Share News

మూసీపై మెట్రో వంతెన!

ABN , Publish Date - Apr 28 , 2024 | 03:58 AM

హైదరాబాద్‌లో రెండో దశ మెట్రో పనుల్లో భాగంగా మూసీ నదిపై మెట్రో వంతెనను నిర్మించాలని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంల్‌) అధికారులు పరిశీలనలో గుర్తించారు.

మూసీపై మెట్రో వంతెన!

పిల్లర్ల మధ్య ఎక్కువ దూరంతో సవాలే..

బైరామల్‌గూడ-సాగర్‌ జంక్షన్‌లో మరింత ఎత్తులో ఎలివేటెడ్‌ కారిడార్‌

ఎయిర్‌పోర్ట్‌ మెట్రో అలైన్‌మెంట్‌ను పరిశీలించిన ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో రెండో దశ మెట్రో పనుల్లో భాగంగా మూసీ నదిపై మెట్రో వంతెనను నిర్మించాలని హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంల్‌) అధికారులు పరిశీలనలో గుర్తించారు. ఈ బ్రిడ్జి పిల్లర్లను ఒకదానికొకటి మధ్య ఎక్కువ గ్యాప్‌తో నిర్మించాల్సి ఉంటుందని.. ఇది సవాల్‌తో కూడుకున్నదని భావిస్తున్నారు. బైరామల్‌గూడ-సాగర్‌ జంక్ష్షన్‌లో ఇప్పటికే ఫ్లై ఓవర్లున్న నేపథ్యంలో అక్కడ వాటి కంటే మరింత ఎత్తులో మెట్రో లైన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. కాంగ్రెస్‌ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రెండో దశ 70 కిలోమీటర్ల పనులకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలనలు చకచకా జరుగుతున్నాయి. ఆయా కారిడార్లలోని రూట్‌మ్యా్‌పను ఇప్పటికే ఖరారు చేసిన నేపథ్యంలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తయారు చేసేందుకు మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత సర్కారు నివేదిక అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు, స్టేషన్ల నిర్మాణాలు, తదితర అంశాలను హెచ్‌ఏఎంల్‌ అధికారులు క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. ప్రధానంగా నాగోల్‌-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కారిడార్‌ను అత్యంత పటిష్ఠంగా చేపట్టేందుకు అడుగులు వేస్తున్నారు. శనివారం హెచ్‌ఏఎంల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఆధ్వర్యంలో సీఈఈ డీవీఎస్‌ రాజు, సీఎ్‌సటీఈ ఎస్‌కే దాస్‌, సీపీఎం ఆనంద్‌మోహన్‌ తదితరులు, సిస్ర్టా ఇంజనీరింగ్‌ కన్సల్టెన్సీ నిపుణులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు సుమారు 14 కిలోమీటర్ల వరకు కాలినడక చేపట్టి పలు అంశాలను గుర్తించారు. మూసీనది ప్రక్షాళన, అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఇక్కడ జాగ్రత్తగా పనులు చేపట్టాలని నిర్ణయించారు. మూసీపై మెట్రో వంతెనను నిర్మించాలని.. ఇది సవాల్‌తో కూడుకున్నదని గుర్తించారు. మూసీ దాటిన తర్వాత కొత్తపేట జంక్షన్‌ నుంచి వచ్చే రహదారికి అనుసంధానించడంతోపాటు స్థానికుల కోసం అదనపు స్టేషన్‌ ఏర్పాటు విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే బైరామల్‌గూడ-సాగర్‌ జంక్ష్షన్‌లో ఇప్పటికే ఫ్లై ఓవర్లున్న తరుణంలో అక్కడ వాటి కంటే మరింత ఎత్తులో మెట్రో లైన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అలాగే ఆ ప్రాంతంలోని మెట్రోస్టేషన్‌ ఎత్తును తగ్గించేందుకు గాను, మెట్రో అలైన్‌మెంట్‌ను ఫ్లై ఓవర్లకు కుడి వైపునకు మార్చాల్సి ఉంటుందని గుర్తించారు. ఇక చాంద్రాయణగుట్ట ఇంటర్‌చేంజ్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశముందని భావిస్తున్నారు.

Updated Date - Apr 28 , 2024 | 10:14 AM