Share News

నిందితురాలిని కాదు బాధితురాలిని

ABN , Publish Date - Mar 08 , 2024 | 04:50 AM

ఢిల్లీ మద్యం కేసును టీవీ సీరియల్‌లా సాగదీస్తున్నారని, ఆ కేసులో తాను నిందితురాలని కాదని బాధితురాలినని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

నిందితురాలిని కాదు బాధితురాలిని

టీవీ సీరియల్‌లా లిక్కర్‌ కేసు.. చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కేసును టీవీ సీరియల్‌లా సాగదీస్తున్నారని, ఆ కేసులో తాను నిందితురాలని కాదని బాధితురాలినని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీలను బొంద పెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. కానీ, ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం అసాధ్యమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో సిద్ధాంతాలకు చోటు లేకుండా పోయిందని వాపోయారు. ఎమ్మెల్సీ కవిత ఈ మేరకు మీడియాతో గురువారం చిట్‌చాట్‌ నిర్వహించారు. సీఎం రేవంత్‌ రెడ్డి రేసు గుర్రం కాదని కీలు గుర్రమని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. మానవ బాంబులవుతాం అంటున్న రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ను నియంత అని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రతిపక్షాలను బెదిరించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదని చెబుతున్నా సరే ముఖ్యమంత్రి తీవ్ర పదజాలంతో కేసీఆర్‌ను దూషించడం తగదన్నారు. రేవంత్‌ డీఎన్‌ఏలోనే బీజేపీ ఉందని ఆయన తొందర్లోనే ఆ పార్టీతో కలుస్తారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేది బీజేపీ అని పేర్కొన్నారు. పాలన అనుభవం లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి రాష్ట్రంలో కృత్రిక కరువు సృష్టిస్తున్నారని కవిత ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును, కేసీఆర్‌ను బద్నాం చేయాలనే రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించారని అన్నారు. కాగా, మహిళలకు ఉద్యోగావకాశాల్లో జీవో 3 వల్ల జరిగే నష్టంపై శుక్రవారం చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. అలాగే, తాను పోటీలో ఉన్నా, లేకున్నా.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అర్వింద్‌ ఎక్కడి నుంచి పోటీ చేసినా అతన్ని ఓడిస్తానని కవిత పేర్కొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 04:50 AM