మాది అభివృద్ధి పథం
ABN , Publish Date - May 12 , 2024 | 12:06 AM
అభివృద్ధి కావాలంటే కాంగ్రె్‌సకు ఓటేయాలని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిందని చెప్పారు.

100 రోజుల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం
స్కైవేలు నిర్మాణ పనులు చేపట్టాం
సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో పెండింగ్ పనులు పూర్తిచేస్తాం
బస్తీలన్నింటికీ మౌలిక సదుపాయలు కల్పిస్తాం
మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధికి నాది పూచి
జడ్పీ చైర్మన్‌గా ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశా
నిండు మనసుతో ఆశీర్వదించండి
ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)
అభివృద్ధి కావాలంటే కాంగ్రె్‌సకు ఓటేయాలని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిందని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన పట్నం సునీతారెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న సునీతారెడ్డి ఆయా ప్రాంతాలను తిరుగుతూ అన్నివర్గాల వారిని కలుస్తున్నారు. ఈ నేపధ్యంలో శుక్రవారం సునీతారెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమది అభివృద్ధి, సంక్షేమ బాట అన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీ స్కీమ్‌లతో ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ఈ సంక్షేమ పాలన అభివృద్ధి కొనసాగాలంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. గతంలో ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ పర్సన్‌గా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో పని చేశానని ఇపుడు మళ్లీ ఎంపీగా అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఇంకేమన్నారో ఆమె మాటల్లోనే...
మల్కాజిగిరి అభివృద్ధికి పూచీ నాది
మల్కాజిగిరి నియోజకవర్గం దేశంలోనే అతిపెద్దది. ఈ ప్రాంతంలో పనిచేసిన ప్రజాప్రతినిధులెందరో ఉన్నత స్థాయికి ఎదిగారు. చెన్నారెడ్డి, దేవేందర్ గౌడ్, సర్వే సత్యనారాయణ, ఉమా వెంకట్రామిరెడ్డి తదితర నేతలందరో ఈ ప్రాంతం నుంచే రాజకీయాల్లో ఎదిగారు. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రేవంత్‌రెడ్డి కూడా ఇపుడు సీఎం అయ్యారు. ఎంతో మంది రాజకీయ నేతలకు అవకాశం కల్పించిన ఈ ప్రాంత ప్రజలు ఈ సారి నన్ను ఆదరించాలని కోరుతున్నాను. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాల అభివృద్ధికి నేను పూచీ తీసుకుంటాను. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో ఈ ప్రాంతంలో పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాను. గతంలో ఉమ్మడి జిల్లాకు జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసిన సమయంలో ఈ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. ప్రచారానికి వెళ్లినపుడు ప్రజలు వాటిని గుర్తు చేస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోంది. మా అధినేత రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ సహకారంతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. నియోజకవర్గంలో ట్రాఫిక్ రోడ్డు సమస్యలు అధికంగా ఉన్నాయి. అనేకచోట్ల మౌలిక సదుపాయాలు లేక బస్తీవాసులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు కాలనీలు, బస్తీలు మునిగిపోతున్నాయి. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనులకు. రోడ్ల విస్తరణకు దాదాపు రూ. 50వేల కోట్ల నుంచి 60వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. వీటిని తక్షణమే చేపట్టి ప్రజలకు ఈ ఇబ్బందుల నుంచి శాశ్వతంగా విముక్తి కలిగిస్తాం.
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
తెలంగాణ ఇచ్చిన కాంగ్రె్‌సతోనే అభివృద్ధి సాధ్యం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజులకే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అన్నివర్గాల వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. అప్పులు పాలైన తెలంగాణను సీఎం రేవంత్‌రెడ్డి గాడిలో పెట్టారు. కాంగ్రెస్ పాలన వచ్చిన తరువాత ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కైవే నిర్మాణ పనులను ప్రారంభించాం. త్వరలో ఈ నియోజకవర్గ పరిధిలో మెట్రో రైలు నిర్మాణ పనులు కూడా చేపట్టబోతున్నాం. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఈ పనులు చేపట్టలేక పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ పనులు ప్రారంభించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాలు కొనసాగించాలంటే కాంగ్రె్‌సకు ఓటు వేయాలి. నియోజకవర్గ పరిధిలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం మా ప్రభుత్వం అనేక ప్రణాళికలు అమలు చేయనుంది. ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ మాకు పోటీనే కాదు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను ప్రజలు తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో పోరాడే స్థితిలో లేదు. ఇక బీజేపీ ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తుంది. ప్రజలు కూడా ఇది గమనిస్తున్నారు.
పార్టీ కేడర్ సహకారంతో ముందుకు...
కాంగ్రెస్ కేడర్ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతో కష్టపడి పనిచేస్తోంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా మాకు లేకపోయినా కేడర్ కాంగ్రెస్ గెలుపుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. నియోజకవర్గమంతటా బలమైన కేడర్ ఉంది. అక్కడకక్కడా చిన్న సమస్యలున్నా అందరం సర్దుకుపోయి ఈ స్థానంలో గెలుపు కోసం పనిచేస్తున్నాం.