Share News

ఉమ్మడి జిల్లాలో మోస్తరు వర్షం

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:42 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శనివారం మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం ఈదురు గాలులు వీచి ఉరుముల, మెరుపులతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో మోస్తరు వర్షం
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెంలో నేలవాలిన వరి పొలం

నేలవాలిన వరి పొలాలు

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

భువనగిరి గంజ్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శనివారం మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం ఈదురు గాలులు వీచి ఉరుముల, మెరుపులతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. చేతికొచ్చిన వరి చేలు పలు గ్రామాల్లో నేలకొరిగాయి. యాదాద్రిభువనగిరి జిల్లాలో 32.5 మిల్లీమీటర్ల సగటున వర్షపాతం నమోదైంది. యాదగిరిగుట్ట మండలంలో 32.5మిల్లీమీటర్లు, ఆలేరు 32.0 మిల్లీమీటర్లు, రామన్నపేటలో 19.3 మిల్లీమీటర్లు, మోత్కురులో 17.5 మిల్లీమీటర్లు, భువనగిరిలో 16.8 మిల్లీమీటర్లు, తుర్కపల్లి 0.8 మిల్లీమీటర్లు, మోటకొండూరు 12.0 మిల్లీమీటర్లు, బొమ్మలరామారం 1.0మిల్లీమీటర్లు, పోచంపల్లి 4.3 మిల్లీమీటర్లు, వలిగొండ 3.0 మిల్లీమీటర్లు, ఆత్మకూరు(ఎం)లో 1.5మిల్లీమీటర్లు, అడ్డగూడూరు 2.8 మిల్లీమీటర్లు, గుండాల 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రివేళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ఫ్రకటించింది.

యాదగిరిగుట్టలో ఈదురు గాలులతో భారీ వర్షం

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్టలో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజలు సుమా రు 40నిమిషాలు పాటు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. సుమారు రెండు గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

సూర్యాపేట జిల్లాలో

సూర్యాపేటటౌన్‌: సూర్యాపేట జిల్లాలో అత్యదికంగా గరిడేపల్లిలో 17.6మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా నడిగూడెంలో 0.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హుజూర్‌నగర్‌లో 16.5, పాలకీడులో 14.5, నేరేడు చర్లలో 9.6, మట్టంపల్లిలో 8.2, కోదాడ, పెన్‌పహాడ్‌లో 7.0, చిలుకూరులో 6.7, చింతలపాలెంలో 4.7, మేళ్లచెర్వులో 2.4, చివ్వెంలలో 2.2మద్దిరాలలో 1.3, తిరుమ లగిరిలో 1.2, మునగాలలో 0.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 4.3 మిల్లీమీటర్ల సగటు వర్షంపాతం నమోదైంది.

నేరేడుచర్ల: మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి, ఈదురుగాలులకు మేడారం, బక్కయ్యగూడెం, ముకుందాపురం, నేరేడుచర్లలోని పొలాలు నేలవాలాయి. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాజకీయ పార్టీల నాయకులు కోరారు.

కోతకు వచ్చిన పొలాలు నేలవాలి..

ఆత్మకూర్‌(ఎస్‌): పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురిసి పంటలు దెబ్బ తిన్నాయి. శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ఆత్మకూర్‌(ఎస్‌) మండల పరిధిలోని పూరు గ్రామంలో సుమారు 10ఎకరాలకు పైగా వరి పొలాలు నేలకొరిగాయి. 10రోజుల్లో కోతకు వచ్చిన పంట పొలాలు నేలపాలు కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన అవిరె మల్లయ్య వరి పొలం ఈదురుగాలికి నేలకొరిగి ధాన్యం రాలిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి అవిరె అప్పయ్య డిమాండ్‌ చేశారు.

తడిసిన ధాన్యం రాశులు

శాలిగౌరారం: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం ఈదురు గాలులు వీచి ఉరుముల, మెరుపులతో గంట పాటు భారీ వర్షం పడింది. వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయ్యాయి. చేతికొచ్చిన వరి చేలు పలు గ్రామాల్లో నేలకొరిగాయి. ఐకేపీ, శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్‌లో పోసిన ఽధాన్యం రాశులు తడిసి పోయాయి. ఈ అకాల వర్షంతో ఆరుగాలం కష్టించి పనిచేసిన రైతులకు ఆందోళన కలిగించింది.

కేతేపల్లి: మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి రైతులకు నష్టం వాటిల్లింది. వరికోత యంత్రాల సాయంతో ఇప్పటికే పంట కోసిన రైతులు ధాన్యాన్ని విక్రయానికి ఐకేపీ కేంద్రాలకు తరలించి ఆరబెడుతున్నారు. శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి ఐకేపీల్లోని ధాన్యం తడిసిపోయింది. ఆయా కేంద్రాల్లో చేర్చిన రైతులు ఆరబెడుతున్న సుమారు వంద క్వింటాళ్ల ధాన్యం తడిసింది. మరోవైపు పత్తి పంట చేను మీదనే తడిసి ముద్దయ్యింది. 20రోజులుగా ముమ్మరంగా పత్తి తీసే పనులు సాగుతున్నా కూలీల కొరత నెలకొంది. ఈ క్రమంలో కురిసిన వర్షానికి పత్తి చేను మీదనే తడిసి రంగు మారే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పిడుగుపాటుకు మహిళ మృతి

అడవిదేవులపల్లి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): పిడుగుపాటుకు మహిళ మృతిచెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని బాలెంపల్లి గ్రామ శివారులో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మొల్కచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని బాలాజీతండాకు చెందిన జటావత్‌ నాగమణి(30) ఉదయం ముగ్గురు మహిళ కూలీలతో కలిసి హరి అనే రైతు మిర్చి తోటలో కలుపు తీయడానికి వెళ్లారు. కాగా సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవగా ఆ ప్రదేశంలో ఒక్కసారిగా పిడుగుపడింది. దీంతో జటావత్‌ నాగమణి అక్కడికక్కడే మృతిచెందింది. మిగితా ముగ్గురు మహిళా కూలీలు స్పృహతప్పి పడిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు నాగమణి తండ్రి రమావత్‌ మంగ్తా ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శేఖర్‌ తెలిపారు. నాగమణికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

బాలెంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై మృతిచెందిన జటావత్‌ నాగమణి మృతదేహాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి తగిన నష్ట పరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

Updated Date - Oct 20 , 2024 | 12:42 AM