Share News

జగన్‌తో కుమ్మక్కై రాష్ట్రాన్ని దెబ్బతీశాడు

ABN , Publish Date - Feb 12 , 2024 | 03:08 AM

కేసీఆర్‌ ఏ ముఖం పెట్టుకొని నల్లగొండకు వస్తాడని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేయకుండా నల్లగొండను ఎడారిగా మార్చిన వ్యక్తి.. ఈ నెల 13న నల్లగొండకు ఎలా వస్తున్నాడని నిలదీశారు.

జగన్‌తో కుమ్మక్కై రాష్ట్రాన్ని దెబ్బతీశాడు

ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్‌ నల్లగొండ వస్తాడు?

ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి

కేసీఆర్‌ వచ్చే రోజు నల్లగొండలో నిరసన

రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి కేసీఆర్‌ సభను అడ్డగిస్తాం

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నేడు రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌ దిష్టిబొమ్మల దహనం

నల్లగొండ/చండూరు, ఫిబ్రవరి 11: కేసీఆర్‌ ఏ ముఖం పెట్టుకొని నల్లగొండకు వస్తాడని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేయకుండా నల్లగొండను ఎడారిగా మార్చిన వ్యక్తి.. ఈ నెల 13న నల్లగొండకు ఎలా వస్తున్నాడని నిలదీశారు. కేసీఆర్‌ ముక్కు నేలకు రాసి, నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పి, రావాలని సూచించారు. ఏపీ మంత్రి రోజా పెట్టిన రొయ్యల పులుసు తిన్న కేసీఆర్‌.. రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నాడని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఏపీ సీఎం జగన్‌తో కలిసి బిర్యానీ తిని, కృష్ణా జలాలపై ఒప్పందాలు చేసుకొని.. తెలంగాణకు అన్యాయం చేశాడని ధ్వజమెత్తారు. ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌ జగన్‌తో కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీశాడన్నారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు నల్లగొండలో నిరసన కార్యక్రమాలు చేపడతారని చెప్పారు. కేసీఆర్‌ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును కుర్చీ వేసుకుని పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడన్నారు. నల్లగొండలోని గడియారం సెంటర్‌లో పింక్‌ కుర్చీ, పింక్‌ టవల్‌ను వేసి కేసీఆర్‌ ఫొటోను పెట్టి నిరసన తెలియజేస్తారని.. ఎల్‌ఈడీ టీవీలను ఏర్పాటు చేసి, అప్పట్లో కేసీఆర్‌ ఏం మాట్లాడాడో ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. కేసీఆర్‌ కుమార్తె ఇక్కడ బతుకమ్మ ఆడి, ఢిల్లీలో లిక్కర్‌ దందా చేసిందని ధ్వజమెత్తారు. 6 గ్యారెంటీల అమలు కోసం బడ్జెట్‌లో రూ.53 వేల కోట్లు ప్రవేశపెట్టామని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులకు కూడా కేటాయింపులు చేశామని చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌ పనులు నిలిచిపోవడానికి సోమేశ్‌కుమారే కారకుడని, రూ.25వేల కోట్లతో త్వరలో రోడ్డును నిర్మిస్తామని తెలిపారు.

సభను అడ్డుకుంటాం: రాజగోపాల్‌రెడ్డి

జిల్లా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే కేసీఆర్‌ నల్లగొండలోసభ నిర్వహిస్తున్నాడని, ఆ సభను అడ్డుకుంటామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. ఏపీ సీఎం జగన్‌తో అంటకాగిన కేసీఆర్‌, కేఆర్‌ఎంబీ ఫైళ్లపై సంతకం పెట్టి కేంద్రానికి అప్పజెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించా రు. 2016లో చర్లగూడెం ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన కేసీఆర్‌, రెండేళ్లలోనే పూర్తి చేస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. ప్రజలు పార్టీలకతీతంగా కేసీఆర్‌ సభను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.కాగా, నల్లగొండ సభను నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తం గా కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేయాలని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే్‌షరెడ్డి పిలుపునిచ్చారు.

తొక్కుకుంటూ వెళ్తాం: లింగయ్య యాదవ్‌

కేసీఆర్‌ నిర్వహించనున్న సభకు ఎవరైనా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నిస్తే వారిని తొక్కుకుంటూ వెళతామని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం బహిరంగ సభ ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 03:08 AM