Share News

పాలమూరు పర్యావరణ అనుమతులు జటిలమే!

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:50 AM

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రెండో దశ పర్యావరణ అనుమతులు ఇప్పట్లో వచ్చేలా లేవు. ప్రాజెక్టుకు రెండో దశ పర్యావరణ అనుమతులను మంజూరు చేయాలంటూ గతంలోనే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) సిఫారసు చేసింది.

పాలమూరు పర్యావరణ అనుమతులు జటిలమే!

రెండో దశ అనుమతులకు కేంద్రం ప్రత్యేక కమిటీ

ఆ కమిటీ నివేదిక వచ్చాకే అనుమతులు!

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రెండో దశ పర్యావరణ అనుమతులు ఇప్పట్లో వచ్చేలా లేవు. ప్రాజెక్టుకు రెండో దశ పర్యావరణ అనుమతులను మంజూరు చేయాలంటూ గతంలోనే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) సిఫారసు చేసింది. అయితే ఈ అనుమతి రావాలంటే మరిన్ని ప్రతిబంధకాలను దాటాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ప్రాజెక్టుపై ఎన్జీటీ విధించిన జరిమానా నిధుల వినియోగానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి, ఆ నివేదిక వచ్చిన తర్వాతే రెండో దశ పర్యావరణ అనుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. ఇక ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కోరగా.. డీపీఆర్‌కు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపితే హోదాను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిబంధనలకు విరుద్ధంగా చేపట్టి, పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఏపీలోని వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన పలువురు ఎన్జీటీని ఆశ్రయించగా.. విచారణ జరిపి, డిండి ఎత్తిపోతలకు రూ.320 కోట్లు, పాలమూరుకు రూ.600 కోట్లు జరిమానా విధించింది. ఈ నిధుల వినియోగంపై కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే పాలమూరుకు రెండో దశ పర్యావరణ అనుమతులు రానున్నాయి. అంతేగాక పర్యావరణ ఉల్లంఘనలకు బాధ్యులు ఎవరు? ఏం చర్యలు తీసుకున్నారనేదానిపై కాలుష్య నియంత్రణ మండలిని కూడా నిలదీస్తూ కేంద్రం లేఖ రాసింది. దీంతో రెండో దశ అనుమతుల ప్రక్రియ మరింత జటిలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - Jan 09 , 2024 | 06:47 AM