వికారాబాద్ జిల్లా ఎస్పీగా నారాయణరెడ్డి
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:55 PM
వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి బదిలీ అయ్యారు. శంషాబాద్ జోన్ డీసీపీ కె.నారాయణరెడ్డిని వికారాబాద్ జిల్లా ఎస్పీగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మేడ్చల్ డీసీపీగా బదిలీ అయిన కోటిరెడ్డి
మేడ్చల్ డీసీపీ నితికా పంత్ టీజీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ
వికారాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) : వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి బదిలీ అయ్యారు. శంషాబాద్ జోన్ డీసీపీ కె.నారాయణరెడ్డిని వికారాబాద్ జిల్లా ఎస్పీగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నుంచి బదిలీ చేసిన కోటిరెడ్డిని మేడ్చల్ జోన్ డీసీపీగా నియమించారు. 2021, డిసెంబరు 26న జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కోటిరెడ్డి జిల్లాలో రెండున్నర సంవత్సరాలు కొనసాగారు. జిల్లాలో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా కోటిరెడ్డి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. నేరాల నియంత్రణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఫలితంగా జిల్లాలో గత రెండున్నరేళ్లలో నేరాల తీవ్రత శాతం తగ్గింది. కేసుల సంఖ్య పెరిగినా ఘోరాల సంఖ్య తగ్గింది. వివిధ నేర సంఘటనల్లో విచారణ వేగవంతం చేసి నిందితులకు జైలుశిక్ష పడే విధంగా కృషి చేశారు. నేరాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ విచారణలో పురోగతి సాధించేలా కిందిస్థాయి అధికారులకు అవసరమైన సూచనలు చేస్తూ సత్ఫలితాలు సాధించగలిగారు. సామాజిక కార్యక్రమాల్లోనూ పోలీసులు ముందుండేలా ఎస్పీ ప్రోత్సహించారు. సమాజంలో ప్రజలకు సవాల్‌గా మారిన నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రజలను చైతన్య పరిచేలా కృషి చేశారు. సమాజంలో ఎక్కడ మోసపోయిన సంఘటనలు చోటుచేసుకున్నా ప్రజలు అలాంటి సంఘటనల పట్ల అప్రమత్తంగా ఉండే విధంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వైట్‌కాలర్ మోసాలు, సైబర్‌నేరాల పట్ల ప్రజలను చైతన్య పరిచేందుకు ఎంతో కృషి చేశారు. వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్న కోటిరెడ్డి తన కిందిస్థాయి అధికారులు, సిబ్బందితోనూ మంచిగా మెలిగేవారన్న పేరు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలతో జిల్లాకు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇద్దరూ కొత్త అధికారులు రానున్నారు. ఐఏఎస్ అధికారుల బదిలీల్లో ఇటీవల వరకు జిల్లా కలెక్టర్‌గా కొనసాగిన సి.నారాయణరెడ్డి నల్లగొండ జిల్లాకు బదిలీ కాగా, భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ జిల్లా కలెక్టర్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. జిల్లాకు బదిలీపై వస్తున్న నారాయణరెడ్డి ఒకటి, రెండు రోజుల్లో బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిసింది.
మేడ్చల్ డీసీపీ నితికా పంత్ బదిలీ
మేడ్చల్ డీసీపీ నితికా పంత్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మేడ్చల్ జోన్ డీసీపీగా వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డిని నియమించగా, అక్కడ పనిచేస్తున్న నితికా పంత్‌ను ఆదిలాబాద్ జిల్లా, యాపాలగూడలోని టీజీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్‌గా నియమించారు.