Share News

సీఎం క్యాంప్‌ ఆఫీసుగా పాయ్‌గా ప్యాలెస్‌?

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:19 AM

సచివాలయానికి చేరువలో సీఎం క్యాంప్‌ ఆఫీసుకు అనువైన భవనం కోసం అధికారులు వెతుకుతున్నారు. హైదరాబాద్‌ నడిబొడ్డునే ఉన్న పైగా ప్యాలె్‌సను క్యాంప్‌ ఆఫీసుగా మారిస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నారు.

సీఎం క్యాంప్‌ ఆఫీసుగా  పాయ్‌గా ప్యాలెస్‌?

పరిశీలించిన సీఎస్‌, అధికారులు.. భవన పటిష్ఠత, సౌకర్యాలపై ఆరా

ఆరో నిజాం పాలనలో నిర్మాణం.. గతంలో యూఎస్‌ కాన్సులేట్‌ ఇక్కడే

హైదరాబాద్‌ సిటీ, జనవరి11 (ఆంధ్రజ్యోతి): సచివాలయానికి చేరువలో సీఎం క్యాంప్‌ ఆఫీసుకు అనువైన భవనం కోసం అధికారులు వెతుకుతున్నారు. హైదరాబాద్‌ నడిబొడ్డునే ఉన్న పైగా ప్యాలె్‌సను క్యాంప్‌ ఆఫీసుగా మారిస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆ భవనాన్ని బుధవారం రాత్రి సీఎస్‌ శాంతికుమారి, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌లతో పాటు పలువురు ఉన్నతాధికారులు సందర్శించారు. పైగా ప్యాలెస్‌ మొత్తాన్ని కలియ తిరిగి పరిశీలించారు. ప్యాలెస్‌ భవన పటిష్ఠత, అందులోని సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పైగా ప్యాలెస్‌ నుంచి సచివాలయానికి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా రాకపోకలు సాగించడానికి అవకాశాలను పరిశీలించినట్లు సమాచారం. మినిస్టర్‌ రోడ్డు నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా.. లేదంటే మినిస్టర్‌ రోడ్డు నుంచి నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా సులువుగా చేరవచ్చని, ట్రాఫిక్‌ సమస్యలుండవని అధికారులు వివరించినట్లు తెలిసింది.

పైగా ప్యాలెస్‌ విశేషాలివే..

బేగంపేటలో చిరాన్‌లేన్‌లోని 4 ఎకరాల విస్తీర్ణంలో పైగా ప్యాలెస్‌ ఇంద్ర భవనంలా ఉంటుంది. ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ దగ్గర ప్రధానిగా పనిచేసిన నవాబ్‌ వికారుల్‌ ఉమ్రా 1900లో దీన్ని నిర్మించారు. ఆయనది పైగా వంశం కావడంతో దీనికి పైగా ప్యాలె్‌సగా పేరొచ్చింది. భవనంలో రెండు అంతస్తులను యూరోపియన్‌ శైలిలో కట్టారు. ఈ ప్యాలె్‌సకు 22 అడుగుల ఎత్తైన పైకప్పు ఉంది. మొదటి అంతస్తులో 20 గదులున్నాయి. రెండో అంతస్తుకు చేరుకోవడానికి కలపతో చేసిన మెట్లుంటాయి. నిజాం పాలన తర్వాత అప్పటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పైగా ప్యాలె్‌సను హుడా కార్యాలయం కోసం కేటాయించారు. 2008లో హైదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ కార్యాలయానికి అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పైగా ప్యాలె్‌సను అప్పగించారు. 15 ఏళ్ల తర్వాత గతేడాది ఏప్రిల్‌లో వారు తిరిగి హెచ్‌ఎండీఏకు అప్పగించారు. ప్రస్తుతం పైగా ప్యాలెస్‌ ఖాళీగానే ఉంది. శతాబ్దానికి పైగా వయసున్న పైగా ప్యాలెస్‌ ఏమాత్రం కళ చెదరలేదు. అయితే ఈ భవనాన్ని హెచ్‌ఎండీఏ వాసరత్వ కట్టడంగా కూడా గుర్తించింది. గత ప్రభుత్వంలో ఈ పైగా ప్యాలె్‌సను ఏదైనా ప్రైవేటు సంస్థకు హోటల్‌ కోసం లీజుకిచ్చి ఆదాయ వనరుగా మార్చేందుకు పెద్ద ఎత్తున సంప్రదింపులు కూడా జరిగాయి.

Updated Date - Jan 12 , 2024 | 05:19 AM