Share News

మన తెలంగాణ.. మన వ్యవసాయం ఊసేది?

ABN , Publish Date - May 24 , 2024 | 11:21 PM

పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి ప్రభుత్వం రైతు చైతన్య యాత్రల పేరుతో పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించేది.

మన తెలంగాణ.. మన వ్యవసాయం ఊసేది?

- కనబడని రైతు చైతన్యయాత్రలు

- ప్రతి ఏటా ఏప్రిల్‌, మేలో యాత్రల నిర్వహణ

- కొత్త ప్రభుత్వంపై రైతుల ఆశలు

చేవెళ్ల, మే 24 : పంటల సాగులో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి ప్రభుత్వం రైతు చైతన్య యాత్రల పేరుతో పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించేది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మన తెలంగాణ - మన వ్యవసాయం పేరుతో రైతు రైతు సమన్వయ సమితి సభ్యులను నియమించి వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వానాకాలం పంటల సాగు ప్రారంభానికి ముందు సాగులో పాటించాల్సిన మెలకువలు, పంట బీమా, యంత్రాల రాయితీపై ఏప్రిల్‌, మే నెలలో అవగాహన సదస్సులను నిర్వహించేది. అయితే, రెండేళ్ల నుంచి మన తెలంగాణ - మన వ్యవసాయం పేరుతో ఏటా ఏప్రిల్‌, మేలో నిర్వహించే రైతు చైతన్య యాత్రలు అటకెక్కాయి. దీంతో వానాకాలం సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన లేక ఏళ్లుగా ఒకే పంట, అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడుతూ రైతులు నష్టపోవడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఈ ఏడాది నుంచి అయినా రైతు చైతన్య యాత్రలను ప్రారంభిస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే కొత్త ప్రభుత్వం అయినా రైతులకు ఉపయోగపడే విధంగా అవగాన సదస్సులు నిర్వహిస్తుందని ఎంతో ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు.

రైతులకు అవగాహన అవసరం

వ్యవసాయ శాఖతో పాటు వివిధ శాఖల అఽధికారుల బృందం ఉదయం 7గంటల నుంచి 10 గంటల వరకు రైతుల వద్దకు వెళ్లి వివిధ విషయాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. రైతు సమన్వయ సమితి సభ్యులను భాగస్వాములు చేయాల్సి ఉంటుంది. కాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతు సమన్వయ సమితి కమిటీలు ఏ మేరకు ఉంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే అడపాదడపా వర్షాలు కురుస్తున్న సమయంలో రైతులు వానాకాలం పంటలు సాగు చేసుకునేందుకు దుక్కులు దున్నుతూ సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతు చైతన్య యాత్రల ఊసే లేకుండా పోయిందని పలువురు రైతులు వాపోతున్నారు. విత్తనాల విత్తుకునే సమయానికి సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదైతే ఎలాంటి పంటలు వేసుకోవాలో రైతులకు అవగాహన కరువైందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయాల్లో రైతు చైతన్య యాత్రలతో అవగాహన సదస్సులు నిర్వహించి పంటల ప్రణాళికలను వివరించాలని రైతులు కోరుతున్నారు.

అవగాహన కల్పించే అంశాలు ఇలా....

- భూసార పరీక్షల ఆవశ్యకత పంటల మార్పిడి.

- పంటలకు గిట్టుబాటు ధర రానప్పుడు గోదాముల్లో నిల్వచేసి రుణం పొందే విధానం, రుణాల సద్వినియోగం

- వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాల్సిన పంటలు, చీడపీడల నివారణ

- కరువు కోరల్లో చిక్కుకున్నప్పుడు పాడి పశువులతో అభివృద్ధి, పశు సంవర్థక శాఖ అందజేస్తున్న రాయితీలు

-వ్యవసాయంలో విద్యుత్‌ వినియోగం, విత్తనోత్పత్తికి సంబంధించి ప్రోత్సాహం

రైతులకు అవగాహన కల్పించాలి

గత ప్రభుత్వం మన తెలంగాణ - మన వ్యవసాయం పేరుతో నిర్వహించే అవగాహన సదస్సులను రెండు సంవత్సరాల నుంచి నిలిపి వేశారు. దీంతో సాగుపై అవగాహన లేక పంట నష్టపోతున్నాం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా రైతు చైతన్య యాత్రలు యధావిధిగా కొనసాగించాలి. సేంద్రియ వ్యవసాయంపై కూడా రైతులకు అవగాహన కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

- రంగారెడ్డి, రైతు మల్కాపూర్‌

చైతన్య యాత్రలు నిర్వహించాలి

పంటల సాగుకు ముందు సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదైన సందర్భాల్లో ఏ రకం పంటలు సాగు చేయాలనేది అవగాహన లేకుండా పోయింది. కొత్త ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి గతంలో మాదిరి రైతు చైతన్య యాత్రలను నిర్వహించాలి. సాగు విధి విధానాలు తదితర అంశాలపై అవగాహన కల్పించి రైతులను చైతన్యం చేయాలి.

- వెంకటేశ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ చేవెళ్ల

Updated Date - May 24 , 2024 | 11:21 PM