Share News

మా పిల్లలు సర్కారు బడికే..

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:44 PM

తమ పిల్లలను సర్కారు బడికే పంపిస్తామని, ప్రైవేటు బడుల్లో చదివించబోమని గ్రామస్తులు తేల్చి చెప్పారు. తమ ఊరికి చెందిన పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సును అడ్డుకున్నారు. ఈ సంఘటన కొందుర్గు మండలం చెర్కుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.

 మా పిల్లలు సర్కారు బడికే..
రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులతో మాట్లాడుతున్న ప్రైవేట్‌ పాఠశాల నిర్వాహకులు

ప్రైవేట్‌ స్కూళ్లలో చేర్పించబోమని గ్రామస్తుల నిర్ణయం

విద్యార్థులను తీసుకెళ్లేందుకు వచ్చిన బస్సు అడ్డగింత

కొందుర్గు మండలం చెర్కుపల్లిలో ఘటన

కొందుర్గు, జూలై 5 : తమ పిల్లలను సర్కారు బడికే పంపిస్తామని, ప్రైవేటు బడుల్లో చదివించబోమని గ్రామస్తులు తేల్చి చెప్పారు. తమ ఊరికి చెందిన పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సును అడ్డుకున్నారు. ఈ సంఘటన కొందుర్గు మండలం చెర్కుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొందుర్గు మండల కేంద్రంలోని ప్రైవేట్‌ పాఠశాలలకు.. చెర్కుపల్లి గ్రామం నుంచి అనేక మంది విద్యార్థులు వెళుతుంటారు. వారంతా తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువు పూర్తిచేసి 6వ తరగతి చదివేందుకు మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళుతుంటారు. ఈక్రమంలో చెర్కుపల్లి ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదివిన విద్యార్థులను తమ స్కూళ్లో చేర్పించుకునేందుకు శుక్రవారం ఓ ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం బస్సును గ్రామంలోకి పంపింది. దాంతో చెర్కుపల్లి ప్రభుత్వ పాఠ శాల ప్రధానోపాధ్యాయడు శివారెడ్డి, గ్రామస్తులు, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి బస్సును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రైవేటు పాఠశాల నిర్వాహకులతో మాట్లాడుతూ చెర్కుపల్లి ప్రాథమిక పాఠశాలలో తమ గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రాథమిక విద్య పూర్తిచేసిన అనంతరం గురుకుల(నవోదయ) పాఠశాలల ప్రవేశ పరీక్ష రాసి సీట్లు సాధిస్తున్నారని, ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులకు అందులో సీట్లు రావడం లేదని, తమ గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే పంపిస్తామని తెలిపారు. గ్రామానికి చెందిన ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రైవేట్‌ పాఠశాలలకు రారని తెగేసి చెప్పారు. దాంతో ప్రైవేటు స్కూల్‌ నిర్వాహకులు గ్రామస్తులతో మాట్లాడుతూ.. శనివారం నుంచి గ్రామంలోకి ప్రాథమిక పాఠశాలలో చేర్చుకునే పిల్లల కొరకు బస్సు రాదని చెప్పడంతో ధర్నా విరమించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గ్రామస్తులు కొత్తగా ఐదుగురిని 5వ తరగతిలో చేర్పించారు. కార్యక్రమంలో గ్రామస్తులు యాదయ్య, ప్రేమ్‌కుమార్‌, రామస్వామి, జీవన్‌, ఆంజనేయులు, బాలమణి, నర్సమ్మ, మల్లేష్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 11:44 PM