Share News

నేవీరాడార్‌ ఏర్పాటుకు కదలిక

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:31 PM

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇండియన్‌ నేవీరాడార్‌ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టు ఏర్పాటుకు కదలిక వచ్చింది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు తాజా పరిణామాలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది.

నేవీరాడార్‌ ఏర్పాటుకు  కదలిక
9పిఆర్‌జి 3, 4: నేవీరాడార్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న పూడూరులోని అటవిప్రాంతం

తాజాగా సీఎంవోను సంప్రదించిన నేవీరాడార్‌ అధికారులు

కొత్త ప్రభుత్వంలో ప్రాజెక్టు ఏర్పాటు

రాష్టానికే తలమానికం కానున్న ప్రాజెక్టు

రూ.2000 కోట్లు, రూ.2934 ఎకరాల భూముల గుర్తింపు

వికారాబాద్‌ జిల్లా పూడూరులో ఏర్పాటు

పరిగి, జనవరి 9: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇండియన్‌ నేవీరాడార్‌ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టు ఏర్పాటుకు కదలిక వచ్చింది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు తాజా పరిణామాలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఇండియన్‌ నేవీరాడార్‌ ప్రాజెక్టు పూడూరు మండలం దామగుండం అటవీప్రాంతం వేదిక కానుంది. నేవీ రాడార్‌కు సంబంధించి నేవీ శాఖ కమాండో కార్తీక్‌శశాంక్‌ మంగళవారం నేవీరాడార్‌ ప్రాజెక్టుకు సంబంధించి సీఎంవో అధికారులను సంప్రదించారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం. ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు ఏర్పాటుకు మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టు ఏర్పాటు తెలంగాణ రాష్ట్రానికే తలమానికం కానుంది ఈ నేవీరాడార్‌ ప్రాజెక్టు. ఈ నేవీ రాడార్‌ ప్రాజెక్టు ఏర్పాటు కోసం రిజర్వ్‌ ఫారేస్ట్‌ ఆధీనంలో ఉన్న 2,934 ఎకరాల భూములను అప్పట్లోనే గుర్తించారు. 2011--12లో ప్రాజెక్టు ప్రక్రియ ప్రారంభం కాగా, 2015లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంచనాకు వచ్చాయి. గతంలోనే పలుమార్లు ఇండియన్‌ నేవీరాడార్‌ శాఖ అధికారులు దామగుండం దేవాలయ భూములను కూడా తీసుకునేందుకు పూడూరు గ్రామస్తులతో సమావేశం నిర్వహించి అంగీకారం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వానికి మెలిక పెట్టింది. సికింద్రాబాద్‌లోని బైసన్‌పోలో మైదానం స్థలం ఇస్తే, పూడూరులో నేవిరాడార్‌కు భూములు అప్పగిస్తామని గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం మెలిక పెట్టడంతో కేంద్రరక్షణ శాఖ బైసన్‌పోలో మైదానం ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించి భూముల అప్పగింతకు కేసీఆర్‌ నిరాకరించడంతో ప్రాజెక్టు ఏర్పాటు పెండింగ్‌లో పడింది. ప్రస్తుతం కొత్త సర్కారు ఏర్పాటుతో కదలిక ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కూడా కొత్త సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా చెప్పడంతో ప్రాజెక్టు ఏర్పాటు ముందడుగు పడినట్లుగా చెబుతున్నారు.

రూ.2000కోట్లతో భారీ ప్రాజెక్టు

రాష్ట్ర రాజధాని నుంచి సరిగ్గా 60 కీలోమీటర్ల దూరంతో పాటు, సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తైన ప్రాంతాన్ని ఇండియన్‌ నేవీ శాఖ ఎంచుకుంది. దామగుండం అటవీ ప్రాంతాల్లో 2,934 ఎకరాలను గుర్తించిన ఇండియన్‌ నేవీ 2011-12లో ప్రతిపాదనలు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టింది. ఇట్టి భూ భాగం రిజర్వ్‌ ఫారె్‌స్టకు సంబంఽధించింది కావడం, అక్కడ పురాతన దామగుంగం రామలింగేశ్వర దేవాలయం ఉండడంతో మొదటల్లో కాస్త అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.127 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఇదే సమయంలో పురాతన దేవాలయానికి దారి వదలాలని గ్రామస్తులు మెలిక పెట్టారు. ప్రస్తుతం ఉన్న దేవాలయం అలాగే ఉంచి, పూడూరు గ్రామంలో రూ.5 కోట్లతో కొత్త గుడి నిర్మాణంతో పాటు, అభివృదికి నిధులు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇంతకాలం పెండింగ్‌లో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అవరోధాలు తొలగినప్పటికీ భూముల అప్పగింత జాప్యంతో పెండింగ్‌లో పడింది. తాజాగా నేవీరాడార్‌ వ్యవస్థకు సంబంధించిన ఈ ప్రాజెక్టును ప్రారంభించే ప్రక్రియకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లు తెలిసింది. ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభం కావాలంటే పర్యావరణం, అటవీశాఖ, దేవాదాయశాఖ,. కాలుష్యనియంత్రణ బోర్డు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ తదితర 16 రకాల అనుమతులతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా క్లియరెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇండియన్‌ నేవీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి చ్చే 15 రకాల అనుమతులు కూడా పొందినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి.

ఇక్కడే ఎందుకు..

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీశాఖ ప్రాంతం సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో ఉండడంతో నేవీ రాడార్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని అధికారులు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఎత్తైన ప్రదేశం కావడంతో రాడార్‌ ద్వారా సముద్రమార్గాన్ని వీక్షించే అవకాశం ఉంది. రాడార్‌ వ్యవస్థ శతృదుర్బేధ్యాలకు దూరంగా ఉండాలన్నదే ప్రధాన ఉద్దేశం. దామగుండం అడవులు అందుకు అనుకూలంగా ఉన్నాయని గుర్తించారు. పైగా నేవీ రాడార్‌కు అవసరమైన విశాలమైన స్థలం లభించడం కూడా ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇక్కడ నుంచే అంతర్జాతీయ స్థాయిలో నేవీ వ్యవస్థను సిగ్నల్స్‌ ద్వారా మానిటరింగ్‌ చేస్తారు. దేశంలో కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఉన్న నేవీరాడార్‌ పూడూరులో ఏర్పాటుకు ఆ శాఖ సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటీకీ పూడూరులో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుండడంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది.

నేవీరాడార్‌ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది

కొన్నేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న నేవీరాడార్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్‌రెడ్డికి వివరించా. భూముల అప్పగింత విషయంలో సానుకూలతను తెలిపారు. రెండువేల కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. కేంద్రం నుంచి కూడా దాదాపుగా అన్ని రకాల అనుమతులు వచ్చాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలతో ఉంది. త్వరలోనే ప్రాజెక్టు ఏర్పాటు పనులు చేపట్టే అవకాశం ఉంది. జిల్లాకు దేశ స్థాయిలో గుర్తింపు రానుంది.

-డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి

Updated Date - Jan 09 , 2024 | 11:31 PM