Share News

నెరవేరిన ఎంఎంటీఎస్‌ కల

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:47 PM

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎంఎంటీఎస్‌ రైలు ఘట్‌కేసర్‌కు వచ్చేస్తుంది. మంగళవారం హైదరాబాద్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లింగంపల్లి - ఘట్‌కేసర్‌ల మధ్య నడిచే ఎంఎంటీఎస్‌ సేవలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

 నెరవేరిన ఎంఎంటీఎస్‌ కల
ఘట్‌కేసర్‌లోని ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌

లింగంపల్లి- ఘట్‌కేసర్‌ల మధ్య ఎంఎంటీఎస్‌ సేవలు

నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఘట్‌కేసర్‌, మార్చి 4 : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎంఎంటీఎస్‌ రైలు ఘట్‌కేసర్‌కు వచ్చేస్తుంది. మంగళవారం హైదరాబాద్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లింగంపల్లి - ఘట్‌కేసర్‌ల మధ్య నడిచే ఎంఎంటీఎస్‌ సేవలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎంఎంటీఎస్‌ రైలు రాక కోసం ఘట్‌కేసర్‌లోని రైల్వేస్టేషన్‌ను ముస్తాబు చేశారు. అయితే ఘట్‌కేసర్‌ వరకు ఎంఎంటీఎస్‌ రైలు కోసం నాలుగైదేళ్ల క్రితమే అన్ని పనులు పూర్తయినప్పటికీ రైళ్లు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. గతంలో ఎంఎంటీఎస్‌ సేవలు చర్లపల్లి వరకే ఉండడంతో ఘట్‌కేసర్‌ ఎంపీపీ, బీజేపీ నాయకుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ను, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి ఎంఎంటీఎస్‌ సేవలు ఘట్‌కేసర్‌ వరకూ పొడిగించాలని వివరించాడు. దీంతో వారు రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఎంఎంటీఎస్‌ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంది. ఎంఎంటీఎస్‌ సేవల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇక్కడి ప్రజల కల నెరవేడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎంటీఎస్‌ సేవలు ఘట్‌కేసర్‌ వరకు రావడం శుభపరిణామని, రవాణ ఇబ్బందులు తీరనున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 10:47 PM