Share News

లష్కర్‌పై నజర్‌

ABN , Publish Date - Jan 14 , 2024 | 03:22 PM

దేశ ప్రజలకు సుపరిచితమైన సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొన్నది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడానికి మరెంతో కాలం లేకపోవడంతో సికింద్రాబాద్‌ సీటుపై ఇప్పటినుంచే తర్జనభర్జనలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మారిన అధికార మార్పిడి, రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఏయే పార్టీలు బరిలో ఉంటాయి, ఏయే పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందీ, ఎవరికి ఎవరి మద్దతు ఉంటుంందీ, ఏ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థులుగా నిలుస్తారు, విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది .అనే అంశాలపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సాధారణ పౌరుల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది.

లష్కర్‌పై నజర్‌

- సికింద్రాబాద్‌ పై అన్ని పార్టీల గురి

- పట్టుబిగించాలని మూడు పార్టీల కసరత్తు

- సిటింగ్‌ సీటును కాపాడుకోవాలని కమలం స్కెచ్‌

- మోదీ చరిష్మాతో మళ్లీ గెలవాలని యత్నాలు

- పాగా వేసేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్లాన్‌

- మారిన పరిస్థితుల్లో పొత్తులు, మద్దతుపై చర్చలు

- సమీపిస్తున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌

సికింద్రాబాద్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రజలకు సుపరిచితమైన సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొన్నది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడానికి మరెంతో కాలం లేకపోవడంతో సికింద్రాబాద్‌ సీటుపై ఇప్పటినుంచే తర్జనభర్జనలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మారిన అధికార మార్పిడి, రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఏయే పార్టీలు బరిలో ఉంటాయి, ఏయే పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందీ, ఎవరికి ఎవరి మద్దతు ఉంటుంందీ, ఏ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థులుగా నిలుస్తారు, విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది .అనే అంశాలపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సాధారణ పౌరుల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపంటే కాదు.. తమ పార్టీ విజయం సాధిస్తుందంటూ ఇప్పటినుంచే అన్ని పార్టీల శ్రేణులు జోస్యం చెబుతున్నారు. అందుకనుగుణంగా తమతమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీల్లో చర్చోపచర్చలు జరగుతున్నాయి.

కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎ్‌సల్లో అదే ధీమా

దేశవ్యాప్తంగా మోదీ హవా మరింత పెరిగినందున మళ్లీ కమలం పార్టీ వికసిస్తుందని బీజేపీ ధీమాగా ఉండగా, గత లోక్‌సభ ఎన్నికల అనంతరం బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ చేసిన అభివృద్ధి శూన్యమని, కాబట్టి ఈ దఫా కారు జోరు ఖాయమని బీఆర్‌ఎస్‌ పార్టీ విశ్వాసంతో ఉంది. రాష్ట్రంలో బీజేపీ-బీఆర్‌ఎ్‌సల చీకటి స్నేహం బట్టబయలైనందున అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలకు గుణపాఠం చెప్పిన ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లో సైతం తమకు అనుకూలంగా తీర్పు చెప్పనున్నారని, హస్తం పార్టీ విజయం తథ్యమని కాంగ్రెస్‌ శ్రేణులు కొండంత భరోసాతో ఉన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈ పర్యాయం కూడా దేశవ్యాప్తంగా మోదీ అనుకూల పవనాలు వీస్తున్నాయని, దీని ప్రభావం సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంపై కూడా పడనుందని, అందుకే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భిన్నమైన తీర్పు వెలువడి, బీజేపీ గెలిచి తీరుతుందని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయిన తమ పార్టీ రాష్ట్ర రాజధాని, చుట్టుపక్కల అద్భుత ఫలితాలు సాధించిందని, హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసిన ఖ్యాతి తమ పార్టీదేనని ఓటర్లు నమ్మడమే దీనికి కారణమని, అందుకే ఈారి సికింద్రాబాద్‌ లోక్‌సభ సీటు తమదేనంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఇప్పటినుంచే మైండ్‌ గేమ్‌ మొదలు పెట్టారు. పదేళ్ల తర్వాత రాష్ట్ర అధికార పగ్గాలు కాంగ్రెస్‌ పార్టీకి దక్కాయని, ఇప్పటినుంచి జరిగే అన్ని ఎన్నికల్లోనూ అధికార పార్టీని గెలిపించాలని ప్రజలు ఈపాటికే నిర్ణయించారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముస్లింలు, క్రిస్టియన్‌ మైనార్టీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, పలు ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నారు. ఇలా అన్ని వర్గాల ఓటర్లు హస్తం పార్టీకి అండగా నిలవనున్నారని, సెటిలర్లు సైతం బలపరిచేందుకు సిద్ధమైనందున తమ పార్టీ గెలుపు ఖాయమని హస్తం నేతలు భావిస్తున్నారు.

గుంభనంగా ఓటర్లు

రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏయే పార్టీలు బరిలో ఉంటాయి, ఏ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థిగా రంగంలో ఉంటారు తదితర అంశాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. వారు ఏ పార్టీకి అండగా ఉంటారో ఎవరికీ తెలియనీయకుండా ఓటర్లు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థులు, పార్టీల పొత్తులు వ్యవహారం తేలేదాకా ఎవరూ బయటపడని పరిస్థితి. ఇదిలా ఉండగా సికింద్రాబాద్‌ నియోజకవర్గ పరిధిలో సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌. నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌లు ఉన్నాయి. 1957లో ఈ నియోజకవర్గం ఆవిర్భవించగా 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జి.కిషన్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌పై 62,114 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కిషన్‌రెడ్డికి 3,84,780 ఓట్లు రాగా, సాయికిరణ్‌యాదవ్‌కు 3,22,666 ఓట్లు వచ్చాయి. కాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.అంజన్‌కుమార్‌యాదవ్‌ 1,73,229 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.

Updated Date - Jan 14 , 2024 | 03:26 PM