Share News

టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం

ABN , Publish Date - Mar 22 , 2024 | 05:30 AM

మాదిగలకు టికెట్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు.

టికెట్ల కేటాయింపులో  కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం

ఆ పార్టీలను నమ్ముకున్న మాదిగ నేతలకు భవిష్యత్తు ఉండదు

కేసీఆర్‌ కంటే ప్రధాని మోదీయే నయం: మందకృష్ణ

హైదరాబాద్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మాదిగలకు టికెట్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. ఆ రెండు పార్టీలను నమ్ముకునే మాదిగ జాతి నాయకులకు భవిష్యత్తు ఉండదన్నారు. రాష్ట్రంలో మాదిగ జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు మాదిగలు, మాదిగ ఉపకులాలు ఓట్లు వేయొద్దని.. ఇది తన ఆవేదన, విజ్ఞప్తి, సూచనగా భావించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీలో మాల జాతికి చెందిన జి.వెంకటస్వామి, మల్లు అనంతరాములు కుటుంబాలే చక్రం తిప్పుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మాల జాతికి చెందిన వ్యక్తేనని చెప్పారు. మాదిగ జనాభా ఎక్కువ ఉన్న నాగర్‌కర్నూల్‌లో సంపత్‌కుమార్‌ను కాదని మాల జాతికి చెందిన మల్లు రవికి టికెట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తమిళనాడులో మాదిగ జాతికి చెందిన మురుగన్‌ ఓడిపోతే ఆయన్ను తీసుకెళ్లి ఏకంగా క్యాబినెట్‌ మంత్రిని చేసిన ఘనత ప్రధాని మోదీదైతే.. పది మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్కరినీ మంత్రిని చేయని చరిత్ర కేసీఆర్‌దని ఆరోపించారు. ఆయనకంటే మోదీయే నయమన్నారు. మరో రెండు రోజుల్లో తెలంగాణలో రెడ్ల రాజకీయంపై మీడియా ముందుకు వచ్చి, వంద రోజుల రేవంత్‌రెడ్డి పాలనపై సమగ్ర వివరాలు వెల్లడిస్తానని మందకృష్ణ చెప్పారు.

Updated Date - Mar 22 , 2024 | 07:10 AM