Share News

Komati Reddy : కబ్జాపై కదిలారు

ABN , Publish Date - Jan 18 , 2024 | 04:37 AM

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో రూ.450 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కొండలు, గుట్టలు తొలిచేస్తూ రోడ్డు నిర్మాణం చేపట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

Komati Reddy : కబ్జాపై కదిలారు

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి.. కబ్జాదారులు, అధికార్లపై ఆగ్రహం

తెల్లవారుజామున ఐదున్నరకే అధికారులకు ఆదేశం.. ఉదయం పది గంటల కల్లా ప్రాథమిక నివేదిక

ఖాజాగూడ పెద్దచెరువు కబ్జాను అడ్డుకుని.. రోడ్డు పనులు ఆపాలని సీఎస్‌, రంగారెడ్డి కలెక్టర్‌కు ఆదేశం

ఆక్రమణదారులు జైలుకే.. వారిపై మూడు నెలల్లో చర్యలు తీసుకుంటామని వెల్లడించిన మంత్రి

ఆక్రమిత ప్రాంతాన్ని పరిశీలించిన యంత్రాంగం.. అది ప్రభుత్వ భూమి అంటూ బోర్డుల ఏర్పాటు

ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు.. కబ్జా చేసి రోడ్డు వేస్తున్నది ‘గుర్తు తెలియని వ్యక్తులట’

హైదరాబాద్‌ సిటీ, రాయదుర్గం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో రూ.450 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కొండలు, గుట్టలు తొలిచేస్తూ రోడ్డు నిర్మాణం చేపట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఖాజాగూడ పెద్ద చెరువును ఆనుకొని ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ విల్లా ప్రాజెక్టుకు అనువుగా ఈ రోడ్డును నిర్మిస్తుండడాన్ని ‘కూల్‌గా కబ్జా’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం నాటి ప్రధాన సంచికలో కథనం ప్రచురించింది. తెల్లవారుజామున 5.30 గంటలకే ఈ కథనాన్ని చదివిన ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఉదయం 10 గంటలకల్లా ప్రాథమిక నివేదిక అందజేయాలని ఆదేశించారు. నల్లగొండలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.. హైదరాబాద్‌లోని రెవెన్యూ ఉన్నతాధికారుల నుంచి ప్రాథమిక నివేదిక అందిన అనంతరం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం కబ్జా బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చినట్లు రూఢీ చేసుకున్నారు. నిర్మాణదారులు, అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ నుంచే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ యంత్రాంగం పరిశీలన

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై మంత్రి ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఖాజాగూడ పెద్ద చెరువును అనుకొని నిర్మాణం జరుగుతున్న రోడ్డు పనులను, ఆ ప్రాంతాన్ని బుధవారం రాజేంద్రనగర్‌ ఆర్‌డీఓ మల్లయ్యతో పాటు ఇరిగేషన్‌ ఏఈ నాగరాజు, జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-20 డిప్యూటీ కమిషనర్‌ రంజీత్‌, హైదరాబాద్‌ మెట్రో అధికారులు సందర్శించారు. దర్జాగా ఘాట్‌ రోడ్డు తరహాలో సాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. మంగళవారం రాత్రి వరకు బుల్డోజర్లు, ట్రాక్టర్లు, టిప్పర్లతో పనులు జరగ్గా, బుధవారం ఉదయానికి పనులు ఆగిపోయాయి. అక్కడ బుల్డోజర్లు, ట్రాక్టర్లు, టిప్పర్లు ఏవీ లేవు. చెరువు నుంచి కొండపైకి వేసే రోడ్డులో ముందు భాగంలో ఔట్‌పోస్టు వద్ద సెక్యూరిటీ సిబ్బంది కూడా లేరు. అక్కడి కొండలు, గుట్టలను తవ్విన తీరును పరిశీలించారు. అనంతరం ఆర్‌డీఓ మల్లయ్య మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని రాయదుర్గం పాయ్‌గా సర్వే నెంబర్‌ 66/1లో 7 ఎకరాలు, 66/2లో 1.20 ఎకరాలు మొత్తం 8.20 ఎకరాల భూమిని ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌కు గతేడాది సెప్టెంబరులో పంచనామా చేసి అప్పగించినట్లు తెలిపారు. చెరువు నుంచి గుట్టపైకి రోడ్డు నిర్మాణం ఏ ప్రభుత్వ విభాగం చేపట్టడం లేదని, అక్రమంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అయితే ‘ఆంధ్రజ్యోతి’కి కూడా రంగారెడ్డి డీపీఆర్‌ఓ ద్వారా ఆర్డీఓ లేఖను అందజేశారు. అందులోని వివరాల ప్రకారం.. రాయదుర్గం పాన్‌మక్తాలో సర్వే నెంబర్‌ 66లో 2009-10 పహణి ప్రకారం 109.32 ఎకరాల భూమి ‘పొరంబోకు’ కింద ఉండగా వివిధ సంస్థలకు ప్రభుత్వం కేటాయింపులు చేసిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌కు పంచనామా చేసి అప్పగించిన 8.2 ఎకరాల స్థలంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు నిర్మించడాన్ని గుర్తించినట్లు వివరించారు. అక్రమంగా రోడ్డేసిన వారిపై క్రిమినల్‌ కేసుల నమోదుకు ఫిర్యాదు చేశామని, మెట్రో, ఇరిగేషన్‌ అధికారులు ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు ఏర్పాటు చేశారని తెలిపారు.

కబ్జా బాధ్యులను కప్పిపుచ్చేందుకు తిప్పలు

శేరిలింగంపల్లి మండలంలో కొన్నాళ్లుగా యథేచ్ఛగా సాగుతున్న కబ్జాలపై అధికార యంత్రాంగం తీరు ఆది నుంచి విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా ఓ వైపు ‘ఆంధ్రజ్యోతి’లో కథనం.. ఆ వెంటనే మంత్రి ఆదేశాలతోనే ప్రభుత్వ యంత్రాంగం కదిలిందే తప్ప అంతకుముందు విషయం తెలిసినా రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం ఆ వైపు కన్నెత్తి చూడలేదు. ప్రభుత్వ భూమిలో కొండలను తొలుస్తూ రోడ్డేస్తున్న వైనాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వారం రోజుల ముందే రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్‌, హెచ్‌ఆర్‌డీసీఎల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వివరణ కోరింది. ఆ సందర్భంలో తమకు తెలియదని, తాము ఎలాంటి అనుమతివ్వలేదంటూ అధికారులు చెప్పుకొచ్చారు తప్ప ఎలాంటి చర్యలకూ ఉపక్రమించలేదు. ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చిన తర్వాతే రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్‌ అధికారులు హడావుడి చేశారు. కబ్జా ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. కబ్జా బాధ్యులను అధికారులెవ్వరూ గుర్తించలేదు. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తవ్వకాలు జరిపారనే దాన్ని పరిశీలించారు. తవ్వకాల ఆధారంగా ఏ నిర్మాణ సంస్థ పనులు చేపట్టిందో గుర్తించడం సులువు. కానీ అదేమీ చేయలేదు. పరిసర ప్రాంతాల వారిని అధికారులు కనీసం ఆరా తీయలేదు. కబ్జా బాధ్యులను కప్పిపుచ్చే విధంగా అధికారుల తీరు ఉందని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రోడ్డేసేది ‘గుర్తు తెలియని’ వ్యక్తులట!’

ఖాజాగూడ పెద్దచెరువును అనుకొని కొండలు గుట్టలను తొలుస్తూ రోడ్డేయ్యడంపై శేరిలింగంపల్లి ఆర్‌ఐ బుధవారం సాయంత్రం రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని అందజేయడానికి రెవెన్యూ అధికారులు ఆసక్తి చూపలేదు. రాయదుర్గం ఎస్‌ఐ శ్రీనివాస్‌ వివరాల ప్రకారం.. రాయదుర్గం పాన్‌మక్తా సర్వే నెంబర్‌ 66/1లో ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసి రోడ్డేస్తున్నారంటూ శేరిలింగంపల్లి మండల అదనపు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు ఫిర్యాదు చేశారని, దాంతో కబ్జా చేయడం, పబ్లిక్‌ ఆస్తులను ధ్వంసం చేయడం లాంటి అంశాల ఆధారంగా 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రెవెన్యూ అధికారులు చేసిన ఫిర్యాదులో ప్రభుత్వ భూమిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసి రోడ్డేస్తున్నారంటూ పేర్కొనడం గమనార్హం. చెరువు పక్కనే ఔట్‌పోస్టు ఏర్పాటు చేసి మరీ యథేచ్ఛగా ఘాట్‌ రోడ్డు తరహాలో పనులు సాగించగా.. కూలీలు గుర్తు తెలియనివారు అయినా.. పనులు చేయించిన సంస్థ గుర్తు తెలియనిది ఎలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొండలు, గుట్టలను తొలిచేసి అక్రమంగా రోడ్డేస్తున్నవారు స్థానికంగా అధికార యంత్రాంగానికి తెలిసినప్పటికీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వెనుక మాజీ మంత్రి బామ్మర్ది ప్రమేయం ఉండడంతో వారి పేర్లను చేరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడతామని జంకుతున్నట్లు తెలిసింది. అందుకే నిర్మాణ సంస్థ పేరు కానీ, కీలక వ్యక్తుల పేర్లు చేర్చలేదని తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణలో వారే బయటపెడతారని భావించినట్లు సమాచారం. ఆది నుంచి రెవెన్యూ అధికారుల తీరు తమ చేతులకు మట్టి అంటకుండా తప్పించుకుంటున్నట్లు ఉండడం గమనార్హం.

చడీచప్పుడు లేని మెట్రో అధికారులు

బయో డైవర్సిటీ సర్కిల్‌ పక్కనే దాదాపుగా రూ.1,200 కోట్లకు పైగా విలువైన 8.20 ఎకరాల ప్రభుత్వ భూమిని మెట్రో అధికారులకు అప్పగిస్తే వారు కనీసం ఆ వైపు తొంగి చూడలేదు. తమ భూమి అంటూ ఇప్పటి వరకు ఎలాంటి బోర్డు కూడా అక్కడ పాతలేదు. ‘కూల్‌గా కబ్జా’ కథనం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి మంత్రితో పాటు ఉన్నతాధికారులు స్పందించారు. కానీ సరిగ్గా నాలుగు నెలల క్రితం ఐటీ కారిడార్‌లో గజం రూ.3 లక్షలకు పైగా ధర పలికే ప్రాంతంలో 8.20 ఎకరాల ప్రభుత్వ భూమిని పొందిన హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఉన్నతాధికారులు చడీచప్పుడు లేకుండా ఉన్నారు. ఒకరిద్దరు అధికారులను రెవెన్యూ అధికారులకు తోడుగా పంపి చేతులు దులుపుకున్నారు. పంచనామా చేసి హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులకు అప్పగించామని రెవెన్యూ అధికారులు చెబుతున్నా నాటి రంగారెడ్డి కలెక్టర్‌ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని అధికారుల్లోనే చర్చ నడుస్తోంది. తమకు సంబంధం లేదని రెవెన్యూ, తమకు ఆదేశాలు అందలేదని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ దోబుచులాడుతుండగా మధ్యలో సందట్లో సడేమియాలా ప్రముఖ నిర్మాణ సంస్థ దర్జాగా రోడ్డేసుకోవడం విశేషం.

Updated Date - Jan 18 , 2024 | 06:28 AM