Share News

2 ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ల జారీ

ABN , Publish Date - Jan 11 , 2024 | 04:22 AM

ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఉప ఎన్నికల నోటిఫికేషన్లను అసెంబ్లీ కార్యాలయం గురువారం విడుదల చేయనుంది.

2 ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ల జారీ

18 వరకు నామినేషన్ల స్వీకరణ .. ఒకటి బీసీ, మరోటి ఓసీకి ఇచ్చే చాన్స్‌

గవర్నర్‌ కోటాలో ఒకటి కోదండరాంకు.. మరో సీటుకు జాఫర్‌ పేరు పరిశీలన!

హైదరాబాద్‌, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఉప ఎన్నికల నోటిఫికేషన్లను అసెంబ్లీ కార్యాలయం గురువారం విడుదల చేయనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ సూచన మేరకు రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నోటిఫికేషన్లనూ విడివిడిగానే జారీ చేయనున్నారు. ఈ నెల 29న పోలింగ్‌ జరగనుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ నోటీస్‌ బోర్డులో రెండు నోటిఫికేషన్లనూ అంటించనున్నారు. ఈ నెల 18 వరకూ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థిని.. పది మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాల్సి ఉండడంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అయితే రెండు సీట్లకూ విడివిడిగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సభలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న అధికార కాంగ్రె్‌సకే రెండు ఎమ్మెల్సీ సీట్లూ దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

మైనార్టీకి సీటు గవర్నర్‌ కోటాలోనే!

ఎన్నికలు జరగనున్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు పార్టీ అఽభ్యర్థులను, గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు పేర్లను ఒకటిరెండు రోజుల్లో అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉంది. గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీల్లో ఒక సీటును టీజేఎస్‌ అధినేత కోదండరాంకు ఖరారైంది. మరో సీటును మైనార్టీ వర్గానికి కేటాయిస్తున్నారు. టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, విద్యావేత్త జాఫర్‌ జావెద్‌ పేరును రెండో సీటుకు ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయనతో పాటుగా సాహిత్య, సామాజిక రంగాల్లో సేవలు అందించిన పలువురు ముస్లిం వ్యక్తుల పేర్లూ పరిశీలనలో ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకిగాను బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్‌ కుమార్‌గౌడ్‌, రెడ్డి సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడు హర్కార వేణుగోపాల్‌, ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్‌ల పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే అద్దంకి దయాకర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ నుంచి పోటీకి దించాలన్న ఆలోచనా అధిష్ఠానం చేస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగానూ చిన్నారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. వీరితో పాటుగా టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్‌, ఉపాధ్యక్షుడు పటేల్‌ రమే్‌షరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ తదితర నేతలూ తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మొత్తమ్మీద సామాజిక సమీకరణలు చూసుకుని రెండు స్థానాలకు అధిస్ఠానం అభ్యర్థులను నియమించనుంది.

Updated Date - Jan 11 , 2024 | 06:24 AM