Share News

నకిలీ విత్తనాలపై నజర్‌..!

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:43 PM

తొలకరి వర్షాలు పడుతున్నాయి. వానాకాలం సాగు షురూ అయింది. దీంతో నకిలీ విత్తన వ్యాపారులు కూడా రంగంలోకి దిగారు. రంగురంగుల ప్యాకెట్లలో నింపి వాటిని రైతులకు అంటగట్టే పనిలో పడ్డారు. ప్రతీ సంవత్సరం రైతులు వారి బారిన పడి మోసపోతూనే ఉన్నారు. వ్యవసాయ అధికారులు, పోలీసులు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు వాటిపై ఇప్పటికే నజర్‌ పెట్టాయి. నిషేధిత, నకిలీ విత్తన వ్యాపారుల ఆటకట్టించేందుకు రంగంలోకి దిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీ చేయడంతో పాటు ఈ విత్తనాలపై రైతులకు అవగాహన కూడా కల్పించాయి.

నకిలీ విత్తనాలపై నజర్‌..!

వ్యవసాయ, పోలీసుశాఖ ఆధ్వర్యంలో టాస్క్‌పోర్స్‌ బృందాలు

ఫర్టిలైజర్‌, విత్తన తయారీ కేంద్రాల్లో అధికారుల తనిఖీలు

తొలకరి వర్షాలు పడుతున్నాయి. వానాకాలం సాగు షురూ అయింది. దీంతో నకిలీ విత్తన వ్యాపారులు కూడా రంగంలోకి దిగారు. రంగురంగుల ప్యాకెట్లలో నింపి వాటిని రైతులకు అంటగట్టే పనిలో పడ్డారు. ప్రతీ సంవత్సరం రైతులు వారి బారిన పడి మోసపోతూనే ఉన్నారు. వ్యవసాయ అధికారులు, పోలీసులు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు వాటిపై ఇప్పటికే నజర్‌ పెట్టాయి. నిషేధిత, నకిలీ విత్తన వ్యాపారుల ఆటకట్టించేందుకు రంగంలోకి దిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీ చేయడంతో పాటు ఈ విత్తనాలపై రైతులకు అవగాహన కూడా కల్పించాయి.

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 7 : జిల్లాలో వానాకాలం సాగు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నకిలీ విత్తన వ్యాపారంపై అధికారులు నిఘా పెట్టారు. వానాకాలం సీజన్‌లో జిల్లాలో 4,45,428 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలను అరికట్టడానికి జిల్లాలోని వ్యవసాయ డివిజన్లలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసు, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో టాస్క్‌పోర్స్‌ సభ్యులు పలు ప్రాంతాల్లో పర్యటించి సోదాలు చేస్తున్నారు. రోహిణి కార్తెలో రైతులు దుక్కులు దున్నడం వంటి పనులు చేస్తూ సాగుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా భావించి విక్రయదారులు నకిలీ, నాసిరకం విత్తనాలు రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అధికారులు నకిలీలపై నజర్‌ పెట్టారు. జిల్లాలోని వివిధ మండలాలు, డివిజన్‌ కేంద్రాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాల నిఘా

వానాకాలంలో చాలామంది రైతులు పత్తి, మొక్కజొన్న, వరి పంటలను అధికంగా సాగు చేస్తుంటారు. ఇదే సమయంలో అనుమతి లేని విత్తనాలు, బీటీ-3 విత్తనాలు, నకిలీ విత్తనాలను వ్యాపారులు మార్కెటింగ్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. నకిలీ విత్తనాల వల్ల దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందంలో వ్యవసాయ, పోలీసుశాఖ అధికారులు, సీడ్‌ సర్టిఫయింగ్‌ ఆఫీసర్‌ (ఏసీసీవో) ఉన్నారు. అధికారులు ఎరువులు, విత్తనాల దుకాణాల్లో విత్తనాలు, పురుగు మందుల స్టాకు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దుకాణాలకు సంబంధించి లైసెన్సులు, విత్తనాల స్టాక్‌ జాబితాలను పరిశీలిస్తున్నారు. విత్తనాలు, ఫర్టిలైజర్‌ మందుల విక్రయానికి సంబంధించిన రశీదు పుస్తకాలను తనిఖీ చేస్తున్నారు. ఏఈవోలు గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అధికారుల కన్నుగప్పి నకిలీ విత్తనాలు అమాయక రైతులకు అంటగట్టేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. కొందుర్గు మండలం లూర్ధునగర్‌లో ప్రభుత్వం నిషేధించిన 30 కిలోల బీఈ-3 పత్తి విత్తనాలను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విత్తన ఎంపికలో జాగ్రత్త..

నకిలీల బారిన పడకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. లైసెన్సులు పొందిన డీలర్ల నుంచే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. డీలర్ల సంతకంతో కూడిన రశీదు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన తేదీ, విత్తనాల రకం, పరిమాణం, ధర, లాట్‌ నంబర్‌ తదితర వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయించుకుని సరిచూసుకోవాలని సలహా ఇస్తున్నారు. రంగు రంగుల ప్యాకెట్లను చూసి మోసపోవద్దని, కంపెనీ విశ్వసనీయత, విత్తనాల నాణ్యత, మొలక శాతం వివరాలను పరిశీలించుకోవాలని వివరిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేసిన తర్వాత ఖాళీ విత్తనాల సంచులను పంట చేతికొచ్చే చివరిదశ వరకు జాగ్రత్తగా భద్రపరచాలని సూచిస్తున్నారు. సీజన్‌ ప్రారంభం అవుతుండడంతో కొందరు బిల్లులు లేకుండా తక్కువ ధరలకు విత్తనాలు అమ్ముతుంటారని, వారిపై వ్యవసాయ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయాలని అధికారులు రైతులకు వివరిస్తున్నారు. విత్తన మార్కెట్‌ను పెంచడం, అధికంగా విత్తనాలు అమ్మకం కోసం వివిధ కంపెనీలు వ్యాపారులకు బహుమతులు, టూర్లు ఆఫర్లను ప్రకటిస్తుండడంతో పలువురు వ్యాపారులు, డీలర్లు నకిలీ వ్యాపారం వైపు మొగ్గుచూపే అవకాశాలుంటాయని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు వివరిస్తున్నారు.

ఫర్టిలైజర్‌ దుకాణాల్లో కలెక్టర్‌ తనిఖీలు

నకిలీ విత్తనాలు అమ్మకంపై జిల్లా కలెక్టర్‌ సీరియస్‌గా ఉన్నారు. ఇటీవలే ఆయన స్వయంగా ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీ చేశారు. లైసెన్సు, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను తనిఖీ చేశారు. విత్తనాల ఎంపికపై తగు జాగ్రత్త వహించాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు. కాలం చెల్లిన, ప్రభుత్వం నిషేధించిన విత్తనాలు, పురుగుల మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించవద్దు. రైతులు ఎరువులు, విత్తనాలు కొనేటప్పుడు దుకాణాల యజమానుల వద్ద నుంచి రశీదు తీసుకోవాలి. నకిలీ విత్తన విక్రయాలను అరికట్టడానికి పోలీసుశ ాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశాం. నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి. నకిలీ విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి మోసపోవద్దు.

- గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి

Updated Date - Jun 07 , 2024 | 11:53 PM