Share News

బిహార్‌లో 11 స్థానాల్లో ఎంఐఎం పోటీ

ABN , Publish Date - Apr 04 , 2024 | 04:59 AM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం దూకుడు పెంచింది. జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు వివిధ రాష్ట్రాల్లో సాధ్యమైనన్ని సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమైంది. బిహార్‌లో 11 లోక్‌సభ స్థానాల్లో

బిహార్‌లో 11 స్థానాల్లో ఎంఐఎం పోటీ

కిషన్‌గంజ్‌ నుంచి అక్తరుల్‌ ఇమాన్‌ నామినేషన్‌..

యూపీలో 7, మహారాష్ట్రలో 5 సీట్లలో పోటీకి సన్నాహాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం దూకుడు పెంచింది. జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు వివిధ రాష్ట్రాల్లో సాధ్యమైనన్ని సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమైంది. బిహార్‌లో 11 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. బిహార్‌ ఎంఐఎం చీఫ్‌ అక్తరుల్‌ ఇమాన్‌ మరోసారి అక్కడి కిషన్‌గంజ్‌ నుంచి పార్టీ అభ్యర్థిగా బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. హైదరాబాద్‌ నుంచి వెళ్లిన నాంపల్లి శాసనసభ్యుడు మాజిద్‌ హుస్సేన్‌తో కలసి అక్తరుల్‌ ఇమాన్‌ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. తొలుత బిహార్‌లో 20 లోక్‌సభ స్థానాల్లో భావించినప్పటికీ పార్టీ పరిశీలకుల సిఫారసు మేరకు 11 స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఇటు ఉత్తరప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీలైన అప్నాదళ్‌ (కామెరవాడి), ప్రగతిశీల మానవ్‌సమాజ్‌ పార్టీ, రాష్ట్రీయ ఉదయ్‌ పార్టీల కూటమితో ఎంఐఎం పొత్తు కుదుర్చుకుంది. అక్కడి ఏడు స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నుంచి సిటింగ్‌ ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌ను మరోసారి అభ్యర్థిగా ఇప్పటికే ఎంఐఎం ప్రకటించింది. ఆ రాష్ట్రంలో మొత్తం 5 స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Updated Date - Apr 04 , 2024 | 09:40 AM