Share News

‘వ్యాట్‌’ లేకుండానే విదేశీ మద్యం తరలింపు!

ABN , Publish Date - Apr 04 , 2024 | 05:03 AM

విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యంపై వ్యాట్‌ (విలువ ఆధారిత పన్ను) వసూలు చేయకుండా రవాణా జరుగుతుందన్న అంశం ఆబ్కారీ, వాణిజ్య పన్నుల శాఖల మధ్య వివాదానికి

‘వ్యాట్‌’ లేకుండానే విదేశీ మద్యం తరలింపు!

ఆబ్కారీ, వాణిజ్య పన్నుల శాఖల మధ్య వివాదం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యంపై వ్యాట్‌ (విలువ ఆధారిత పన్ను) వసూలు చేయకుండా రవాణా జరుగుతుందన్న అంశం ఆబ్కారీ, వాణిజ్య పన్నుల శాఖల మధ్య వివాదానికి తెరదీసింది. గత నెల 30వ తేదీన టీఎ్‌సబీసీఎల్‌ నుంచి ఎస్‌వీ డిస్ట్రిబ్యూటర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ టీఎస్‌ 07యూఈ3445 వాహనంలో బుల్‌డాగ్‌ లండన్‌ డ్రైజిన్‌ అనే దిగుమతి చేసుకున్న విదేశీ మద్యాన్ని టానిక్‌ మద్యం వ్యాపారుల కోసం డిపో నుంచి తరలిస్తుండగా బోయిన్‌పల్లిలోని బల్‌మరాయి వద్ద వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టుకున్నారు. వాహనంలో రూ.8,24,044 విలువ చేసే దిగుమతి చేసుకున్న విదేశీ మద్యాన్ని తరలిస్తున్నారని, దీనికి 70 శాతం వ్యాట్‌ రూ.5,76,839 చెల్లించకుండానే రవాణా చేస్తున్నారని వాహనాన్ని సీజ్‌ చేశారు. అయితే మద్యం కొనుగోలు చేసే పాయింట్‌లోనే టీఎ్‌సబీసీఎల్‌ వ్యాట్‌ వసూలు చేస్తుందని, డిపో నుంచి వెళ్తున్న వాహనాలకు ప్రత్యేకంగా ఈ వేబిల్లు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎక్సైజ్‌ శాఖ అధికారులు వాదిస్తుండగా.. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మాత్రం వ్యాట్‌ చెల్లించకుండా మద్యం రవాణా జరుగుతుందని ఆరోపిస్తున్నారు. ఈ వివాదంలో సీజ్‌ చేసిన వాహనాన్ని వదిలిపెట్టాలంటూ ఓ మాజీ మంత్రి, ఉన్నతాధికారులు వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై ఒత్తిడి చేయడం చర్చనీయాంశమైంది.

Updated Date - Apr 04 , 2024 | 08:39 AM