Share News

అధికారికంగా గద్దర్‌ జయంతి

ABN , Publish Date - Jan 31 , 2024 | 04:09 AM

ప్రజాగాయకుడు గద్దర్‌ జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అధికారికంగా గద్దర్‌ జయంతి

నేడు రవీంద్ర భారతిలో కార్యక్రమం

తెల్లాపూర్‌లో గద్దర్‌ విగ్రహానికి స్థలం

హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌/పంజాగుట్ట, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రజాగాయకుడు గద్దర్‌ జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించిన జీవో కూడా విడుదల చేశామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గద్దర్‌ జయంతి వేడుకలను రవీంద్ర భారతీలో బుధవారం ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. గద్దర్‌ 76వ జయంతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌, బ్రోచర్‌ను గద్దర్‌ కుమారుడు గుమ్మడి విఠల్‌ సూర్యకిరణ్‌ తదితరులు మంగళవారం ఆవిష్కరించారు. జయంతి వేడుకల్లో భాగంగా గద్దర్‌ దళం ఆట-పాట సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, ‘పాటకు జీవకణం-తరగని గని’ పుస్తకావిష్కరణ ఉంటుందని గద్దర్‌ ఫౌండేషన్‌ తెలిపింది. ఇక, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లో గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హెచ్‌ఎండీఏకు చెందిన 1076 చ.గజాల (9గుంట లు) స్థలాన్ని కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెల్లాపూర్‌లో చౌరస్తాను ఆనుకొని ఉన్న హెచ్‌ఎండీఏ స్థలం లో ఇటీవల గద్దర్‌ విగ్రహ ఏర్పా టుకు నిర్మాణ పనులు చేపట్టారు. అయితే హెచ్‌ఎండీఏ స్థలంలో అనుమతి లేకుండా విగ్రహం ఏర్పా టు చేస్తుండడంతో అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై పలు ప్రజాసంఘాలు, స్థానికులు ఆందోళన చేపట్టగా విషయం ప్రభు త్వం దృష్టికి వెళ్లింది. దీంతో ప్రభుత్వం స్పందించగా.. గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు తెల్లాపూర్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.323/14లో ఉన్న హెచ్‌ఎండీఏ పరిధిలోని 9 గుంటలను కేటాయిస్తూ మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ జీవో ఎంఎస్‌ నెం.6 జారీ చేశారు.

Updated Date - Jan 31 , 2024 | 04:09 AM