మహిళలకు ‘మీ-సేవ’లు
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:34 PM
మహిళా సంఘాల ఆర్ధికాభివృద్ధికి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు తీసుకుని చిరువ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు.

జిల్లాలో 16 కేంద్రాల ఏర్పాటు
మేడ్చల్ జూలై 5(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మహిళా సంఘాల ఆర్ధికాభివృద్ధికి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు తీసుకుని చిరువ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి స్వయం సహాయక సంఘాల సభ్యులతో మహిళాశక్తి మీ-సేవ కేంద్రాలు ఏర్పాటు చేయిస్తోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. అవన్నీ గ్రామ పంచాయతీ, ప్రభుత్వ పాఠశాల, రైతువేదికతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రంనిర్వహణ బాధ్యత గ్రామైక్య సంఘాల(వీఓ)కు అప్పగించింది.
స్త్రీనిధి ద్వారా రుణం
మీ-సేవ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన రూ. 2.50 లక్షల రుణం స్త్రీనిధి ద్వారా అందజేస్తారు. అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, జీపీఎస్, బయోమెట్రిక్ పరికరాలు, కెమెరా, ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తీసుకున్న రుణం మీ సేవ కేంద్రం ప్రారంభమైన తర్వాత నెలనెలా చెల్లించాలి. గ్రామైక్య సంఘాల వద్ద డబ్బులుంటే ఆయా పరికరాలు కొనుగోలు చేసుకోవచ్చు. లేని వారు మాత్రం రుణం పొందవచ్చు.
చదువుకున్న వారు ఎంపిక..
గ్రామైక్య సంఘాల్లో(వీఓ) చదువుకున్న సభ్యురాళ్లను మీ- సేవ కేంద్రం ఆపరేటర్లుగా ఎంపిక చేశారు. త్వరలోనే వీరికి కేంద్రం నిర్వహణను, మీసేవ ద్వారా అందించే సేవలపై శిక్షణ ఇస్తారు. జిల్లాలో వందల సంఖ్యలో మీ - సేవ కేంద్రాలున్నాయి. వాటికి తోడుగా ఇంకా పారదర్శకమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
వీఓలకు అప్పగించాం...
మీ-సేవ కేంద్రాల నిర్వహణ మొత్తం మహిళా సంఘాలు చూసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో 16 కేంద్రాలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం. ఎంపిక చేసిన సభ్యులకు త్వరలోనే శిక్షణ ఉంటుంది. అది పూర్తికాగానే వచ్చే నెల ఆఖరుకు ప్రారంభించేలా చూస్తాం.
సాంబశివరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి