Share News

దేశ భవిత కోసం మోదీ పోరాటం

ABN , Publish Date - May 07 , 2024 | 06:10 AM

ప్రధాని మోదీ దేశ భవిష్యత్‌ కోసం పని చేస్తుంటే, రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని పని చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీకి పేదల కష్టాలు తెలుసని.. అందుకే దేశ వ్యాప్తంగా అనేక సంక్షేమ

దేశ భవిత కోసం మోదీ పోరాటం

ప్రధాని కావాలని రాహుల్‌ ఆరాటం

బీజేపీ ఏలుబడిలో

ఉగ్రవాదులపై ఉక్కుపాదం

మోదీ సుపరిపాలన వల్లే సాధ్యం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తోడు దొంగలు

ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ప్రధాని మోదీ దేశ భవిష్యత్‌ కోసం పని చేస్తుంటే, రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని పని చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీకి పేదల కష్టాలు తెలుసని.. అందుకే దేశ వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 13 కోట్ల పేద కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడారని పేర్కొన్నారు. సోమవారం ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని కషీష్‌ కన్వెన్షెన్‌ హాల్‌లో జరిగిన యువ సమ్మేళనంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో దేశంలో పాకిస్తాన్‌ ఉగ్రవాదుల అరాచకాలు విపరీతంగా ఉండేవని, అనేక మంది దేశ పౌరులను హత్య చేశారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఆ పరిస్థితి లేదని, మోదీ సుపరిపాలన వల్లే అది సాధ్యమైందని అన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతున్న సమయంలో 25వేల మంది భారత పౌరులు ఆ దేశంలో చిక్కుకుంటే.. యుద్ధాన్ని ఆపి వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రధాని మోదీ ఎంతో కృషిచేశారని కొనియాడారు. నగరంలో గతంలో 35 శాతం ఓటింగ్‌ మాత్రమే జరిగేదని ఈసారి ఓటింగ్‌ శాతాన్ని పెద్ద ఎత్తున పెంచాలన్నారు. అందుకు యువత సోషల్‌ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. మరోసారి తనను ఎంపీగా గెలిపించాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సనత్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే పాల్గొన్నారు.

సనత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ వద్ద ప్రారంభమైన ర్యాలీ.. స్వామి థియేటర్‌, బేగంపేట విమానాశ్రయం, జేమ్స్‌ స్ట్రీట్‌, ముషీరాబాద్‌ ఎక్స్‌ రోడ్‌ మీదుగా బాపునగర్‌ వరకు సాగింది. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగిస్తామని ప్రధాని మోదీ అనలేదని, మతపరమైన రిజర్వేషన్లు వద్దు అని మాత్రమే అన్నారని ఎంపీ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు తోడు దొంగలని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ధ్వజమెత్తారు. కేసీఆర్‌ కుటుంబం అవినీతికి పాల్పడిందని, ఆయన కూతురు జైల్లో ఉందని విమర్శించారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ గాంధీలపై కేసులు ఉన్నాయని వారు బెయిల్‌పై బయట ఉన్నారని పేర్కొన్నారు. మహబూబాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్‌కు మద్దతుగా వరంగల్‌ జిల్లా నర్సంపేటలో సోమవారం నిర్వహించిన జన సభలోనూ పుష్కర్‌సింగ్‌ ధామి మాట్లాడారు.కాంగ్రెస్‌.. అవినీతి, కుంభకోణాల పార్టీ అని ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.

Updated Date - May 07 , 2024 | 06:10 AM