Share News

ఖిల్లాకు కొత్త సొబగులు

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:38 AM

స్వదేశీ దర్శన్‌ పథకానికి ఎంపికైన భువనగిరి ఖిల్లా అభివృద్ధి పనుల ప్రణాళికలు కొనసాగుతున్నాయి.

ఖిల్లాకు కొత్త సొబగులు
సేకరించాల్సిన స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారుల బృందం

రోప్‌వే టవర్స్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

బేస్‌ క్యాంప్‌ నుంచి ఖిల్లా వరకు 12 టవర్లు ఏర్పాటు

సుమారు 30గుంటల ప్రైవేట్‌ స్థలాన్ని సేకరించే అవకాశం

భువనగిరి టౌన్‌, ఫిబ్రవరి 26: స్వదేశీ దర్శన్‌ పథకానికి ఎంపికైన భువనగిరి ఖిల్లా అభివృద్ధి పనుల ప్రణాళికలు కొనసాగుతున్నాయి. ప్రధానమైన రోప్‌వే నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అధికారులు సోమవారం పరిశీలించారు. గతంలోనే బైపాస్‌ వెంట 2.36ఎకరాల ప్రైవేట్‌ స్థలాన్ని సేకరించిన అధికారులు మిగులు పనుల కోసం అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. బైపాస్‌ను అనుకొని ఏర్పాటుచేసే రోప్‌వే బేస్‌ క్యాంప్‌ నుంచి భువనగిరి ఖిల్లా వెనుక భాగం వరకు రోప్‌వే పిల్లర్స్‌ నిర్మాణానికి మరో 30 గుంటల ప్రైవేట్‌ స్థలం అవసరమవుతుందని గుర్తించారు. టూరిజంశాఖ అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, భువనగిరి సర్వేయర్‌ రజినీకాంత్‌, ఆర్‌ఐ జక్కుల భద్రయ్య రోప్‌వే నిర్మాణానికి సేకరించాల్సిన ప్రైవేట్‌ స్థలాన్ని గుర్తించి సంబంధిత భూయజమానితో మాట్లాడారు. రాష్ట్రంలోనే మొదటగా ఏర్పాటుచేస్తున్న రోప్‌వే నిర్మాణానికి స్థానికులు సహకరించాలని, రైతుల అంగీకారంతోనే భూసేకరణ జరుగుతుందని స్పష్టం చేశారు.

సుమారు 30గంటల స్థలం అవసరం

రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భువనగిరి ఖిల్లా అభివృద్ధి పను ల్లో అత్యంత ఆకర్షణీయమైన పని రోప్‌వే. ఇందుకోసం పదేళ్ల నుంచి పలు సర్వేలు చేసి నివేదికలు కూడా రూపొందించినా పనులు మాత్రం ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భువనగిరి ఖిల్లాను స్వదేశీ దర్శన్‌ పథకానికి ఎంపిక చేసి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.100 కోట్లు కేటాయించడంతో పాటు పనులను త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించింది. దీంతో కొన్ని రోజులుగా అధికారులు పలు దఫాలుగా ఖిల్లా పరిసరాలను సందర్శించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులు గుర్తించారు. అభివృద్ధి పనుల్లో మొట్టమొదటగా ఖిల్లాపైకి బైపాస్‌ రోడ్డు గుండా రోప్‌వేను, మరో రెండు ప్రాంతాల నుంచి ఎక్స్‌కవేటర్‌, లిఫ్ట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆ రెండు పనులకు అనువైన ప్రాంతాలను ఈ పాటికే అధికారులు గుర్తించారు. తాజాగా రోప్‌వే నిర్మాణానికి బేస్‌ క్యాంప్‌ నుంచి ఖిల్లా వరకు 12టవర్లను ఏర్పాటుచేసేలా ప్రణాళిక ఖరారైంది. బేస్‌ క్యాంప్‌ నుంచి ఖిల్లా వరకు 15మీటర్ల వెడల్పుతో సుమారు 30 గుంటల ప్రైవేట్‌ భూమి అవసరమవుతుందని గుర్తించి సర్వే చేసి సంబంధిత రైతులతో మాట్లాడారు. 12పిల్లర్స్‌ పైనుంచి వెళ్లే తీగల కింది భాగంలో యథావిధిగా పంటలు పండించుకోవచ్చని రైతులకు సూచించారు. రైతులకు నష్టతీవ్రతను తగ్గించే లక్ష్యంతో అమ్మకుంటకట్ట పైగుండా తీగల మార్గాన్ని ఏర్పాటుచేస్తూ రోప్‌వే టవర్స్‌ను ఏర్పాటుచేయాలని తాత్కాలికంగా నిర్ణయించారు.

త్వరలో కోల్‌కతా నిపుణుల బృందం రాక

రోప్‌వే టవర్స్‌ నిర్మాణానికి అనువైన మార్గం, స్థలాన్ని ఖరారు చేసేందుకు త్వరలోనే కోల్‌కతా నుంచి నిపుణుల బృందం రానుంది. ఈ బృందం సూచనల మేరకు సేకరించాల్సిన ప్రైవేట్‌ భూమిని నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు అధికారులతో మాట్లాడుతూ తమ నుంచి సేకరించే భూమికి మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని, ఖిల్లాపై ఉద్యోగాలు కల్పించాలన్నారు. అధికారులు స్పందిస్తూ 12టవర్స్‌ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని మాత్రమే సేకరించి ఆ మార్గంలో వెళ్లే తీగల కింది యధావిధిగా సాగు చేసుకోవచ్చనని లేదా తీగలు వెళ్లే మార్గంలో రోడ్డు నిర్మించినా అందరూ వినియోగించుకోవచ్చని, కొద్దిమందికే ఉద్యోగాలు కల్పించగలమన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:38 AM