Share News

జగన్మోహిని అవతారంలో నృసింహుడు

ABN , Publish Date - Mar 18 , 2024 | 05:13 AM

బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహుడు ఆదివారం జగన్మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

జగన్మోహిని అవతారంలో నృసింహుడు

యాదగిరిగుట్ట, మార్చి 17: బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహుడు ఆదివారం జగన్మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారిని పట్టుపీతాంబరాలు, వజ్రాలు, ముత్యాలను పొదిగిన దివ్యాభరణాలు, వివిధ రకాల పుష్పాలతో జగన్మోహిని అవతారంలో అలంకరించారు. అనంతరం మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణతో ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. ప్రధానాలయ తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా, బ్రహ్మోత్సవాల కోసం ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరపున ఆదివారం యాదాద్రి నృసింహుడికి కల్యాణ పట్టువస్త్రాలను(మేల్చాట్‌) సమర్పించారు. కాగా, ఆదివారం సెలవు, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో యాదాద్రిలో భక్తజన సందడి నెలకొంది. స్వామివారి ధర్మ దర్శనానికి 3గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. ఆదివారం 30వేలకు పైగా భక్తులు యాదాద్రిని సందర్శించినట్లు, ఆలయ ఖజానాకు రూ.42.59 లక్షల ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.

Updated Date - Mar 18 , 2024 | 05:13 AM