Share News

బోనస్‌పై విపక్షాల బోగస్‌ మాటలు

ABN , Publish Date - May 22 , 2024 | 05:15 AM

బోనస్‌ అంటే అర్థం తెలియని పార్టీలు, నాయకులు బోగస్‌ విమర్శలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా పొంతన లేని విమర్శలు చేస్తున్నారని,

బోనస్‌పై విపక్షాల బోగస్‌ మాటలు

రాష్ట్రాన్ని నాశనం చేసిన వారే ఇప్పుడు నీతులు చెబుతున్నారు

ముందుగా సన్న వడ్లకు బోనస్‌ ఇస్తాం

దశల వారీగా దొడ్డు వడ్లకు: తుమ్మల

ఖమ్మం/హైదరాబాద్‌, మే 21(ఆంధ్రజ్యోతి): బోనస్‌ అంటే అర్థం తెలియని పార్టీలు, నాయకులు బోగస్‌ విమర్శలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా పొంతన లేని విమర్శలు చేస్తున్నారని, అప్పులు చేసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసినా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలా ఎలా పాలన సాగిస్తుందన్న ఈర్ష్య వారిలో కనిపిస్తోందన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన పెద్దలు ఇప్పుడు నీతులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న విజయం కోరుతూ ఖమ్మంలో నిర్వహించిన ప్రచార సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. రాష్ట్రంలో పేదలకు రేషన్‌ బియ్యం, బడి పిల్లలకు మధ్యాహ్నం భోజనం, సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం అందించేందుకు ముందుగా సన్న వడ్లు పండించే రైతులకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని క్యాబినెట్‌ మీటింగ్‌లో ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సన్న వడ్లు సాగు చేసే రైతులకు దిగుబడి తక్కువ.. పెట్టుబడి, నష్టం ఎక్కువ ఉంటుందని అన్నారు. అందుకే మొదట వారికి బోనస్‌ ఇచ్చి.. తర్వాత దశల వారీగా అన్ని రకాల వడ్లు సాగు చేసే రైతులకు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని.. ఎన్ని కష్టాలు ఉన్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని గ్యారెంటీలను అమలు చేస్తోందని చెప్పారు. పదేళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కేంద్రంలో బీజేపీ మోసం చేశాయని తుమ్మల మండిపడ్డారు.

చేనేత మగ్గాల ఆధునికీకరణకు 400కోట్లు

రాష్ట్రంలోని మరమగ్గాలు, చేనేత మగ్గాల ఆధునికీకరణకు 2024-25 బడ్జెట్‌లో బీసీశాఖలో కేటాయించిన రూ.400 కోట్లను వినియోగించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్క్‌ దగ్గర 23 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)లో డిప్లొమా, డిగ్రీ ప్రవేశాలకు, పోచంపల్లిలో టెస్కో ద్వారా శానిటరీ న్యాప్కిన్ల ఉత్పత్తి పరిశ్రమను స్థాపించేందుకు, ఉత్పత్తి చేసిన న్యాప్కిన్లను స్వయం సహాయక సంఘాల ద్వారా సరఫరా చేయడానికి ఆమోదం తెలిపారని వెల్లడించారు. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి టెస్కోకు రావాల్సిన పెండింగ్‌ బకాయిలన్నింటినీ విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని పేర్కొన్నారు.

Updated Date - May 22 , 2024 | 07:03 AM