Share News

Gaddar Award : నంది.. ఇక గద్దర్‌ అవార్డు

ABN , Publish Date - Feb 01 , 2024 | 03:58 AM

నంది అవార్డులు విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నంది అవార్డులను ఇక మీద గద్దర్‌ అవార్డులుగా అందిస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది గద్దర్‌ జయంతి రోజున కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్‌ అవార్డు అందజేస్తామని

Gaddar Award : నంది.. ఇక గద్దర్‌ అవార్డు

వచ్చే ఏడాది నుంచి కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు పురస్కారాలు

ఇదే శాసనం.. నా మాటే జీవో : సీఎం రేవంత్‌ రెడ్డి

గద్దర్‌ జయంతి కార్యక్రమంలో కీలక ప్రకటన

హైదరాబాద్‌, రవీంద్రభారతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): నంది అవార్డులు విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నంది అవార్డులను ఇక మీద గద్దర్‌ అవార్డులుగా అందిస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది గద్దర్‌ జయంతి రోజున కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్‌ అవార్డు అందజేస్తామని వెల్లడించారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌ నంది అవార్డులపై ప్రకటన చేశారు. అలాగే, మాజీ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కొంతకాలంగా నిలిచిపోయిన నంది అవార్డులను సినీ ప్రముఖులు, కళాకారులు నుంచి వచ్చిన వినతుల మేరకు పునరుద్ధరిస్తున్నామని సీఎం ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ లెజెండ్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన గద్దర్‌ పేరిట ఆ పురస్కారాలు అందజేస్తామని, ఇదే శాసనం.. నా మాటే జీవో.. అని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో వేదికపై ఉన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇతర నేతలు సీఎంను ఆలింగనం చేసుకున్నారు. గద్దర్‌ కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. రేవంత్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయం గద్దర్‌కు ఇచ్చే గొప్ప అవార్డు, రివార్డు అని కొనియాడారు. ఇక, రాష్ట్రంలో ఓ జిల్లాకు గద్దర్‌ పేరు పెట్టాలని, ట్యాంక్‌బండ్‌పై గద్దర్‌ విగ్రహం పెట్టాలని అంతకుముందు సభలో పాల్గొన్న ప్రముఖులు చేసిన విజ్ఞప్తులపై కూడా సీఎం సానుకూలంగా స్పందించారు. కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

గద్దర్‌ను కలిస్తే వెయ్యి ఏనుగుల బలం..

గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని అరాచక, నియంత పాలనను చూసి నిరాశకు లోనైనప్పుడు తాను గద్దర్‌ను కలిసేవాడినని, వెయ్యి ఏనుగుల బలం వచ్చేదని సీఎం తెలిపారు. గద్దర్‌ ఇచ్చిన స్ఫూర్తితోనే ప్రజలకు అనుమతి లేని ఇనుప కంచెల గడీలను బద్దలుకొట్టి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజాపాలన రావాలని ఆకాంక్షించే భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొని గద్దర్‌ సంఘీభావం తెలిపారన్నారు. ‘పొలిటిషియన్‌తో కొట్లాడడం సులువు. క్రిమినల్‌తో పోట్లాడటం అంతకంటే సులువు.. నీ ఎదురుగా ఉన్న కేసీఆర్‌ పొలిటిషియన్‌ కాదు క్రిమినల్‌ అని గద్దర్‌ చెప్పేవారు’’ అని రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. కేసీఆర్‌ క్రిమినల్‌ పొలిటిషియన్‌ కావడం వల్లే ప్రతి పనిని అడ్డుకుని శాపనార్ధాలు పెడుతున్నారని ఆరోపించారు. నిక్కర్‌ పార్టీ, లిక్కర్‌ పార్టీ ఒక్కటై కాంగ్రెస్‌ రాకుండా అడ్డుకున్నారని బీజేపీ, బీఆర్‌ఎ్‌సను ఉద్దేశిస్తూ సీఎం అన్నారు. ప్రజలు మొన్నటి ఎన్నికల్లో లిక్కర్‌ పార్టీని ఓడించారని వచ్చే ఎన్నికల్లో నిక్కర్‌ పార్టీని ఓడిస్తారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌వి పగటి కలలు..

మరో ఆరు నెలల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్‌ పగటికలలు కంటున్నారని, ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకుంటున్నారని సీఎం విమర్శించారు. ‘‘గత ఎన్నికల్లో ప్రజలు బొక్కలు ఇరగ్గొట్టి బోర్ల పడేసిన్రు.. ఇంకా మీ బొక్కలే సక్కగ్గాలేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని పగటికలలు కంటున్నారు.? ప్రయత్నం చేసి చూస్తే తెలుస్తది ప్రజల ఆగ్రహం ఏమిటో.? నాడు నాదెండ్ల భాస్కరరావు ఇలాంటి వేషాలే వేస్తే ప్రజలు ఊళ్లోకి కూడా రానివ్వలేదు. నేడు అలాంటి ఆలోచనలు చేస్తే.. ప్రజలు గోరీ కడ్తరు. మీరు బతికుండగానే గోరీ కట్టించ్చుకోవాలంటే ప్రయత్నంచి చూడండి. ఇది మీ ఒంటికి, ఇంటికి మంచిది కాదు’’ అని.. సీఎం రేవంత్‌ హెచ్చరించారు. పదేళ్ల సుస్థిర పాలన అందించే బాధ్యత తమ మంత్రివర్గానిది అని రేవంత్‌ అన్నారు. కేసీఆర్‌ దుర్మార్గుడనే విషయం ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవితకు కూడా తెలుసునని అన్నారు. అసెంబ్లీలో జ్యోతీరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని తండ్రి పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అడగని కవిత.. ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాగానే అసెంబ్లీ స్పీకర్‌కు వినతపత్రం ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తండ్రిపై విశ్వాసం, నమ్మకం లేకనే కవిత నాడు దైర్యం చేయలేదని అన్నారు.

రెండున్నర గంటలు వేదికపై ముఖ్యమంత్రి

గద్దర్‌ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు రవీంద్రభారతి వచ్చిన సీఎం రేవంత్‌ సభా వేదికపై సుమారు రెండున్నర గంటలు ఉన్నారు. వేదికపై ఉన్న ప్రముఖులు మాట్లాడే వరకు వేచి ఉండి అనంతరం ప్రసంగించారు. అయితే సీఎం హోదాలో తొలిసారి రవీంద్రభారతి వచ్చిన రేవంత్‌ రెడ్డి ఇంత సమయం కేటాయించడంపై ప్రేక్షకులు, నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

గద్దర్‌ కోరుకున్న మార్పు కోసం కృషి : భట్టి

కాగా, తన గళంతో సమాజాన్ని చైతన్యపరిచిన మహనీయుడు గద్దర్‌ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. గద్దర్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగుతుందని ఆకాంక్షించారు. గద్దర్‌ కోరుకున్న మార్పు కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని హామీ ఇచ్చారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడూతూ లాఠీలు, తూటాలను ఎదుర్కొని సమసమాజ స్థాపనకు అకుంఠిత దీక్షతో పనిచేసిన మహోన్నతుడు గద్దర్‌ అని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ గద్దర్‌ ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. కాగా, అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావుపూలే విగ్రహ ఏర్పాటు కోసం కలిసి రావాలని ఎమ్మెల్సీ కవిత తనను కోరితే తిరస్కరించారని కంచె ఐలయ్య ఈ సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వం గద్దర్‌ను అవమానించిందని అన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 03:58 AM