Share News

బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదు

ABN , Publish Date - Feb 12 , 2024 | 03:00 AM

శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చీ కొట్టిన బీఆర్‌ఎ్‌సతో పొత్తు ఎందుకు పెట్టుకుంటామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని..

బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదు

సర్వే సంస్థలతో కేసీఆర్‌ దుష్ప్రచారం

బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌ మిలాఖత్‌: బండి సంజయ్‌

20 నుంచి విజయ సంకల్ప యాత్రలు

బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే పోటీ: కిషన్‌రెడ్డి

మేడిగడ్డకు మా ఎమ్మెల్యేలు వెళ్లరు: లక్ష్మణ్‌

సిరిసిల్ల/జగిత్యాల/హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చీ కొట్టిన బీఆర్‌ఎ్‌సతో పొత్తు ఎందుకు పెట్టుకుంటామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సను ఓడిస్తుందని తెలిపారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి, చందుర్తి మండలాల్లో.. జగిత్యాల జిల్లా కథలాపూర్‌మండలం సిరికొండ, దూలూరు, దుంపెట, తాండ్ర్యాల, అంబారిపేట, కలికోట గ్రామాల్లో సంజయ్‌ రెండో రోజు ప్రజాహిత యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయంటూ కేసీఆర్‌ కొన్ని సర్వే సంస్థల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లోపాయికారీగా కలిసి పనిచేస్తున్నాయని, గత ఎన్నికల్లోనూ బీజేపీని దెబ్బతీసేందుకు అలాంటి దుష్ప్రచారం చేశాయని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మూడో స్థానంలో ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయన్నారు. బడ్జెట్‌ కేటాయింపులతో కాంగ్రెస్‌ అసలు స్వరూపం బయటపడిందని, హామీల పేరుతో మోసం చేసి అధికారం చేపట్టినట్లు ప్రజలకు అర్థమైందని అన్నారు. కాంగ్రె్‌సకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలకు ఎన్ని నిధులు అవసరమవుతాయో చెప్పాలని.. బడ్జెట్‌లో ఎన్ని నిధులు కేటాయించారో సమాధానం ఇవ్వాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

20 నుంచి విజయ సంకల్ప యాత్రలు

మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్న వారిని కలుసుకునేందుకు ఈ నెల 20 నుంచి విజయ సంకల్ప యాత్రలు చేపడుతున్నామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మార్చి 1 వరకు ఈ యాత్రలు కొనసాగుతాయని చెప్పారు. ప్రతీ రోజు 2-3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రలు కొనసాగేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో రోడ్‌ షోలు ఉంటాయని తెలిపారు. మోదీకి ఎదురు నిలిచే శక్తి ఏ కూటమికీ లేదని స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో కలిసి కిషన్‌రెడ్డి విజయ సంకల్ప యాత్రల పోస్టర్‌ను ఆవిష్కరించారు. వచ్చే ఎన్నికల్లో 17 పార్లమెంటు స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్‌ స్థానాలతో పాటు మెజారిటీ సీట్లు గెలుచుకోబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ఐదు పార్లమెంటు క్లస్టర్లలో విజయ సంకల్ప యాత్రలు కొనసాగనున్నాయి. కొమురం భీం యాత్ర, శాతవాహన యాత్ర, కాకతీయ యాత్ర, భాగ్యనగర యాత్ర, కృష్ణమ్మ యాత్రలు మార్చి 1న భాగ్యనగరంలో కలిసే విధంగా రూట్‌మ్యాప్‌ రూపొందించారు.

మేడిగడ్డకు మా ఎమ్మెల్యేలు వెళ్లరు

రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు ఆహ్వానిస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లబోరని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తాము ఈ ప్రాజెక్డు వద్దకు ఎప్పుడో వెళ్లి వచ్చామని, మేడిగడ్డ కుంగిన ఘటనపై ఫోటోలు, వీడియోలు కూడా వచ్చాయని.. అక్కడ ఒక కొత్తగా చూసేదేముందని ప్రశ్నించారు.

Updated Date - Feb 12 , 2024 | 03:00 AM