Share News

ఆనాడు కేసీఆర్‌ పేషీలో ఒక్క దళితుడున్నారా?

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:12 AM

కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆయన పేషీలో ఒక్క దళితుడైనా ఉన్నారా అంటూ ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. యాదగిరిగుట్టలో జరిగిన చిన్న సంఘటనను చూపి ఏదో అయినట్లు బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా తప్పుడు చేస్తోందని మండిపడ్డారు.

ఆనాడు కేసీఆర్‌ పేషీలో ఒక్క దళితుడున్నారా?
జగిత్యాల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అడువాల జ్యోతికి కాంగ్రెస్‌ కండువా కప్పుతున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

చిన్న సంఘటనపై బీఆర్‌ఎస్‌ విష ప్రచారం..

ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌, బీర్ల అయిలయ్య

హైదరాబాద్‌/న్యూఢిల్లీ/జగిత్యాల, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆయన పేషీలో ఒక్క దళితుడైనా ఉన్నారా అంటూ ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. యాదగిరిగుట్టలో జరిగిన చిన్న సంఘటనను చూపి ఏదో అయినట్లు బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా తప్పుడు చేస్తోందని మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.. తెలంగాణ తొలి సీఎంగా దళితుడిని చేస్తానన్న కేసీఆర్‌.. చేశాడా అని ప్రశ్నించారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఆయన ఎలా అవమానించిందీ ప్రజలే చూశారన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు దళిత మంత్రులు ఎన్నిసార్లు కలవగలిగారని ప్రశ్నించారు. యాదగిరిగుట్టలో పూర్వమున్న వసతులనూ సీఎం రేవంత్‌ కల్పిస్తున్నారని.. గుట్టలో నిద్రచేసే వెసులుబాటు, కొబ్బరికాయలు కొట్టేందుకు ఏర్పాట్లు చేశారని విప్‌ అయిలయ్య అన్నారు. కాంగ్రె్‌సకు క్రెడిట్‌ దక్కుతుందని చెప్పి.. డిప్యూటీ సీఎం భట్టికి అవమానం జరిగిందంటూ బీఆర్‌ఎస్‌ విష ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. భట్టి కూర్చున్న కుర్చీ చిన్నగా ఉన్నందు వల్ల అలా కనిపిస్తోందని వివరణ ఇచ్చారు. మేనేజ్‌మెంట్‌ కోటాలో వచ్చిన కేటీఆర్‌కు.. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించే స్థాయి లేదని కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌కుమార్‌ అన్నారు. సీఎంను గురించి ఆయన పిచ్చిమాటలు మాట్లాడితే ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రిలో చేర్చడం ఖాయమని వ్యాఖ్యానించారు. రేవంత్‌ గురించి అనవసర వ్యాఖ్యలు చేస్తే హైదరాబాద్‌లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల్లో సీఎం రేవంత్‌కు ఉన్న ఆదరణ చూసి కేటీఆర్‌ ఓర్చుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ‘బిడ్డా కేటీఆర్‌..! మా సీఎం రేవంత్‌పైన మాట్లాడే స్థాయి నీకుందా? నీ భాష మార్చుకోక పోతే బట్టలు ఊడదీసి ఉరికిస్తం.. నువ్వు మొగోనివైతే లోక్‌సభ ఎన్నికల్లో సిరిసిల్లలో మెజారిటీ తెచ్చి చూపించు!’అని సవాల్‌ విసిరారు. రేవంత్‌ పట్ల కేటీఆర్‌ మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉందంటూ టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. కేసీఆర్‌ ఎక్కడ రాజకీయాలు మొదలుపెట్టి ఎక్కడ మంత్రి, డిప్యూటీస్పీకర్‌ అయ్యారో కేటీఆర్‌ చెప్పాలన్నారు. కేటీఆర్‌ ఇలాగేమాట్లాడితే తెలంగాణ ప్రజలు.. బీఆర్‌ఎ్‌సకు ఉన్న ప్రతిపక్ష హోదా లేకుండా చేసి బయటకు పంపుతారన్నారు.

రెండ్రోజుల్లో గొల్లకురమల కార్పొరేషన్‌

గొల్ల, కురమల కార్పొరేషన్‌ను మరో రెండ్రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు విప్‌ బీర్ల అయిలయ్య తెలిపారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్‌ ఏర్పాటుతో గొల్ల, కురుమలకు లబ్ధి చేకూర్చుతుందన్నారు. గొల్ల కురమలకు బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాటు అన్యాయం చేసిందని మండిపడ్డారు. గొల్ల కురుమలకు 4 అసెంబ్లీ సీట్లు కేటాయించి.. అధికారంలోకి రాగానే కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌ నిలబెట్టుకుంటున్నారని వెల్లడించారు.

మోదీకి చిత్తశుద్ధి లేదు:వీహెచ్‌

ఓబీసీ ప్రధాని అని చెప్పుకొనే నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చి బీసీలకు ఏం చెప్తారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. కులగణన చేస్తామని ప్రకటించడానికి వస్తున్నారా? అని నిలదీశారు. ఓట్ల కోసం అయోధ్య రామమందిరం, కాశీ గురించి మాట్లాడడమే తప్ప బీసీల అభివృద్ధి పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో వీహెచ్‌ మాట్లాడుతూ.. కులగణన కోసం మోదీని ఓబీసీ ఎంపీల బృందం ఆధ్వర్యంలో నాలుగు సార్లు కలిసినప్పటికీ హామీ ఇవ్వలేదన్నారు. కాగా, జగిత్యాలలో ఇటీవల జరిగిన మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ రెబల్‌గా పోటీ చేసి విజయం సాధించిన అడువాల జ్యోతి లక్ష్మణ్‌ కాంగ్రె్‌సలో చేరారు. సోమవారం జగిత్యాలలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కండువా కప్పి కాంగ్రె్‌సలోకి ఆహ్వానించారు.

Updated Date - Mar 12 , 2024 | 04:12 AM