Share News

సమగ్ర కుల గణనకు ఉత్తర్వులు

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:32 AM

అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల్లో ఒక్కో దానిని అమలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సమగ్ర కుల గణనకు ఉత్తర్వులు వెలువరించింది.

సమగ్ర కుల గణనకు ఉత్తర్వులు

రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్యారంగాల వారీగా సర్వే

రాజకీయంగా ఏ కులానికి ఎన్ని పదవులనే దానిపైనా..

గణనకు ఫిబ్రవరి 16న అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం

నెలలోపే ఉత్తర్వు.. త్వరలో సర్వే సమగ్ర విధివిధానాలు

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల్లో ఒక్కో దానిని అమలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సమగ్ర కుల గణనకు ఉత్తర్వులు వెలువరించింది. నెల క్రితం మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సర్కారు.. ఆ వెంటనే ఫిబ్రవరి 16న అసెంబ్లీలో తీర్మానం చేసింది. దానికి అనుగుణంగా శుక్రవారం ఉత్తర్వులను జీవో నం.26 జారీ చేసింది. ప్రజల జీవన స్థితిగతులు, వారి వివరాలను శాస్త్రీయంగా సేకరించేందుకు కుల గణన చేపడతామని, జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కుల గణనలో ఇంటింటి సర్వే ద్వారా సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో ఆయా కులాల పరిస్థితిని తెలుసుకోనున్నారు. దీంతోపాటు రాజకీయంగా ఏ కులానికి ఎన్ని పదవులు ఉన్నాయనే దానినీ నమోదు చేస్తారు. కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయి దాక ఈ వివరాలను సేకరించనున్నారు. మరోవైపు కుల గణన చేపట్టేందుకు బీసీ సంక్షేమ శాఖ రూ.150 కోట్ల నిధులను మంజూరు చేసింది. కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించడానికి వీలుగా చేపట్టే కుల గణన రాష్ట్ర చరిత్రలో అత్యంత కీలక నిర్ణయమని ప్రభుత్వం పేర్కొంది. సర్వే విధి విధానాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సర్కారు తెలిపింది.

చరిత్రాత్మక ప్రక్రియకు నాంది: వకుళాభరణం

కుల గణనపై జీవో జారీ చేయడం చరిత్రాత్మక ప్రక్రియకు నాంది అని, సువర్ణ అధ్యాయానికి తెరతీస్తుందని రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

జీవో విడుదల హర్షణీయం: జాజుల

రాష్ట్రంలో కుల గణనకు జీవో జారీ పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు. బీసీ కుల గణన నిర్వహించి, లెక్కలు తేల్చాలని రెండు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ఫలించిందన్నారు. ఇంటింటి సర్వేలో వివరాలు సమగ్రంగా సేకరించాలని ఆయన కోరారు.

Updated Date - Mar 16 , 2024 | 09:39 AM