Share News

నల్లగొండ పట్టణంలో ‘ఆపరేషన్‌ చభుత్రా’

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:30 AM

అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారికి అడ్డుకట్ట వేసేందుకు నల్లగొండ జిల్లా పోలీసులు మంగళవారం అర్ధరాత్రి జిల్లాకేంద్రంలో ఆపరేషన్‌ చభుత్రా కార్యక్రమాన్ని నిర్వహించారు.

నల్లగొండ పట్టణంలో ‘ఆపరేషన్‌ చభుత్రా’
నల్లగొండలో అర్ధరాత్రి తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

48 బైక్‌లు, ఐదు కార్లు, మూడు ఆటోలు

80 సెల్‌ఫోన్లు స్వాధీనం ఫ 80 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నల్లగొండ క్రైం, నవంబరు 27, (ఆంధ్రజ్యోతి): అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారికి అడ్డుకట్ట వేసేందుకు నల్లగొండ జిల్లా పోలీసులు మంగళవారం అర్ధరాత్రి జిల్లాకేంద్రంలో ఆపరేషన్‌ చభుత్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ ఆదేశాల మేరకు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ వన్‌టౌన్‌, టూటౌన్‌, రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నలుగురు సీఐలు, 12మంది ఎ్‌సఐలు, 80 మంది కానిస్టేబుళ్లతో కలిసి పది బృందాలుగా ఏర్పడి 10 పెట్రోలింగ్‌ పార్టీల ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణాన్ని అష్టదిగ్భంధనం చేశారు. అర్ధరాత్రి సమయంలో వాహనాలపై అనుమానాస్పదంగా తిరుగుతున్న 84మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 48 బైక్‌లు, 5 కార్లు, మూడు ఆటోలు, 80 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 24మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి మాట్లాడుతూ అర్ధరాత్రి అరుగుల(చభుత్ర) మీద బాతకానీలు కొడుతూ, బైకులతో రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతూ కాలనీవాసులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలపై తిరిగి గొడవలు సృష్టించినా, అనుమానాస్పదంగా తిరిగినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇక నుంచి తరుచూ ఇలాంటి డ్రైవ్‌లను నిర్వహిస్తామని తెలిపారు. నల్లగొండను నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి పట్టణవాసులు సహకరించాలని కోరారు. స్పెషల్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారందరినీ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని టీటీఐ సెంటర్‌లో వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐలు రాజశేఖర్‌రెడ్డి, డానియల్‌, దూది రాజు, కొండల్‌రెడ్డి, ఎస్‌ఐలు రావుల నాగరాజు, సురేష్‌, సైదాబాబు, తదిత రులు ఉన్నారు.

అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరిగితే చర్యలు : ఏఎస్పీ రాములు నాయక్‌

కారణం లేకుండా అర్ధరాత్రి సమయాల్లో రోడ్లపై తిరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ రాములునాయక్‌ హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని టీటీఐ సెంటర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. అర్థరాత్రి అరుగుల మీద బాతకానీలు కొడుతూ బైక్‌లపై రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతూ, కాలనీ వాసులకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 12:30 AM