Share News

రైల్వే స్టేషన్ల ఆఽధునికీకరణ ప్రశంసనీయం

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:38 PM

దేశంలోని రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ పథకం ఎంపిక చేసి వాటిని ఆధునికీకరించడానికి పనులు ప్రారంభించడం ప్రశంసనీయమని మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లా రెడ్డి అన్నారు.

 రైల్వే స్టేషన్ల ఆఽధునికీకరణ ప్రశంసనీయం
మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడ్చల్‌ టౌన్‌, ఫిబ్రవరి 26 : దేశంలోని రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ పథకం ఎంపిక చేసి వాటిని ఆధునికీకరించడానికి పనులు ప్రారంభించడం ప్రశంసనీయమని మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లా రెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్‌ రైల్వేస్టేషన్‌లో అమృత్‌ భారత్‌ పథకం కింద రైల్వే స్టేషన్‌ అధునీకరణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రరంభించే కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధితో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు, మేడ్చల్‌ పట్టణ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గతంలో రైల్వేస్టేషన్లు దుర్గంధంతో కంపుకొడుతూ ఉండేవని ప్రస్తుతం ఆధునికీకరణతో ఎయిర్‌పోర్టును తలపించే విధంగా అభివృద్ధ్ది చేయనున్నారన్నారు. మేడ్చల్‌ ప్రజల కోసం అందిస్తున్న అమృత్‌భాతర్‌ సేవల పట్ల ప్రధాని మోదీకి ఎమ్మెల్యే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మేడ్చల్‌, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో అండర్‌ పాస్‌ పనులతో పాటు గౌడవెల్లి గ్రామంలో పనులను త్వరగా పూర్తి చేసి ప్రజల కష్టాలు తీర్చాలని రైల్వే శాఖ అధికారులను కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రిదీపికానర్సింహారెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, మేడ్చల్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి వజ్రెష్‌ యాదవ్‌, మేడ్చల్‌ రూరల్‌ జిల్లా బీజీపీ అధ్యక్షుడు విక్రమ్‌ రెడ్డి, రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఒకే వేదికపై నేతల గుసగుసలు

అమృత్‌భారత్‌ పథకం కింద మేడ్చల్‌ రైల్వేస్టేషన్‌ అధునికీకరణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్ఛేసిన పలు పార్టీల నేతలు ఒకే వేదికపై రాజకీయలకు అతీతంగా ఉల్లాసంగా గడిపారు. రైల్వేశాఖ అధికారులు కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన నాయకులకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో కార్యక్రమానికి చేరుకున్న మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌శరత్‌ చంద్రారెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్‌ రెడ్డి, నియోజక వర్గం కాంగ్రెస్‌ ఇన్‌చార్జి వజ్రేష్‌ యాదవ్‌, బీజేపీ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌ రెడ్డిలు ఒకే వేదిక పైకూర్చుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. జోకులు వేసుకుంటూ...నవ్వుతూ.. గుసగుసలాడు తూ కనిపించింది.

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి రూ. 24.35 కోట్లు

వికారాబాద్‌ : అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీం కింద వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ అధునికీకరణకు రూ. 24.35 కోట్లు మంజూరు కాగా, మోదీ వర్చువల్‌ పనులకు శంకుస్థాపన చేశారు. దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ కె. శ్రీనివాస్‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, ఆయా రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్‌ వరకు ఎంఎంటీఎస్‌ రైలును తీసుకురావడం జరుగుతుందన్నారు. బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌ మాట్లాడుతూ. వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. అనంతగిరి, రామయ్యగూడ గేట్ల వద్ద బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని రైల్వే డిప్యూటీ ఛీప్‌ ఇంజనీర్‌ కె. శ్రీనివా్‌సను కోరారు.

Updated Date - Feb 26 , 2024 | 11:38 PM