Share News

ORR Service Road : దోస్త్‌కు సర్వీస్‌

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:57 AM

ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం ప్రభుత్వం సేకరించిన భూమిని ఇప్పటికీ సంబంధిత యజమానులే అనుభవిస్తున్నారు.

ORR Service Road : దోస్త్‌కు సర్వీస్‌

ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై మాజీ మంత్రి మిత్రుడి పాగా

రోడ్డుకు సేకరించిన భూమి అన్యాక్రాంతం

రూ.150 కోట్ల విలువ చేసే భూమిలో తిష్ట

బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి అండతో అక్రమాలు

2018 నుంచి యథేచ్ఛగా క్రయవిక్రయాలు

సర్వీస్‌ రోడ్డు లేక ప్రజలకు తీవ్ర ఇక్కట్లు

ఘట్‌కేసర్‌లో ఔటర్‌ జంక్షన్‌ వద్ద భూమాయ

స్థలాల అక్రమాలపై విచారణకు డిమాండ్‌

ఘట్‌కేసర్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం ప్రభుత్వం సేకరించిన భూమిని ఇప్పటికీ సంబంధిత యజమానులే అనుభవిస్తున్నారు. రూ.150 కోట్లకు పైగా విలువైన సర్కారు భూమి అన్యాక్రాంతమైనా పట్టించుకున్న నాథుడే లేడు! ఎందుకంటే భూ యజమాని గత ప్రభుత్వంలోని కీలక మంత్రికి స్నేహితుడు! మిత్రుడి మేలు కోసం ఆ మంత్రి కూడా తన శక్తిమేరకు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి! సాక్షాత్తూ మంత్రిగారే అండగా నిలవడంతో ఆ వ్యక్తి, అతని కనుసన్నల్లో నడిచే మిగిలిన వారు చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌కే తూట్లు పొడిచారు! సర్వీసు రోడ్డు నిర్మించాల్సిన 14,036 చదరపు గజాల భూమిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పరిశ్రమలు వెలిశాయి. ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులు దర్జాగా అనుభవిస్తుండగా.. రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు!! ఈ భూబాగోతం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణం కోసం ఘట్‌కేసర్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 575, 580, 581లో నాటి హెచ్‌ఎండీఏ అధికారులు భూమిని సేకరించారు. ఆయా సర్వే నంబర్లలో సేకరణ అంశాన్ని నాటి పెద్దల అనుయాయులకు అనుకూలంగా మార్చుకున్నారు. హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన హద్దులను తొలగించారు. సర్వే నంబరు 575లో ముందుగా 3.18 ఎకరాలకు డిసెంబరు 2005లో నోటిఫై చేశారు. కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ పెద్ద నాయకుడి అండతో దాన్ని 3.08 ఎకరాలకు తగ్గించారు.

అయితే ఇప్పటికీ 2.29 ఎకరాలు మాత్రమే హెచ్‌ఎండీఏ అధీనంలో ఉంది. 10 గుంటల స్థలం ప్రైవేట్‌ పరిశ్రమ అధీనంలోనే ఉంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్‌ కోసం సర్వే నంబరు 580లో 5.17 ఎకరాల స్థలాన్ని నోటిఫై చేశారు. ఇందులో 13 గుంటల స్థలం జాతీయ రహదారికి పోయింది. 1.07 ఎకరాల్లో ఘట్‌కేసర్‌ నుంచి ఈసీఐఎల్‌కు వెళ్లే రోడ్డు ఉంది. 3.37 ఎకరాలను ఔటర్‌కు సేకరించారు. ప్రొసీడింగ్‌ నంబరు ఎల్‌ఏ, ఎల్‌ఏ(యూనిట్‌) 4/41-1/2005 ద్వారా స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్థలానికి సంబంధించిన పరిహారాన్ని న్యాయస్థానంలో జమ చేశారు. సేకరించిన భూమిలో ఎంజాయ్‌మెంట్‌ సర్వే ప్రకారం రైస్‌మిల్లు, ధర్మకాంట, దాబా తదితర వ్యాపార సంస్థలు ఉన్నట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. సర్వే నంబరు 581లో 15 గుంటలు నోటిఫై కాగా ఇందులో 5 గుంటలు జాతీయ రహదారిలోకి వెళ్లింది. మిగతా 10 గుంటల స్థలానికి సంబంధించిన పరిహారాన్ని అప్పటి అధికారులు న్యాయస్థానంలో జమచేశారు. కాగా, సర్వే నంబరు 575లో 29 గుంటలు, 580లో 1.37 ఎకరాలు, 581లో 10 గుంటలు.. మొత్తం 2.26 ఎకరాల (14,036చదరపు గజాలు) భూమి పరిహారం కూడా పొందిన వారి అధీనంలోనే ఉండడం గమనార్హం.

2018 నుంచి క్రయవిక్రయాలు..!

ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం సేకరించిన సర్వే నంబరు 580లోని భూముల క్రయవిక్రయాలు 2018 నుంచి కొనసాగుతున్నాయి. ప్రభుత్వం సేకరించిన ఈ భూములకు బ్యాంకులు సైతం రుణాలు ఇవ్వడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఈ భూములు ఐజీఆర్‌ఎస్‌ (రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌) నిషేధిత జాబితాలో లేకపోవడంతో యథేచ్చగా క్రయవిక్రయాలు సాగుతున్నాయి. దీంతో అక్రమంగా రుణాలు పొందుతున్నారు. స్పెషల్‌ కలెక్టర్‌ భూసేకరణ ప్రొసీడింగ్‌ నంబరు సీ/ఓఆర్‌ఆర్‌/1143/05 డేటెడ్‌ 30-10-2010తో ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని సూచించారు. అయినా పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ భూములను ఔటర్‌ ప్రాజెక్టు కోసం సేకరించినట్లు రెవెన్యూ రికార్డుల్లో అప్‌డేట్‌ చేయాలంటూ మరోసారి 2017లో కూడా ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. వాటిని రిఫర్‌ చేస్తూ 2018లో హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ మళ్లీ కలెక్టర్‌కు లేఖ రాశారు. అవసరాలకు సేకరించిన స్థలాన్ని స్నేహితులకు నజరానాగా వదిలివేయడం విచారకరమని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ స్థలంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమాంతరంగా సర్వీస్‌ రోడ్డు నిర్మించాల్సి ఉంది. నగరం చుట్టూ ఉన్న ఔటర్‌కు సర్వీస్‌ రోడ్డు వేశారు. కేవలం ఇక్కడ మాత్రమే నిర్మించలేదు. ఈ జంక్షన్‌లో మూడు వైపులా సర్వీస్‌ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఒక వైపు వదిలేశారు. దీంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గత పురపాలక మంత్రి స్నేహితుడి కోసమే సర్వీస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్లోవర్‌ లీఫ్‌(ఆకు) ఆకారంలో జంక్షన్లు నిర్మించాలని నాటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వాటన్నింటినీ తుంగలో తొక్కి తమ ఇష్టానుసారం వ్యవహరించినట్లు తెలుస్తోంది. 14,036 చదరపు గజాల ఖరీదైన స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పరిశ్రమలు వెలిశాయి. ఇంకొన్ని నూతన నిర్మాణాలూ చేపడుతున్నారు. మరికొందరు అద్దెకు ఇచ్చి లబ్ధి పొందుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హెచ్‌ఎండీఏ అధికారుల నిర్లక్ష్యంపై విచారణ చేపట్టి, సర్వీస్‌ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఔటర్‌కు సేకరించిన భూములను పరిరక్షించాలి

గతంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన భూములను పరిరక్షించాలి. ఏళ్లుగా సర్వీస్‌ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోవడం విచారకరం. భూసేకరణలో అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

- ఎస్‌.జీవన్‌కుమార్‌, మానవ హక్కుల వేదిక నేత

ప్రభుత్వ ఆస్తులను స్నేహితులకు ధారాదత్తం చేశారు

ఔటర్‌రింగ్‌ రోడ్డు మలుపులకు మూల కారణం గత ముఖ్యమంత్రి కార్యాలయమే. వారి స్నేహితుల ఆస్తులను కాపాడేందుకు అనేక కుట్రలు, కుతంత్రాలు జరిగాయి. అందులో భాగంగా ఘట్‌కేసర్‌లో కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. వెంటనే సర్వీస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టి ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించాలి.

- జె.కిషన్‌, న్యాయవాది

Updated Date - Jan 12 , 2024 | 05:58 AM