Share News

ఫోన్‌ట్యాపింగ్‌లో ఎంతటివారినైనా వదిలిపెట్టం

ABN , Publish Date - Apr 08 , 2024 | 03:59 AM

ఫోన్‌ట్యాపింగ్‌లో బాధ్యులైన ఎంతటివారినైనా వదిలిపెట్టబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం

ఫోన్‌ట్యాపింగ్‌లో ఎంతటివారినైనా వదిలిపెట్టం

నయీం కేసు దర్యాప్తు కొనసాగిస్తాం: మంత్రికోమటిరెడ్డి

అర్వపల్లి, ఏప్రిల్‌ 7: ఫోన్‌ట్యాపింగ్‌లో బాధ్యులైన ఎంతటివారినైనా వదిలిపెట్టబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం అడివెంల గ్రామంలో ముత్యాలమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నయీం కేసు దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మా ణంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గత ప్రభుత్వం దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టులకు నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లాలో మూసీవాగు ఇసుకను విక్రయించి ఆ సొమ్ముతో మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి వేల కోట్ల రూపాయలతో ఫాంహౌజ్‌లు నిర్మించుకున్నారని ఆరోపించారు. లిక్కర్‌ కేసులో తీహాడ్‌ జైలులో ఉన్న తన బిడ్డ కవిత మాట్లాడని మాజీ సీఎం కేసీఆర్‌.. కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌ రావులు కరువు పేరుతో రైతులను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ 14 సీట్లకు పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు మండలంలోని జాజిరెడ్డిగూడెం నుంచి అడివెంల గ్రామం వరకు ర్యాలీగా బైక్‌పై కాంగ్రెస్‌ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని వెనక కూర్చొబెట్టుకుని వెళ్లారు. సుమారు 14 కిలోమీటర్లు ఎండలో మంత్రి స్వయంగా బుల్లెట్‌ నడిపారు.

Updated Date - Apr 08 , 2024 | 04:00 AM