Share News

గమ్యానికి చేరువలో.. మృత్యు ఒడిలోకి

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:33 AM

: పుణ్యక్షేత్రాలకు వెళ్లి కారులో తిరిగి వస్తున్న రెండు కుంటుంబాలు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాయి.

గమ్యానికి చేరువలో.. మృత్యు ఒడిలోకి
ప్రమాదానికి గురైన కారును పరిశీలిస్తున్న డీఎస్పీ వెంకటగిరి

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత

మిర్యాలగూడ అర్బన్‌, జనవరి 29: పుణ్యక్షేత్రాలకు వెళ్లి కారులో తిరిగి వస్తున్న రెండు కుంటుంబాలు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి-నార్కట్‌పల్లి బైపాస్‌రోడ్డుపై ఆదివారం రాత్రి జరిగిన దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. డీఎస్పీ వెంకటగిరి సోమవారం తెలిపిన వివరాల ప్రకారం... మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన చెరుపల్లి మహేష్‌, యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గొల్నేపల్లి గ్రామానికి చెం దిన తన తోడల్లుడు బొమ్మ మశ్చేందర్‌ కుటుంబసభ్యులు దైవదర్శనం, ఈనెల 26న విహారయాత్రకు వెళ్లాయి. తిరుగు ప్రయాణంలో మహేష్‌, మశ్చేందర్‌ కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు మిర్యాలగూడలోని కృష్ణమాసన కాలనీ వద్ద అద్దంకి - నార్కట్‌పల్లి రోడ్డుపై ఆదివారం రాత్రి రోడ్డుప్రమాదానికి గురైంది. ఓవర్‌ టేక్‌ చేయబోయి డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో చెరుపల్లి మహేష్‌(32), అతని భార్య జ్యోతి(30) కుమార్తె రిషిత(6) యాదాద్రిజిల్లా వలిగొండ మండలం గొల్నేపల్లి గ్రామానికి చెందిన అతని తోడల్లుడు బొమ్మ మశ్చేందర్‌(29) కుమారుడు లియాన్స్‌(2) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. కారు వెనుక సీట్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మశ్చేందర్‌భార్య మాధవి(24)ని స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీసి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమచికిత్స అనంతరం ఆమె పరిస్థితి విషమించగా మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు నల్లగొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం ఉదయం మాధవి మృతిచెందడంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఏరియా ఆస్పత్రి వద్దకు మృతుల బంధువులు, స్నేహితులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కన్నీరు పెట్టుకున్నారు. నందిపాడు గ్రామానికి చెందిన మహేష్‌ హైదరా బాద్‌ వనస్థలిపురంలో నివాసముంటూ అవుట్‌డోర్‌ ఫొటోగ్రాఫీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదేవిధంగా మశ్చేందర్‌ తన స్వగ్రామమైన గొల్నేపల్లిలో కేబుల్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.

పేగుబంధం లేకున్నా ప్రేమబంధం పంచి..

నందిపాడు గ్రామానికి చెందిన దేవులపల్లి నాగభూషణం తన సోదరి మంగమ్మ కుమార్తెలైన జ్యోతి, మాధవిలను చిన్నతనంలోనే దత్తత తీసుకున్నాడు. పేదరికంలో ఉన్న తన సోదరికి ఆడపిల్లలు భారంగా మారకూడదన్న భావనతో చేరదీసిన నాగభూషణం, పద్మ దంపతులు సొంత కుమార్తెలుగా భావించి కష్టపడి పోషించారు. ఓ రైస్‌మిల్లులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నాగభూషణం తన పెంపకంలో ఉన్న జ్యోతిని బీఎస్పీ, బీఈడీ వరకు, మాధవిని బీటెక్‌ వరకు చదివించి ఎనిమిదేళ్ల క్రితం నందిపాడుకు చెందిన మహేష్‌తో జ్యోతికి పెళ్లిచేయగా, మూడేళ్ల క్రితం మాధవికి మశ్చేందర్‌తో వివాహం జరిపించాడు. మేనకోడళ్లకు ఏ లోటూ రాకుండా కన్నబిడ్డల వలే అల్లారుముద్దుగా పెంచుకున్న జ్యోతి, మాధవీలు విగతజీవులుగా మారడాన్ని ఆ దంపతులు జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. పేగుబంధం లేకపోయినా ప్రేమబంధంతో పెంచుకున్న పిల్లలిద్దరితోపాటు, వారి భార్త పిల్లలు మృత్యుతదేహాల వద్ద పెంపుడుతల్లి (మేనత్త) విలపించిన తీరు పలువురిని కంటతడిపెట్టిచింది.

నలుగురికి కంటి చూపు

రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతిచెందిన మహేష్‌, జ్యోతి నేత్రాలను లయన్స్‌ క్లబ్‌కు దానం చేసేందుకు తల్లి మంగమ్మతోపాటు మేన మామ, అత్త(పెంపుడు తల్లిదండ్రులు) నాగభూషణం- పద్మ అంగీకరించారు. దీంతో ఎల్వీ ప్రసాద్‌ ఐ ఆస్పత్రికి చెందిన వైద్యులు నేత్రాలను సేకరించి ఐ బ్యాంక్‌కు తరలించారు. అకాలమరణం చెందిన దంపతుల నేత్రాలతో మరో నలుగురి చూపునిచ్చే అవకాశముంటుందని వైద్యులు తెలిపారు. చిన్నారులు రిషిత, లియాన్స్‌, మశ్చేందర్‌, మాధవి దంపతుల నేత్రాలను సైతం సేకరించేందుకు వారి కుటుంబీకులు అంగీకరించినా వైద్య పరీక్షల్లో వారి నేత్రాలు ప్రమాదంలో దెబ్బతిన్నట్లుగా నిర్థారించి సేకరించలేదు.

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

మిర్యాలగూడ: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరామర్శించారు. ఏరియా ఆస్పత్రి మార్చురీలో ఉన్న మృతదేహాలను చూసి చలించిపోయారు. బంధువులను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకుడు డబ్బికార్‌ మల్లేష్‌ పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబసభ్యులను ఆయన ఫోన్లో పరామర్శించారు.

గొల్నెపల్లిలో విషాదచాయలు

వలిగొండ: మిర్యాలగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బొమ్మ మచ్చేందర్‌, అతని భార్య మాధవి, కుమారుడు లియాన్ష్‌ మృతితో మండలంలో గొల్నెపల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడడంతో గ్రామ శోకసంద్రంగా మారింది. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎవరినోట విన్నా మచ్చేందన్‌ కుటుంబం మృతిచెందారన్న చర్చ సాగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తల్లి నాగమ్మ తలకొరివి పెట్టింది. ఆ గ్రామ చివరన ఉన్న స్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. మచ్చేందర్‌, మాధవి, లీయాన్ష్‌ మృతదేహాలకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి నివాళులర్పించారు.

140 కిలోమీటర్లు వెళ్లి లారీని పట్టుకున్న పోలీసులు

ప్రమాదానికి కారణమై పరారైన లారీని గుర్తించేందుకు డీఎస్పీ పర్యవేక్షణలో మిర్యాలగూడ పోలీసులు 140 కిలోమీటర్లకు పైగా ప్రయా ణించారు. టూ టౌన్‌ ఎస్‌ఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన రెండు పోలీస్‌ బృందాలు పట్టణంలోని నందిపాడు, చింతపల్లి చౌరస్తా సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి లారీని ప్రాథమికంగా గుర్తించారు. ఏపీ రాష్ట్రం పిడుగురాళ్ల టోల్‌ప్లాజా వద్ద సీసీ కెమెరాలను పరిశీలనలో ముందుభాగం దెబ్బతిన్న టీఎస్‌12 యూఈ 2383 నెంబర్‌గల లారీని గుర్తించి ఏపీ పోలీసులను సమాచారం అందించారు. అద్దంకి వద్ద ప్రమా దానికి కారణమైన లారీని మిర్యాలగూడ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆరుగురి మృతికి కారణమైన లారీని పట్టుకునేందుకు శ్రమించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. జ్యోతి తండ్రి నాగభూషణం ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతదేహాలకు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మహష్‌, జ్యోతి, రిషిత మృతదేహాలకు నందిపాడులో అంత్యక్రియలు పూర్తిచేయగా, మశ్చేందర్‌, మాధవి, లియాన్‌ మృతదేహాలకు యాదాద్రి జిల్లా వలిగొండమండలం గొల్నేపల్లిలో దహనసంస్కారాలు పూర్తిచేశారు. రెండు కుటుంబాలకు చెందిన వారంతా ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆయా గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.

Updated Date - Jan 30 , 2024 | 12:33 AM