీరు ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో నిండేదాకా పెట్రోలింగ్ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. మధ్యలో ఎక్కడా రైతులు తూములు తీయకుండా.. జలాలు నేరుగా పాలేరుకు చేరేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు మంగళవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ హేమమాలిని, ఎంపీడీవో ఇమాం, పీఆర్ ఏఈ రంగారావు, ఎన్నెస్పీ ఏఈ వెంకటేశ్వర్లు, కార్యదర్శులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో తాగునీటి ఎద్దడి దృష్ట్యా ఎడమ కాల్వ ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని తరలించి పాలేరు రిజర్వాయర్‌ను నింపడమే లక్ష్యంగా సోమవారం కాల్వలోకి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం అడవిదేవులపల్లి రిజర్వాయర్ నిండగా, కిందికి వస్తున్న నీరు పొనుగోడు ఎస్కేప్ దాటి మునగాల హెడ్‌రెగ్యులేటర్ ద్వారా సాగర్ నుంచి 130 కి.మీ. దూరంలోని పాలేరు రిజర్వాయర్‌కు చేరుతుంది. ఈ మధ్యలో రైతులు నీటిని వినియోగించుకునేందుకు ఆస్కారం ఇవ్వకుండా బుధవారం నుంచి పటిష్ఠ బందోబస్తు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా పంచాయతీ కార్యదర్శులు, పోలీస్, రెవెన్యూ అధికారులు రాత్రి వేళ్లలో గస్తీ చేపట్టనున్నారు. పాలేరు రిజర్వాయర్ నిండేందుకు ఐదు రోజులు పడుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, 2004లోనూ ఇలాగే గస్తీ నిర్వహించి పాలేరుకు నీటిని తరలించారు.