Share News

మైహోం సిమెంట్స్‌కు నోటీసులు!

ABN , Publish Date - Mar 14 , 2024 | 05:58 AM

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు రెవెన్యూ పరిధిలో మైహోం సిమెంట్స్‌ చేపడుతున్న వివాదాస్పద కట్టడాలకు సంబంధించి ఆ సంస్థకు సీసీఎల్‌ఏ నోటీసులు జారీ చేసింది.

మైహోం సిమెంట్స్‌కు నోటీసులు!

కీర్తి ఇండస్ట్రీ, మరో ముగ్గురు వ్యక్తులకు..

16న సీసీఎల్‌ఏలో హాజరవ్వాలని ఆదేశం

భూదాన్‌ భూముల్లోని కట్టడాలను ఎందుకు కూల్చివేయరాదో తెలపాలని సూచన

మేళ్లచెర్వు, మార్చి 13: సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు రెవెన్యూ పరిధిలో మైహోం సిమెంట్స్‌ చేపడుతున్న వివాదాస్పద కట్టడాలకు సంబంధించి ఆ సంస్థకు సీసీఎల్‌ఏ నోటీసులు జారీ చేసింది. సీసీ ఇండస్ట్రీ, మరో ముగ్గురు వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేసింది. మేళ్లచెర్వు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1057లో 150 ఎకరాల భూదాన్‌ భూమిలోని 113 ఎకరాల్లో మైహోం సంస్థ పదేళ్లుగా నిర్మాణాలు చేపట్టింది. రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, భూదాన్‌ బోర్డు ఇన్‌చార్జి నవీన్‌ మిత్తల్‌ ఈ నెల 2న 113 ఎకరాలు ఉన్న మైహోం సంస్థకు, 18.20 ఎకరాలు ఉన్న కీర్తి ఇండస్ట్రీకి, 21.20 ఎకరాలు ఉన్న జాస్తి త్రివేణికి, 3.01 ఎకరాలు కలిగిన పెండ్లి శ్రీనివా్‌సకు, 0.18 ఎకరాలు ఉన్న వారం రంగయ్యకు నోటీసులు జారీ చేశారు. ఈ భూదాన్‌ భూముల్లో అక్రమ కట్టడాలను ఎందుకు తొలగించకూడదో సదరు సంస్థలు, వ్యక్తులు చెప్పాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ నెల 16న సీసీఎల్‌ఏ కార్యాలయంలో హాజరు కావాలని స్థానిక తహసీల్దార్‌ జ్యోతి ద్వారా ప్రభుత్వం నోటీసులు పంపింది. నోటీసులు జారీ చేసిన విషయాన్ని తహసీల్దార్‌ జ్యోతి ధ్రువీకరించారు. భూదాన్‌ చట్ట ప్రకారం పట్టా కలిగిన వ్యక్తులు సేద్యం మాత్రమే చేసుకోవాలని, విక్రయించడానికి అనర్హులని చట్టంలో ఉంది. దీన్ని ఉల్లంఘించి రైతుల నుంచి ఆ భూమిని సంస్థలు కొనుగోలు చేసి, నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలొచ్చాయి. దీనిపై 2010లో పత్రికల్లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. అప్పటి అదనపు కలెక్టర్‌ స్వర్ణ వెంకటేశ్వరరావు..ఆ భూములను భూదాన్‌ బోర్డుకు స్వాధీనపరిచారు. సదరు సంస్థలు కోర్టులో కేసు వేసి, కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని అప్పటి నుంచి నిర్మాణాలు చేపడుతున్నాయి. ఆ భూములకు పట్టాలు ఇప్పించాలని తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా.. కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం తిరస్కరించింది. ఈ వివాదంపై సీరియస్‌గా ఉన్న ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీని ఆదేశించింది.

Updated Date - Mar 14 , 2024 | 07:06 AM