Share News

హెచ్‌ఎండీఏ ప్రక్షాళన

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:23 AM

హైదరాబాద్‌ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన దాన కిశోర్‌ తర్వాత మార్క్‌ను చూపిస్తున్నారు.

హెచ్‌ఎండీఏ ప్రక్షాళన

మార్పులు, చేర్పులు చేపడుతున్న దానకిశోర్‌

డిప్యూటేషన్‌పై వచ్చినవారు సొంత శాఖలకు

ఎస్టేట్‌ ఆఫీసర్‌ బాధ్యత జాయింట్‌ కమిషనర్‌కు

మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ ఓఎస్డీ తొలగింపు

మార్పులు, చేర్పులు చేపడుతున్న దానకిశోర్‌

ఒకేచోట తిష్ఠ వేసినవారిపైన కమిషనర్‌ దృష్టి

హైదరాబాద్‌ సిటీ, జనవరి 11(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన దాన కిశోర్‌ తర్వాత మార్క్‌ను చూపిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా.. సుదీర్ఘకాలంగా ఒకే సీటులో తిష్ట వేసినవారి పైన దృష్టిసారించారు. ప్రధానంగా వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులను సొంత శాఖలకు పంపుతున్నారు. మెట్రోపాలిటన్‌ కమిషనర్‌కు ఓఎస్డీగా ఉన్న రిటైర్డ్‌ అధికారి ఎం.రాంకిషన్‌, ఎస్టేట్‌ ఆఫీసర్‌ కిషన్‌రావులను గురువారం విధుల నుంచి పూర్తిగా తొలగించారు. వాటర్‌బోర్డు ఎస్టేట్‌ ఆఫీసర్‌ నుంచి ఇటీవల డిప్యూటేషన్‌పై హెచ్‌ఎండీఏకు రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌గా వచ్చిన కె.జ్ఞానప్రసూనాంబను మెట్రోపాలిటన్‌ కమిషనర్‌కు ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఎస్టేట్‌ అధికారి బాధ్యతలను హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ అమ్రపాలికి అప్పగించారు. అడ్మినిస్ట్రేషన్‌, ఇతర నిర్వహణ, ఐటీ బాధ్యతలు చూస్తున్న అమ్రపాలికి ఇవి అదనపు బాధ్యతలు. అర్బన్‌ ఫారెస్ట్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌ను బదిలీ చేసి ప్రదీ్‌పకుమార్‌శెట్టిని నియమించారు. మీడియా సంబంధాలఅధికారి రాములును తప్పించి ఓ తహసీల్దార్‌కు ఇంచార్జి బాధ్యతలు కేటాయించారు. మున్ముందు ఇంజనీరింగ్‌, ప్లానింగ్‌ తదితర విభాగాల్లో మార్పులు, చేర్పులుంటాయని భారీగా ప్రచారం జరుగుతోంది. పనిచేసే అధికారులు, ఉద్యోగులకు పెద్దపీట వేయడంతో పాటు.. భారంగా మారిన, రాజకీయ పలుకుబడితో వివిధ హోదాల్లో కొనసాగుతున్న, అవినీతి ఆరోపణలున్నవారిపై వేటు వేసేందుకు దాన కిశోర్‌ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. కాగా, హుస్సేన్‌సాగర్‌ తీరాన ఉన్న బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ (బీపీపీఏ) కార్యాలయంలో రెండు రోజులుగా హెచ్‌ఎండీఏలోని వివిధ విభాగాల అధికారులతో కమిషనర్‌ దాన కిశోర్‌ సమీక్షిస్తున్నారు. ప్రస్తుత, భవిష్యత్తు కార్యక్రమాలు, తక్షణమే అమలు చేయాల్సిన పనులపై దిశా నిర్దేశం చేస్తున్నారు. హైదరాబాద్‌ విస్తరిస్తుండడం, పెద్దఎత్తున లేఅవుట్లు వస్తుండడంతో భూ సమీకరణ గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, వివిధ ప్రాంతాల్లో భూ సమీకరణ లే అవుట్ల అభివృద్ధి పనులు వేగిరం చేయాలని, కొత్త ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిసింది.

Updated Date - Jan 12 , 2024 | 05:23 AM