Share News

REVANTH REDDY : ఇందిరమ్మ ఇళ్ల నమూనాలు రెడీ

ABN , Publish Date - Jan 08 , 2024 | 05:26 AM

రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకం కింద ఆర్థికసాయం చేస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం..

REVANTH REDDY : ఇందిరమ్మ ఇళ్ల నమూనాలు రెడీ

మూడు డిజైన్లు రూపొందించిన గృహనిర్మాణ శాఖ అధికారులు

సర్కారు పరిశీలనలో నమూనాలు

వీటి ప్రకారం నిర్మిస్తేనే రూ.5 లక్షలు!

ప్రజా పాలనలో 25 లక్షల దరఖాస్తులు

అర్హులను తేల్చాక పథకం అమలు

హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకం కింద ఆర్థికసాయం చేస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఆ ఇళ్లను ఏ నమూనాలో నిర్మించాలో కూడా చెప్పనుంది. ఇందుకోసం గృహనిర్మాణ శాఖ అధికారులు మూడు రకాల ఇళ్ల నమూనాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. వేర్వేరు కొలతలతో రూపొందించిన ఈ మూడు డిజైన్లు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ మూడింటిలో ప్రభుత్వం ఏదో ఒక దానిని ఎంపిక చేస్తుందా? లేక మూడు డిజైన్లనూ ఎంపిక చేస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. సొంత జాగా ఉన్న వారికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తామని కాంగ్రెస్‌ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఎంపిక చేసిన నమూనా ప్రకారం ఇంటి నిర్మాణం చేపడితేనే ఈ సాయం అందిస్తారా.. అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు రూపొందించిన మూడు ఇళ్ల నమూనాల్లో.. సింగిల్‌ బెడ్‌రూం విధానంలో ఒకటి ఉండగా, మరో రెండు నమూనాలు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించినవిగా ఉన్నాయి. ఇంట్లోకి ప్రవేశించే ద్వారం మొదలుకుని వాష్‌ ఏరియా దాకా ప్రతిదీ ఎంత వెడల్పు, పొడవు, ఎత్తు ఉండాలనే వివరాలను ఈ డిజైన్లలో అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు.

తొలి నమూనాను డబుల్‌ బెడ్‌రూం ఇల్లుగా రూపొందించారు. ఇందులో.. బేస్‌మెంట్‌, పునాదులు (ప్లింత్‌ ఏరియా) 506 చదరపు అడుగుల్లో ఉండేలా, స్లాబ్‌ వేసిన తరువాత ఇంటి గోడలను (కార్పెట్‌ ఏరియా) 430 చదరపు అడుగుల్లో నిర్మించేలా ఈ నమూనాను తయారు చేశారు. రెండు బెడ్‌రూంలతోపాటు కిచెన్‌, హాల్‌, బాత్‌రూం ఉండేలా, ఇంటిపైకి మెట్లు నిర్మించేలా ప్రతిపాదించారు. ప్రభుత్వానికి అందిన మూడు డిజైన్లలో ఇదే పెద్ద నిర్మాణంగా ఉంది. మరొకటి కూడా డబుల్‌ బెడ్‌రూం మోడల్‌లోనే ఉన్నా.. కొంత తక్కువ విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం ఉంటుంది. ఇందులో..ప్లింత్‌ ఏరియా 560 చదరపు అడుగులు కాగా, నిర్మాణ ఏరియా మాత్రం 419 చదరపు అడుగుల్లోనే ఉండనుంది. ఇందులోనూ రెండు బెడ్‌రూంలు, కిచెన్‌, హాల్‌, బాత్‌రూంతోపాటు వాటర్‌ క్లోజెట్‌ (టాయిలెట్‌, వాష్‌ బేసిన్‌) ఉండేలా, ఇంటిపైకి మెట్లు నిర్మించేలా ప్రతిపాదించారు. ఇక మూడో నమూనాను సింగిల్‌ బెడ్‌రూం ఇంటి మోడల్‌లో రూపొందించారు. ఇది ఒక బెడ్‌రూం, హాల్‌, కిచెన్‌తోపాటు బాత్‌రూం, వాటర్‌ క్లోజెట్‌తో కూడి ఉండనుంది. ఈ మోడల్‌లో 390 చదరపు అడుగుల ప్లింత్‌ ఏరియా, 323 చదరపు అడుగుల నిర్మాణ ఏరియా ఉంటుంది. ఈ మూడు నమూనాల్లోనూ ఇంటిపైకి మెట్లు కూడా నిర్మించేలా రూపొందించారు.

25 లక్షలకు పైగా దరఖాస్తులు..!

కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఈ దరఖాస్తుల్లో ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం కోసం 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ జిల్లాల వారీగా ఆన్‌లైన్‌ చేయించే కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లో ఏ పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్నది తేలనుంది. ఇందులో భాగంగానే ‘ఇందిరమ్మ ఇళ్ల’ కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్నది కూడా వెల్లడి కానుంది. అందులో ఎంతమంది అర్హులనే విషయాన్ని తేల్చిన తరువాత పథకం అమలుకు ప్రభుత్వ మార్గదర్శకాలను విడుదల చేయనుంది. కాగా, గత ప్రభుత్వం కూడా సొంత జాగా ఉండి, ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఆర్థిక సాయంగా రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించింది. అందుకోసం ‘గృహలక్ష్మి’ పేరుతో దరఖాస్తులను కూడా స్వీకరించింది. దరఖాస్తు చేసుకునేందుకు గతేడాది ఆగస్టులో కేవలం మూడు రోజులు మాత్రమే గడువిచ్చింది. అయినా.. అంత తక్కువ సమయంలోనూ దాదాపు 15.05 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 10.05 లక్షల మందిని అర్హులుగా తేల్చింది. కాగా, ప్రస్తుతం కాంగ్రెస్‌ సర్కారు ఇందిరమ్మ ఇంటి పథకానికి రూ.5 లక్షల సాయం అందిస్తామని చెప్పడంతోపాటు స్థలం లేని వారికి సర్కారే స్థలం ఇచ్చి మరీ ఇంటి నిర్మాణానికి సాయం చేస్తామని చెప్పింది. పైగా దరఖాస్తులను కూడా ప్రతి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా స్వీకరించింది. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి.

మొదటి నమూనా

ప్లింత్‌ ఏరియా: 506

చదరపు అడుగులు

కార్పెట్‌ ఏరియా: 430

చదరపు అడుగులు

రెండు బెడ్‌రూంలు, హాల్‌, కిచెన్‌

రెండో నమూనా

ప్లింత్‌ ఏరియా: 560 చదరపు అడుగులు

కార్పెట్‌ ఏరియా: 419 చదరపు అడుగులు

రెండు బెడ్‌రూంలు, హాల్‌, కిచెన్‌

మూడో నమూనా

ప్లింత్‌ ఏరియా: 390

చదరపు అడుగులు

కార్పెట్‌ ఏరియా: 323

చదరపు అడుగులు

బెడ్‌రూం, హాల్‌, కిచెన్‌

Updated Date - Jan 08 , 2024 | 05:26 AM